Begin typing your search above and press return to search.

మోడీ స‌భ‌.. ప్ర‌ధాని ఏం తెస్తున్నారు.. ఇదే చ‌ర్చ‌..!

పెట్టుకునే మ‌రింత స‌హ‌కారం ఆకాంక్షిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌ధానితోనే మ‌రోసారి ప‌నుల‌కు పునః ప్రారంభం చేయిస్తున్నారు.

By:  Tupaki Desk   |   30 April 2025 10:01 PM IST
మోడీ స‌భ‌.. ప్ర‌ధాని ఏం తెస్తున్నారు..  ఇదే చ‌ర్చ‌..!
X

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మే 2న ఏపీకి రానున్నారు. ఆయ‌న నేరుగా రాజ‌ధాని అమ‌రావ‌తికి వ‌చ్చి.. నూత‌న రాజ‌ధాని నిర్మాణ ప‌నుల‌ను తిరిగి ప్రారంభించ‌నున్నారు. 2015లోనూ ఒక‌సారి ప్ర‌ధాని మోడీ చేతుల మీదుగానే.. శంకుస్థాప‌న ద్వారా ప‌నుల‌కు శ్రీకారం చుట్టారు.అయితే.. ఆయా ప‌నులు మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డం, శంకుస్థాపన చేసినా.. ప‌నుల‌కు స‌హ‌కారం అందించ‌క‌పోవ‌డం.. అప్ప‌ట్లో మోడీ చుట్టూ విమ‌ర్శ‌లు ముసురుకునేలా చేశాయి.

ఈ నేప‌థ్యానికి తోడు.. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి కూడా.. మోడీ అడ్డు చెప్ప‌లేదు. పైగా రాజ‌కీయ అవ‌స‌రాల రీత్యా అప్ప‌ట్లో జ‌గ‌న్ విష‌యంలో ప్ర‌ధాన మంత్రి త‌ట‌స్థ వైఖ‌రిని అవ‌లంబించారు. ఇది రాష్ట్రానికి చేటు చేసింది. ఇప్పుడు తాజాగా.. మ‌రోసారి చంద్ర‌బాబు నేతృ త్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ప‌రిస్థితి మారి.. ప‌నులు ప‌ట్టాలెక్కుతున్నాయి. కేంద్రంలోనూ చంద్ర‌బాబు భాగ‌స్వామిగా నే ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో కేంద్రం నుంచి కూడా రాజ‌ధానికి స‌హ‌కారం అందుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మ‌రింత స‌హ‌కారం ఆకాంక్షిస్తున్న సీఎం చంద్ర‌బాబు.. ప్ర‌ధానితోనే మ‌రోసారి ప‌నుల‌కు పునః ప్రారంభం చేయిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే మే 2న మ‌ధ్యాహ్నం ప్ర‌ధాని రాజ‌ధానికి వ‌చ్చి..ఇ క్క‌డి ప‌నుల‌కు శ్రీకారం చుడ‌తారు. అనంత‌రం.. భారీ ఎత్తున ప‌నులు ప్రారంభం కానున్నాయి. ఈ ద‌ఫా ఒకే సారి 65 వేల కోట్ల ప‌నుల‌ను ప్రారంభించ‌నున్నారు.

అయితే.. ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. గ‌తంలో రాజ‌ధాని శంకు స్థాప‌న‌కు వ‌చ్చిన ప్ర‌ధాని మ‌ట్టి, నీళ్లు(ప‌విత్ర‌మైన‌వే) తీసుకువ‌చ్చారు. మ‌రి ఇప్పుడు ఏం తెస్తున్నారంటూ .. నెటిజ‌న్లు ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. అంతేకాదు.. ఇప్పుడైనా.. ప్ర‌ధాని చేసే ప్రారంభాలు, శంకు స్థాపన‌ల కార‌ణంగా ప‌నులు పూర్తికావాల‌ని వారు కోరుతున్నారు. ఇదిలావుంటే.. ఇప్ప‌టికే రాజ‌ధానికి అప్పు లు ఇప్పించిన నేప‌థ్యంలో.. ఇంకేం చేస్తారంటూ.. బీజేపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.