Begin typing your search above and press return to search.

రూ.50 కోట్లు ఇస్తే నా ఆస్తులు రాసిస్తా!

తాజాగా ఇదే బాటలో అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ ఆయన ఘాటుగా స్పందించారు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 12:21 PM GMT
రూ.50 కోట్లు ఇస్తే నా ఆస్తులు రాసిస్తా!
X

ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా బాండ్‌ పేపర్‌ పైన సంతకాలు పెట్టి మరీ సవాళ్లు విసురుకునే స్థాయికి రాజకీయాలు చేరుకున్నాయి. మరికొందరు మీ హయాంలో ఏంటి? మా హయాంలో ఏంటి అంటూ గుళ్లల్లో ప్రమాణాలు చేసుకునేవరకు వెళ్తున్నారు.

తాజాగా ఇదే బాటలో అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. తనపై వచ్చిన ఆరోపణలపై వైఎస్సార్‌సీపీ ఆయన ఘాటుగా స్పందించారు.

తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని మండిపడ్డారు. ఇంకోవైపు 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయన్నారు. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని సవాల్‌ విసిరారు. ఈ మేరకు ఆయన మీడియా ఎదుట వంద రూపాయల స్టాంప్‌ పేపర్‌ పై సంతకం చేయడం గమనార్హం.

రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి టీడీపీ నేత పరిటాల సునీత జీర్ణించుకోలేకపోతున్నారని ధ్వజమెత్తారు. కొడిమి జగనన్న కాలనీలో కార్మికులను తాను కిడ్నాప్‌ చేశానంటూ తనపై వచ్చిన ఆరోపణలను తోపుదుర్తి తీవ్రంగా ఖండించారు.

రాప్తాడు నియోజకవర్గం కొడిమి జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం కోసం శాన్వి – లోటస్‌ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి వెల్లడించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి అయ్యేలా తాను చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు. శాన్వి సంస్థ నుంచి 55 లక్షల రూపాయలు అడ్వాన్స్‌ గా తీసుకున్న లోటస్‌ సంస్థ ప్రతినిధులు పనులు చేయకుండా వెళ్లిపోయారని వివరించారు.

శాన్వి సంస్థ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పోలీసులు కలకత్తా కార్మికులను అదుపులోకి తీసుకున్నారని తోపుదుర్తి వెల్లడించారు. దీనిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, సీపీఐ నేత రామకృష్ణ, ఎల్లో మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తప్పుడు ప్రచారం చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఎమ్మెల్యే తోపుదుర్తి హెచ్చరించారు. తనకు రెండు వేల కోట్ల రూపాయల అక్రమాస్తులు ఉన్నాయని చంద్రబాబు ఆరోపించారని ధ్వజమెత్తారు. ఇంకోవైపు రూ. 500 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతిలో కథనాలు వచ్చాయన్నారు. తనకు 50 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని ఆయన సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌ కు సిద్ధమా అని ప్రశ్నించారు.