Begin typing your search above and press return to search.

ప్రశాంత్ కిషోర్ సైలెంట్.. పీకే వ్యూహాలకు డిమాండ్ తగ్గిందా?

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   18 March 2026 1:00 AM IST
ప్రశాంత్ కిషోర్ సైలెంట్.. పీకే వ్యూహాలకు డిమాండ్ తగ్గిందా?
X

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. గతంలో దేశంలో ఎక్కడ ఎన్నిక జరిగినా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన ఎక్కువగా ఉండేది. పార్టీలు, బడా నేతలు ఆయన నుంచి రాజకీయ వ్యూహాలను ఆశించేవారు. 2014 సార్వత్రిక ఎన్నికల నుంచి దేశ రాజకీయాల్లో ప్రశాంత్ కిషోర్ హవాయే నడిచింది. ఆయన వ్యూహాలతో చాలా రాష్ట్రాల్లో అధికారం చేతులు మారిందని, నేతల తలరాత తారుమైరందని ప్రచారం జరిగింది. అయితే 2014 తర్వాత ఫస్ట్ టైం ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన లేకుండా దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి.

2014లో ప్రధాని మోదీ కోసం పనిచేయడం ద్వారా ప్రశాంత్ కిషోర్ దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో ప్రధాని మోదీ తరఫున పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రముఖ పార్టీలకు వ్యూహాలను అందించారు. ఏపీలో వైసీపీ, తమిళనాడులో డీఎంకే, పశ్చిమబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఇలా ఆయన పనిచేసిన పార్టీలు అన్నీ ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ఘన విజయం సాధించాయి. దీంతో ప్రశాంత్ కిషోర్ కు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో తన సొంత రాష్ట్రం బిహార్ లో ప్రత్యేకంగా జన సురాజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ పార్టీని ప్రారంభించారు.

గత ఎడాది జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ ఘోరంగా ఓటమి చెందింది. దీంతో ప్రశాంత్ కిషోర్ క్రేజ్ ఆమాంతంగా పడిపోయిందని అంటున్నారు. ఈ కారణంగానే ప్రస్తుత ఎన్నికల్లో ఆయన వ్యూహాలను ఎవరూ కోరుకోవడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గతంలో పనిచేసిన తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కానీ, అధికారం ఆశిస్తూ ఎన్నికల రణ క్షేత్రంలోకి దిగిన పార్టీలు కానీ ప్రశాంత్ కిషోర్ వ్యూహాల కోసం ప్రయత్నించిన దాఖలాలు కనిపించడం లేదు.

తమిళనాడులో కొత్తగా ప్రారంభించిన టీవీకే పార్టీ మొదట్లో ప్రశాంత్ కిషోర్ ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ కూడా ప్రశాంత్ కిషోర్ తో చర్చలను నిలిపివేసినట్లు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ తో పనిచేయించుకోవాలంటే చాలా ఖరీదైన వ్యవహారమని, కానీ ఆయన వ్యూహాలు మాత్రం ఎందుకు పనిచేయవని బిహార్ ఎన్నికలతో తేలిపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. గెలిచే పక్షాన్ని ఎంచుకుని లాభపడటం తప్ప, ప్రశాంత్ కిషోర్ చేసింది, చేయగలిగింది ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగానే ప్రస్తుత ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రశాంత్ కిషోర్ ను దూరం పెట్టినట్లు చెబుతున్నారు.