వర్మను అలా వదిలేస్తారా?
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ రాజకీయ భవిష్యత్తుపై విస్తృత చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 7 April 2025 9:48 PM ISTపిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ రాజకీయ భవిష్యత్తుపై విస్తృత చర్చ జరుగుతోంది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా టీడీపీలో కొనసాగుతున్న వర్మ.. గత ఎన్నికల ముందు జనసేనాని పవన్ కల్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు. ఎన్నికల్లో గెలిచిన వెంటనే మాజీ ఎమ్మెల్యే వర్మకు తగిన న్యాయం చేస్తామంటూ అప్పట్లో హామీ ఇచ్చిన టీడీపీ, జనసేన ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం ఆయన అనుచరులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కేడరుకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు వర్మకు పదవి నివ్వడం టీడీపీ అంతర్గత విషయమంటూ జనసేన తప్పుకోవడమే కాకుండా, ప్రస్తుతం వర్మను అవమానించేలా ఆ పార్టీ నేతలు వ్యవహరించడంతో అగ్గి రాజుకుంటోంది. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు వెన్నుదన్నుగా నిలవాల్సిన టీడీపీ అధిష్టానం మీనమేషాలు లెక్కిస్తోందని టీడీపీ కేడరు కన్నెర్ర జేస్తోందని అంటున్నారు.
పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు బలమైన అనుచర గణం ఉంది. గత ఎన్నికల్లో టికెట్ కన్ఫార్మ్ అనుకున్న దశలో ఉరుములేని పిడుగులా జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురంలో వాలిపోవడంతో వర్మక సీటుకు ఎసరు వచ్చిన విషయం తెలిసిందే. అయితే టీడీపీకి కంచుకోట వంటి పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయించడంపై అప్పట్లోనే టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. కానీ, అధిష్టానం జోక్యంతో మాజీ ఎమ్మెల్యే వర్మతోపాటు కార్యకర్తలు అంతా జనసేనాని పవన్ గెలిచేందుకు సహకరించారు. ఎన్నికల అనంతరం తన విజయానికి వర్మ చేసిన కృషిని ప్రస్తుతించిన పవన్, ఇప్పుడు ప్లేటు మార్చారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తన సోదరుడు, తాజాగా ఎమ్మెల్సీ అయిన నాగబాబు పిఠాపురంలో వర్మపై విమర్శలు చేస్తుండటం, ఆయనను అవమానించేలా ప్రవర్తిస్తుండటంపై టీడీపీ కేడర్ మనస్తాపానికి గురవుతోంది. ఈ విషయంలో నాగబాబును వారించకపోవడంతోపాటు వర్మ విషయంలో పవన్ ఏ మాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
మరోవైపు టీడీపీ అధిష్టానం కూడా తమ సీనియర్ నేతకు జరుగుతున్న అవమానాలపై పెదవి విప్పకపోవడం చర్చకు తావిస్తోంది. అగ్రవర్ణాలకు చెందిన రాజకీయంగా మైనార్టీ కావడం వల్లే వర్మ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అంటూ కేడర్ ప్రశ్నిస్తోంది. పిఠాపురంలో వర్మపై జనసేన విమర్శలకు దిగడమే కాకుండా, ఆయన అనుచరులపై కేసులు పెట్టేంతవరకు వ్యవహారం వెళ్లినా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకోకపోవడంతో సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే టీడీపీ అధిష్టానం మనుసులో ఏముందో? వర్మతో ఏం చెబుతోందో బహిర్గతమవడం లేదు. తనకు ఎంత అవమానం జరిగినా, తాను చంద్రబాబు సైనికుడినంటూ వర్మ చెప్పుకొస్తుండటం ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన ప్రతిసారి వర్మ పేరు ఉంటుందని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ, వారి ఆశలు నెరవేరడం లేదు. దీంతో త్వరలో జరగబోయే పదవుల పందేరంలో అయినా వర్మకు చాన్స్ వస్తుందా? లేదా? అన్నది మరోమారు చర్చకు తావిస్తోంది.
