Begin typing your search above and press return to search.

పోలవరం ప్రాజెక్ట్ కీలక అప్ డేట్..చంద్రబాబు చేతుల మీదుగా !

పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించాలన్నది ఒక విధానపరమైన నిర్ణయం.

By:  Satya P   |   30 May 2026 4:00 AM IST
పోలవరం ప్రాజెక్ట్ కీలక అప్ డేట్..చంద్రబాబు చేతుల మీదుగా !
X

పోలవరం అన్నది ఇప్పటికి ఎనిమిది దశాబ్దాల పై దాటిన చరిత్ర. ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదన దశ నుంచి కలల నుంచి సాకారం దిశగా సాగడానికి ఏకంగా 80 ఏళ్ళ పై చిలుకు సమయం పట్టడం అంటే ఆశ్చర్యపడాల్సిందే. ఇంత సుదీర్ఘమైన సమయం తీసుకున్న ప్రాజెక్ట్ మరొకటి అయితే దేశంలోనే లేదు. కానీ ఏపీకి పోలవరం ప్రాజెక్ట్ ఒక బహుళార్ధక సాధక ప్రాజెక్టు, జీవనాడి అందువల్ల పోలవరం సంపూర్తి కోసం కూటమి ప్రభుత్వం 2024 నుంచి ఫోకస్ పెట్టి పనిచేస్తోంది పోలవరం ప్రాజెక్ట్ ని 2027 జూలైలో జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందే జాతికి అంకితం చేయాలని గట్టి పట్టుదలతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. ఈ క్రమంలో పోలవరం ఎడమ కాలువకు సంబంధించి కీలక అప్ డేట్ ఒకటి తెలుస్తోంది.

ఉత్తరాంధ్ర కోసం :

పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని ఉత్తరాంధ్ర ప్రాంతానికి తరలించాలన్నది ఒక విధానపరమైన నిర్ణయం. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి నీటిని అనకాపల్లి విశాఖ ప్రాంతాలకు తీసుకుని రావాలన్నది.

ఒక బృహత్తర కార్యక్రమం. దాంతో పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన పనులు ప్రస్తుతం చకచకా సాగుతున్నాయి అని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చూస్తే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులలో భాగంగా నేష‌న‌ల్ హైవేల‌ క్రాసింగ్ దగ్గర జరుగుతున్న వంతెనల నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నరు.

ఆగస్టులో శ్రీకారం :

దాంతో మరో మూడు నెలలలో పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి అవుతాయని అంటున్నారు. పోలవరం ఎడమ కాలువ నుంచి అనకాపల్లి వరకు గోదావరి జలాలు తరలించేలా ఆగష్టులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎడమ కాలువను ప్రారంభిస్తారని చెబుతున్నారు. దాంతో సమయం తక్కువగా ఉండడంతో పోలవరం ఎడమ ప్రధాన కాలువలో పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేసేందుకు చూస్తున్నారు. ఈ పనులలో ఏ మాత్రం జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను, ఏజెన్సీల ప్రతినిధులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరించడం విశేషం. అంటే పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తికి మరో మూడు నెలలు మాత్రమే ఉందని అంటున్నారు. ఆ మీదట గోదావరి జలాలు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర వైపు బిర బిరా పరుగులు తీస్తాయని అంటున్నారు.

వెలిగొండ ప్రాజెక్ట్ సైతం :

అదే విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా టన్నెల్-2 లో క్లిష్టమైన 5.2 కి.మీ లైనింగ్ పనులు పూర్తి చేశామని మంత్రి రామానాయుడు చెబుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో భాగంగా హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయ్యాయని ఆయన వివరించారు. కృష్ణా నదికి వరద వచ్చే నాటికి అప్రోచ్ ఛానెల్ లో ఉన్న లక్షా ఎనభైవేల క్యూబిక్ మీటర్ల మక్ తో పాటు, టన్నెల్-1లో ఉన్న మక్ తొలగింపు పనులు సైతం పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. జూన్ నెలాఖరు నాటికి వెలిగొండ కు సంబంధించి అవసరమైన పనులు పూర్తి చేసేలా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి రామానాయుడు చెబుతున్నారు.