జగన్ నమ్మకం బాబేనా ?
ఇక మరోసారి తమకు చాన్స్ వస్తుందని అది టీడీపీ రూపంలోనే దక్కుతుందని వైసీపీ అధినాయకత్వం గట్టిగా భావిస్తోంది.
By: Tupaki Desk | 5 Feb 2025 3:42 AM GMTఏపీలో టీడీపీ తప్పితే వైసీపీ. విభజన తరువాత రాష్ట్ర రాజకీయం ఈ విధంగానే పరిమితం అయిపోయింది. మూడు ఎన్నికలు జరిగాయి. ఈ మూడూ టీడీపీ వర్సెస్ వైసీపీగానే సాగాయి. ఇందులో రెండుసార్లు చంద్రబాబు గెలిస్తే ఒకసారి జగన్ గెలిచారు. ఇక మరోసారి తమకు చాన్స్ వస్తుందని అది టీడీపీ రూపంలోనే దక్కుతుందని వైసీపీ అధినాయకత్వం గట్టిగా భావిస్తోంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన ఎనిమిది నెలలు పూర్తి అయిందని ప్రజలకు చంద్రబాబు పాలన మీద ఒక స్పష్టత వచ్చిందని అన్నీ జనాలు గమనిస్తున్నారు అని జగన్ పార్టీ నాయకుల కీలక సమావేశంలో చెప్పారు. సంపద సృష్టిస్తాను అన్న బాబు అప్పులతోనే పాలన చేస్తున్నారని జగన్ అన్నారు.
సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని చెప్పి వాటిని పక్కన పెట్టేశారని జగన్ పార్టీ నేతలతో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అయిదేళ్ళలో 75 వేల మెడికల్ సీట్లను అదనంగా పెంచబోతోందని ఏపీలో అయితే తమకు కొత్తగా మెడికల్ సీట్లే వద్దని చంద్రబాబు ప్రభుత్వం లేఖ రాసి వైద్య విద్యను పేదలకు దూరం చేసిందని అన్నారు.
పెన్షనల్లో కోత పెడుతున్నారని పధకాలు ఆపేశారని ఆరోగ్యశ్రీ కూడా నిలుపుదల చేశారని జగన్ గుర్తు చేశారు. ఇవన్నీ పేదల వ్యతిరేక నిర్ణయాలుగానే చూడాలని అన్నారు. చంద్రబాబు పేదల వ్యతిరేక పాలనను మరింతగా జనంలో ఉంచి ప్రజలకు అర్ధం అయ్యేలా వివరించారని జగన్ కోరారు.
ప్రజలలో బాబు ప్రభుత్వం వైఫల్యాను ఎండగట్టాలని కూడా ఆయన కోరారు. మరో వైపు చూస్తే పార్టీ నాయకులు నిరంతరం జనంలో ఉండాలని జగన్ సూచించారు అని అంటున్నారు. ప్రజలలో మమేకం అవ్వాల్సిన సందర్భం ఇపుడే అని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు.
ప్రజలకు ఎప్పటికపుడు వాస్తవాలని తెలియచేయడంతో విజయవంతం అయితే ఆటోమేటిక్ గా వైసీపీ ముందుకు సాగుతుందని ఆయన చెప్పారని అంటున్నారు. ఇక 2019లో టీడీపీ వైసీపీకి చాన్స్ ఇచ్చింది. 2024లో వైసీపీ అధికారాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి కూటమికి ఇచ్చింది. అలాగే 2029లో మరోసారి అదే టీడీపీ బంగారు పళ్ళెంలో పెట్టి వైసీపీకే ఇస్తుంది అన్నది వైసీపీ అధినాయకత్వం బలమైన నమ్మకంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
ప్రజలకు రెండు ప్రభుత్వాల పాలన కళ్ళ ముందు ఉంది కాబట్టి వారే సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు అని అంటోంది. మరి జగన్ నమ్మకం బాబు మీదనేనా అన్నదే చర్చగా ఉంది. బాబు అప్పులూ తప్పులూ మరింతగా చేస్తే ఏపీలో రానున్న కాలమంతా వైసీపీదే అన్నది ఆ పార్టీ నేతల ఆలోచనగా ఉంది అని అంటున్నారు.