Begin typing your search above and press return to search.

లోకేష్ వెంట వ్యూహకర్త : పీకే బాణం జగన్ కి ఎదురు నిలుస్తుందా...!?

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఇపుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారబోతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అనే జవాబు వస్తోంది

By:  Tupaki Desk   |   23 Dec 2023 11:32 AM GMT
లోకేష్ వెంట వ్యూహకర్త : పీకే బాణం జగన్ కి ఎదురు నిలుస్తుందా...!?
X

ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే ఇపుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారబోతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అవును అనే జవాబు వస్తోంది. పీకే విత్ లోకేష్ అన్నది ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. హైదరాబాద్ నుంచి ఈ ఇద్దరూ విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానశ్రయంలో పీకే లోకేష్ కలసి కనబడడం ఒక సంచలనం అయితే ఈ ఇద్దరూ ఒకే కారులో కలసి వెళ్లడం మరో సంచలనం.

ఈ ఇద్దరూ చంద్రబాబుతో భేటీ అవుతున్నారు అనేది ఇపుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. అసలు తెలుగు రాజకీయాల్లో పీకే ఎంట్రీ జగన్ తోనే స్టార్ట్ అయింది. జగన్ 2017 జూలైలో జరిగిన ఆ పార్టీ ఆవిర్భావ సభలో పీకేని పరిచయం చేశారు. 2019 నాటికి పీకే ఏపీలో వైసీపీకి కన్సల్టెంట్ గా పనిచేశారు. 151 సీట్లలో జగన్ అధికారంలోకి వచ్చారు.

ఆ తరువాత చూస్తే పీకే వైసీపీకి పనిచేయకపోయినా ఆయన శిష్యులు ఐ ప్యాక్ టీం ద్వారా పొలిటికల్ కన్సల్టెన్సీగా సేవలు అందిస్తున్నారు. పీకే తన రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారాలని బీహార్ లో చాన్నాళ్లుగా ఉంటూ వస్తున్నారు. అయితే అవన్నీ సక్సెస్ కాకపోవడంతో ఆయన మళ్లీ ఎన్నికల వ్యూహకర్తగా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇక పీకే టీడీపీల బంధం ఎలా కుదిరింది అంటే చంద్రబాబు అరెస్ట్ అయిన వేళ ఢిల్లీలో లోకేష్ చాలా రోజులు గడిపారు. అపుడు పీకే టచ్ లోకి వచ్చారని అంటున్నారు. ఆనాటి నుంచి పీకే టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా ఉంటారు అని వచ్చిన వార్తలు ఇపుడు నిజం కాబోతున్నాయా అన్నదే చాలా మందిలో ఉంది. లోకేష్ తో కలసి ఇలా బహిరంగంగా పీకే కనిపించడం తో అంతా ఇది నిజమే అనుకుంటున్నారు.

ఇక చంద్రబాబుతో పీకే భేటీ అంటే టీడీపీకి ఆయన సేవలు కన్ ఫర్మ్ అని అంటున్నారు. ఆనాడు వైసీపీకి పీకే ఎన్నికల వ్యూహాలు రచించారు. ఇపుడు వైసీపీకి సిసైఅలీన్ ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీకి ఆయన కనుక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా మారితే మాత్రం జగన్ కి ఎదురు నిలిచినట్లే అంటున్నారు. పీకే వ్యూహాలతోనే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది అని అనుకుంటే ఈసారి టీడీపీ అధికారంలోకి కచ్చితంగా రావాలి.

అలా కాకుండా మళ్లీ వైసీపీయే గెలిస్తే మాత్రం పీకే వ్యూహాలనే మించే మ్యాజిక్ ఏదో జగన్ దగ్గర ఉందని అర్ధం చేసుకోవాల్సిందే. ఏది ఏమైనా పీకే ఇపుడు టీడీపీ వైపు వెళ్తున్నారు అంటే ఏపీలో టీడీపీకి విజయావకాశాలు పెరిగాయని అనుకుంటున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది.

మరో వైపు చూస్తే పీకే బాబుతో భేటీ అంశం మీద మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేస్తూ మెటీరియల్ మంచిదే మేస్తీ ఏమి చేయగలడు అంటూ సెటైర్లు వేశారు. ఇందులో మెటీరియల్ ఏదో మేస్తీ ఎవరో ఆయన చెప్పలేదు. మొత్తానికి ఏపీలో పీకే విత్ టీడీపీ అన్న టాపికి ట్రెండింగ్ అవుతోంది. మరి పీకే రాజకీయ వ్యూహాలు పసుపు పార్టీకి అందుతాయా అన్నది చూడాల్సిందే.