Begin typing your search above and press return to search.

పిఠాపురం హౌస్ ఫుల్ !

పిఠాపురంలో ఇపుడు పొలిటికల్ హీట్ చూస్తే ఎన్నడూ లేని విధంగా ఉంది.

By:  Tupaki Desk   |   22 April 2024 3:00 AM GMT
పిఠాపురం హౌస్ ఫుల్ !
X

పిఠాపురం గురించే ఇపుడు ఎక్కువగా చర్చ సాగుతోంది. మామూలుగా చూస్తే ఇప్పటిదాకా పిఠాపురం గురించి రాజకీయంగా పెద్దగా ఫోకస్ పెట్టిన వారు ఎవరూ లేరు. అలాంటి సందర్భం కూడా రాలేదు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఎపుడైతే ప్రకటించారో నాటి నుంచే పిఠాపురం టాక్ ఆఫ్ ది ఏపీ అయిపోయింది. పిఠాపురంలో ఇపుడు పొలిటికల్ హీట్ చూస్తే ఎన్నడూ లేని విధంగా ఉంది.

నిజానికి పిఠాపురంలో పవన్ పోటీ అని ప్రకటించిన మరుక్షణం అక్కడ ఉన్న లాడ్జీలు, హొటెళ్ళు అన్నీ కూడా హౌజ్ ఫుల్ అయిపోయాయి. మే 11 దాకా అక్కడ నో వేకెన్సీ బోర్డు కనిపిస్తోంది. మే 11తో ప్రచారం సమాప్తమవుతుంది. బయట నుంచి వచ్చిన వారు ఎవరూ ఉండకూడదు. దాంతో అపుడే ఖాళీ అవుతుంది అని అంటున్నారు.

ఇక పిఠాపురం లాంటి చోట్ల ఏపీలో మొత్తం వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులు ప్రముఖులు దండ యాత్ర చేసినట్లుగా వస్తూంటే లాడ్జీలు హొటల్స్ ఏమి సరిపోతాయని అంటున్నారు. దాంతో మే 11 దాకా ఉండేందుకు ఇళ్ళను కూడా అద్దెకు తీసుకుంటున్నారు. దాంతో ఇళ్ళు కూడా ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ తో కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపు కోసం రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు అభిమానులు పారిశ్రామిక వేత్తలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పిఠాపురానికి వచ్చి విడిది చేస్తున్నారు అని అంటున్నారు. దాంతో పిఠాపురం లో రాజకీయ సందడి మామూలుగా లేదు. ఎక్కడ చూసినా గోదావరి భాష యాసను డామినేట్ చేస్తూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కొత్త ముఖాలు కనిపిస్తున్నాయట.

పవన్ కోసం పెద్ద ఎత్తున బెటాలియన్స్ దిగిపోతున్నాయని అంటున్నారు. ఈసారి పవన్ గెలుపు కాదు ఆయనకు భారీ మెజారిటీ తీసుకుని రావాలని అది కరవు తీరిపోయేలా ఉండాలని తాపత్రయపడుతున్నారు. దాంతో పిఠాపురంలో ప్రతీ ఒక్క ఇంటికీ పదుల సంఖ్యలో కాదు వంద్లా సంఖ్యలోనే నాయకులు జనసేన తరఫున కనిపిస్తున్నారు. అంతే కాదు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అన్నట్లుగా ఒకటికి రెండు సార్లు ప్రతీ రోజూ ప్రతీ ఇంటికీ వెళ్తున్నారు.

ఇక జనసేన అభిమానులు అనుచరులు ఇతర జిల్లాల నుంచి వచ్చి పవన్ కోసం ప్రచారం చేస్తామని ఆఫీసుకు రావడంతో అక్కడ అంతా కిటకిటలాడుతోంది. ఇక ఉగాది నుంచి పిఠాపురంలోనే మెగాబ్రదర్ నాగబాబు మకాం వేశారు. మొత్తం పవన్ ఎన్నికల ప్రచారం అంతా ఆయనే చూస్తున్నారు.

అదే విధంగా ఆయన టీడీపీతో కో ఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. పిఠాపురంలో టీడీపీ కీలక నేత వర్మ ఉన్నారు. ఆయన తన అనుచర గణంతో జనసేన గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఇక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి వంగా గీత గెలుపు కోసం ఆ పార్టీ కూడా బలగాలని దించుతోంది. ఇతర జిల్లాలకు చెందిన కీలక నేతలు అంతా పిఠాపురం వస్తున్నారు. వారు కూడా లాడ్జీలను బుక్ చేసుకున్నారు. మండలానికి ఒక సీనియర్ నేతను పెట్టి మరీ వైసీపీ ప్రచారాన్ని గట్టిగా చేస్తోంది.

ఎమ్మెల్యే అభ్యర్ధి వంగా గీత అయితే అలుపు లేకుండా ప్రతీ ఇంటినీ తానే స్వయంగా టచ్ చేస్తున్నారు. ఆమె ఇప్పటికే ఒకటికి రెండు రౌండ్లు గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఆమె గతంలో ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. దాంతో ఆమె అనుభవం పలుకుబడి బాగా ఉపయోగపడుతున్నాయి. పార్టీ మొత్తాన్ని ఏకత్రాటిపైకి ఉంచడంతోనూ వంగా గీత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు.

అలాగే సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడ గీత విజయానికి పూర్తిగా సహకరిస్తున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్నా ఈ ఎన్నికల్లో వంగా గీత ప్రత్యేకమైన అభ్యర్ధిగా ఉన్నారు. ఆమె విద్యాధికురాలుగా ఉన్నారు. దేశంలో పెద్ద సభలు అయిన రెండు చట్టసభలు లోక్ సభ రాజ్యసభలలో ఆమె పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు.

అలాగే జెడ్పీ చైర్మన్ గా చేశారు. ఒకసారి అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచారు. అది కూడా పిఠాపురం నుంచే. ఈసారి కూడా అక్కడ నుంచే పోటీ చేసి విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఆమెకు ఉన్న మరో పేరు ఓటమి ఎరుగని లేడీ లీడర్ అని. ఈ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కౌట్ అవుతుందని ఆమె భావిస్తున్నారు.