మోడీ విశాఖ టూర్ ఫిక్స్- ఏ వరాలు ఇస్తారో ?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు త్వరలో రానున్నారు. ఆయన ఈ టూర్ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తారని తెలుస్తోంది.
By: Satya P | 26 Feb 2026 9:08 AM ISTప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు త్వరలో రానున్నారు. ఆయన ఈ టూర్ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యటిస్తారని తెలుస్తోంది. ప్రధాని మోడీ నక్కపల్లి పర్యటనకు వస్తున్నారు అని అంటున్నారు. పాయకరావు పేట నియోజకవర్గంలో ఉన్న నక్కపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు ప్రధాని మోడీ చేయబోతున్నారు అని అంటున్నారు. ఇక ప్రధాని టూర్ తొందరలోనే ఉంటుందని తెలియడంతో జిల్లాలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
మార్చి నెలలో టూర్ :
ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ఉమ్మడి విశాఖ జిల్లా టూర్ నేపథ్యంలో నక్కపల్లిలో హెలిపాడ్ వద్ద ఏర్పాట్లు అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ పరిశీలించారు. మార్చి నెలలో భారత ప్రధానమంత్రి జిల్లాలో పర్యటన సందర్భంగా నక్కపల్లి మండలం కాగిత విలేజీ వద్ద హెలిపాడ్ స్థలాన్ని ఆమె సందర్శించారు. హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రాంతం, భద్రతా ఏర్పాట్లు, రహదారి సౌకర్యాలు, తాత్కాలిక మౌలిక వసతుల సిద్ధతపై సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కట్టుదిట్టమైన చర్యలు :
ఇక దేశ ప్రధాని వస్తున్నారు. అందులోనూ నక్కపల్లి వంటి ప్రాంతానికి రావడంతో హెలిపాడ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేయాలని, పోలీసు శాఖతో సమన్వయం బలోపేతం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీఐపీ రూట్‌లో రహదారుల మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు సమగ్రంగా ఏర్పాటు చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాలు ఎటువంటి అంతరాయం లేకుండా సిద్ధంగా ఉంచాలని తెలిపారు. అలాగే ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించి ప్రతి అంశాన్ని ముందుగానే సమీక్షించుకోవాలని పేర్కొన్నారు. ప్రధాని పర్యటన విజయవంతం కావడానికి ప్రతి శాఖ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో అభివృద్ధికి :
ప్రధాని తాజా టూర్ లో అనకాపల్లి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు అని అంటున్నారు. గత ఏడాది నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించారు. మళ్ళీ ఏడాది తరువాత ఆయన రావడంతో ప్రధాని సభను విజయవంతం చేసేందుకు అటు అధికారులు ఇటు కూటమి నేతలు కూడా కృషి చేస్తున్నారు. విశాఖ జిల్లా టూర్ లో ప్రధాని మోడీ ఏపీకి సంబంధించి ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ప్రధాని ఏ వరాలు మోసుకుని వస్తారో.
