మీడియాకు దూరంగా మోదీ.. న్యూజిలాండ్ జర్నలిస్ట్ ప్రశ్నపై హాట్ డిబేట్
ప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటనలో ఎదురైన ఆసక్తికర ప్రశ్న అంతర్జాతీయస్థాయిలో విస్తృత చర్చనీయాంశంగా మారింది.
By: Tupaki Desk | 11 July 2026 5:00 PM ISTప్రధాని నరేంద్ర మోడీ న్యూజిలాండ్ పర్యటనలో ఎదురైన ఆసక్తికర ప్రశ్న అంతర్జాతీయస్థాయిలో విస్తృత చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రధాని మోదీ అంతర్జాతీయ వేదికలపై మీడియాతో ఎందుకు మాట్లాడరని న్యూజిలాండ్ జర్నలిస్ట్ వేసిన ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ అధికారి రుద్రేంద్ర టాండస్ స్పందించిన తీరు హాట్ టాపిక్ అవుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకులకు, మీడియాకు మధ్య ఉండాల్సిన బాధ్యతాయుతమైన సంబంధంపై ఈ ప్రశ్న మరోసారి చర్చను రేకెత్తించిందని అంటున్నారు.
న్యూజిలాండ్‌లో భారత దౌత్యవేత్తలతో జరిగిన ముఖాముఖి సమావేశంలో, అక్కడి జర్నలిస్ట్ ప్రధాని మోడీని ఉద్దేశించి "ప్రధాని మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు?" అని సూటిగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ సీనియర్ అధికారి రుద్రేంద్ర టాండన్ దౌత్యపరంగా స్పందించారు. ఒక ప్రభుత్వ అధికారిగా ప్రధాని వ్యక్తిగత రాజకీయ శైలిపై వ్యాఖ్యానించడం సముచితం కాదని పేర్కొంటూనే, భారత రాజకీయాల్లోని మారుతున్న పోకడలను ఆయన వివరించారు. మధ్యవర్తులైన మీడియా కంటే నేరుగా ఓటర్లతో సంభాషించుకోవడానికే తమ ప్రధాని మోడీ మొగ్గు చూపుతారని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రత్యక్ష ప్రజా సంబంధాల కళలో మోడీ అత్యంత నైపుణ్యం సాధించారని, ప్రజలతో ఆయనకున్న ఈ బలమైన అనుబంధమే వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసిందని టాండన్ విశ్లేషించారు. వాస్తవానికి, ఆధునిక రాజకీయాల్లో డిజిటల్ మాధ్యమాలు, సోషల్ మీడియా పెరిగిన తర్వాత సంప్రదాయ మీడియా సమావేశాల పాత్ర మారుతోందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఒక నాయకుడు నేరుగా ప్రజలతో మమేకం అయినప్పుడు, సమాచారం వేగంగా ప్రజలకు చేరుతుందని, మోడీ వ్యూహం అదేనని వారు భావిస్తున్నారు.
కాగా, ప్రధాని మోదీ న్యూజిలాండ్ పర్యటన చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత ఒక భారత ప్రధాని న్యూజిలాండ్‌లో పర్యటించడం అక్కడి భారతీయ ప్రవాసులలో ఉత్సాహాన్ని నింపింది. ఈ పర్యటన గౌరవార్థం ఆక్లాండ్‌లోని ప్రసిద్ధ 'స్కై టవర్'ను భారత త్రివర్ణ పతాక రంగులతో అలంకరించడం విశేషం. ఈ ఏడాది ప్రారంభంలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఉచిత వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో, ఈ పర్యటన ఆర్థిక, దౌత్యపరంగా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని అంటున్నారు.
మరోవైపు ప్రధాని మోదీ మీడియా సమావేశాలకు దూరంగా ఉంటారనే విమర్శ గతంలోనూ విదేశీ మీడియాలో వినిపించింది. గత మే నెలలో నార్వే పర్యటనలో కూడా హెల్లే లింగ్ అనే జర్నలిస్ట్ ఇదే తరహా ప్రశ్నను అడగగా, అప్పుడు ప్రధాని ఎటువంటి స్పందన ఇవ్వకుండా ముందుకు సాగిపోయారు. ప్రజాస్వామ్యంలో పాలకుడు మీడియాకు జవాబుదారీగా ఉండాలని అంతర్జాతీయ మీడియా వాదిస్తుంటే, ప్రజలతో నేరుగా కనెక్ట్ అవ్వడమే ఆధునిక కాలపు సక్సెస్ ఫార్ములా అని ప్రధాని మోదీ అభిమానులు సమర్థిస్తున్నారు.
