Begin typing your search above and press return to search.

పిఠాపురం వర్మ మళ్ళీ ఫైర్...మ్యాటర్ క్లియర్

తాను ఇటీవల కాలంలో జరుగుతున్న విషయాలను గమనిస్తున్నాను అని ఆయన అధికారుల మీద ఫైర్ అయ్యారు.

By:  Satya P   |   13 March 2026 9:10 PM IST
పిఠాపురం వర్మ మళ్ళీ ఫైర్...మ్యాటర్ క్లియర్
X

పిఠాపురం వర్మగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఎస్వీ ఎస్ ఎన్ వర్మ ఆగ్రహంగా ఉన్నారు. అది తనకేదో నామినేటెడ్ పదవి దక్కలేదనో లేక తనకు అధికార అందలాలు లభించలేదనో కానే కాదు, తన అధినాయకుడు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవమానం జరిగింది అన్నది పిఠాపురం వర్మ తీవ్ర ఆరోపణ. పెద్దాయన కూటమికి పెద్ద దిక్కు అయిన బాబు విషయంలో ఇలా చేస్తారా అని పిఠాపురం వర్మ అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నారు. ఇలాగైతే చాలా కష్టమని కూడా చెప్పేస్తున్నారు.

ఫోటో చిన్నగా వేస్తారా :

ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో చిన్నగా జస్ట్ స్టాంప్ సైజులో వేస్తారా అని పిఠాపురం వర్మ అధికారుల మీద గరం గరం అవుతున్నారు. అసలు ఏమనుకుంటున్నారు అని కూడా నిలదీస్తున్నారు స్థానికంగా జరిగిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు ఫోటోని మరీ చిన్నగా వేయడం పట్ల వర్మ అయితే తట్టుకోలేకపోతున్నారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదని పిఠాపురం మునిసిపల్ అధికారులకు ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసారు. విషయం ఏంటి అంటే స్వచ్చాంద్రా శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న వర్మ చంద్రబాబు ఫోటో చిన్నగా ఉండడం చూసి సీరియస్ అయ్యారు.

ఎందుకిలా చేస్తున్నారు :

తాను ఇటీవల కాలంలో జరుగుతున్న విషయాలను గమనిస్తున్నాను అని ఆయన అధికారుల మీద ఫైర్ అయ్యారు. ఈ మధ్య జరిగే ప్రతీ కార్యక్రమంలో చంద్రబాబు ఫోటోని తీసివేయడం లేదా చిన్నగా వేయడం చూస్తున్నాను అని కూడా అంటున్నారు. ఈ మధ్యనే జరిగిన సంక్రాంతి సంబరాలలో కూడా చంద్రబాబు ఫోటో పెట్టకపోవడం ఏమిటి అని వర్మ అధికారులను సూటిగానే ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఫోటోనే తీసివేస్తారా ఇంతకంటే దారుణం ఉంటుందా అని వర్మ అంటున్నారు.

వారే చిచ్చు పెడుతున్నారు :

ఒక వైపు పదిహేనేళ్ళ పాటు ఏపీలో కూటమి పార్టీలు కలసి ఉండాలని పెద్దలంతా చెబుతున్నారని ఆ విధంగా ప్రభుత్వం కూడా ఉందని కానీ అధికారులు మాత్రం ఇవేమీ పట్టనట్లుగా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అయితే ఈ విషయాల మీద ఎంత సహనంగా ఉన్నా క్యాడర్ అయితే తన మాట అసలు వినే పరిస్థితిలో లేరని వర్మ తేల్చి చెప్పేసారు. ఇలా దారుణమైన తీరులో అధికారులు ఉంటే ఎలా అని ఆయన అంటున్నారు.

తప్పు పట్టాల్సి ఉంటుంది :

కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయని, ఇందులో ఏదో ఒక పార్టీకి అగౌరం జరిగినా మిగిలిన రెండు పార్టీలనూ తప్పు పడతారు అని వర్మ అన్నారు. ఆ పరిస్థితికి అధికారులు కారణం కారాదని ఆయన హితవు చెప్పారు. మా నాయకుడికే గౌరవం ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఎలా అని వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పని లో పనిగా వర్మ చేసిన త్యాగం గురించి కూడా వర్మ అనుచరులు గుర్తు చేస్తున్నారు. కూటమి ధర్మానికి కట్టుబడి పవన్ కోసం గత ఎన్నికల సమయంలో తన ఎమ్మెల్యే సీటునే త్యాగం చేశారు అని వారు అంటున్నారు. మరి కూటమి అంతా ఒక్కటిగా ఉండాలని పై స్థాయిలో కోరుకుంటూంటే దిగువ స్థాయిలో మాత్రం ఈ విధమైన పరిస్థితి ఉంటే ఎలా అన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. బాబు ఫోటో స్టాంప్ సైజా అని వర్మ చేసిన బిగ్ సౌండ్ పిఠాపురానికే పరిమితం అవుతుందా లేదా పై స్థాయిలో రీ సౌండ్ చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది.