Begin typing your search above and press return to search.

ఆ ప్ర‌శ్న‌లు అడ‌గొద్దు.. : దేశ చ‌రిత్ర‌లో తొలిసారి ప్ర‌ధాని ఆదేశం

దేశ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ చోటు చేసుకోని అనేక సంఘ‌ట‌న‌లు, తీసుకోని అనేక నిర్ణ‌యాలు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌యాం లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Feb 2026 6:00 PM IST
ఆ ప్ర‌శ్న‌లు అడ‌గొద్దు.. : దేశ చ‌రిత్ర‌లో తొలిసారి ప్ర‌ధాని ఆదేశం
X

దేశ చ‌రిత్ర‌లో మునుపెన్న‌డూ చోటు చేసుకోని అనేక సంఘ‌ట‌న‌లు, తీసుకోని అనేక నిర్ణ‌యాలు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌యాం లో జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఈ ప‌రంప‌ర‌లో ఇప్పుడు పార్ల‌మెంటు వేదిక‌గా.. కొన్ని ప్ర‌శ్న‌ల‌ను అడ‌గ‌డానికి వీల్లేదంటూ .. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం స్ప‌ష్టం చేసింది. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. అత్యంత వాడి వేడిగా సాగుతున్న ఈ స‌మావేశాల్లో ఏ పార్టీకి చెందిన స‌భ్యులైనా.. వారు అధికార ప‌క్ష‌మా? ప్ర‌తిప‌క్ష‌మా? అనే తేడా లేకుండా.. ఎవ‌రూ కూడా `ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌లు` అడ‌గానికి వీల్లేద‌ని.. దానికి స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం కూడా త‌మ‌కు లేద‌ని ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం లిఖిత పూర్వ‌కంగా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల‌కు స్ప‌ష్టం చేసింది.

ఏంటా ప్ర‌శ్న‌లు?

1) ప్ర‌ధాన మంత్రి కేర్స్ ఫండ్‌(ప్ర‌ధాని త‌ర‌చుగా చేసే సాయాలు)

2) జాతీయ ర‌క్ష‌ణ నిధి

3) ప్ర‌ధాన మంత్రి జాతీయ స‌హాయ నిధి

.... ఈ మూడు అంశాల‌కు సంబంధించిన ఎలాంటి ప్ర‌శ్న‌ల‌ను పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ ఎవ‌రూ ప్ర‌శ్నించరాద‌ని.. ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం పేర్కొంది. అంతేకాదు.. స‌భాప‌తి స్థానంలో ఉన్న వారు వీటిని ప‌రిహ‌రించాల‌ని.. ఒక‌వేళ ఎవ‌రైనా స‌భ్యుడు ప్ర‌శ్నించాల‌ని భావిస్తే.. స‌భా నియ‌మాల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కూడాప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం పేర్కొన‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌ల సెక్ర‌ట‌రీల‌కు.. ప్ర‌త్యేక ప‌త్రాన్ని పంపించారు.

ఎందుకు?

వాస్త‌వానికి ప్ర‌ధాని స్థానంలో ఉన్న వారు ఎవ‌రైనా.. ఉభ‌య స‌భ‌ల‌కు జ‌వాబుదారీగా వ్య‌వ‌హ‌రించాలి. అంటే.. ఉభ‌య స‌భ‌ల్లో లేవ‌నెత్తే ఏ ప్ర‌శ్న‌కైనా ఆయ‌న స‌మాదానం చెప్పాలి. కానీ, పై మూడు అంశాల్లో మాత్రం ఇప్పుడు త‌ప్పించుకున్న‌ట్టేన‌ని విప‌క్షాలు ఆందోళ‌న చేస్తున్నారు. పైగా.. ఇవి ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల నిధుల‌తో ముడిపడిన వ్య‌వ‌హారం కావ‌డం మ‌రో విశేషం. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌ధాని కార్యాల‌యం ఎందుకు ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంద‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. దీనికి ప్ర‌ధాన మంత్రి కార్యాల‌యం చెబుతున్న రీజ‌న్లు రెండు.

1) ఆయా ప‌థ‌కాల‌కు వ‌స్తున్న సొమ్ము ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నుల నుంచి కాదు. అందుకే.. తాము ఎవ‌రికీ జ‌వాబు దారీ కాద‌న్న‌ది ప్ర‌ధాని మాట‌.

2) ఈ ప‌థ‌కాల‌కు అందుతున్న సొమ్ము పూర్తిగా విరాళాల ద్వారా అందుతున్న సొమ్ము. కాబ‌ట్టి ఈ సొమ్మును ఎలా ఖ‌ర్చు చేయాల‌న్నది ప్ర‌ధాని విచ‌క్ష‌ణ‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే.. తాము స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. దీనిపై ప్ర‌తిప‌క్షాలు మండిప‌డుడుతున్నాయి.