Begin typing your search above and press return to search.

జనసేన రివర్స్ గేర్.. పిఠాపురంలో దూకుడేనా?

జనసేనాని పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తరచూ గొడవలు జరుగుతుండటాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.

By:  Tupaki Political Desk   |   22 April 2026 4:07 PM IST
జనసేన రివర్స్ గేర్.. పిఠాపురంలో దూకుడేనా?
X

పిఠాపురంలో టీడీపీ నేత వర్మ వర్సెస్ జనసేన వివాదం మరింత ముదురుతోంది. ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించాలని జనసేన పార్టీ నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్మ విషయంలో వెనక్కి తగ్గకూడదన్నట్లు జనసేన నేతలు భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి ఉదాహరణగా జనసేన కీలక నాయకురాలు ముద్రగడ క్రాంతి చేసిన ట్వీట్ ను చూపుతున్నారు. టీడీపీ నేత వర్మపై పలు ప్రశ్నలు సంధిస్తూ క్రాంతి ‘ఎక్స్’లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

పిఠాపురంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటోను ముద్రించక పోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మంగళవారం జనసేనకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబుతో వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సీఎం ఫొటో లేకపోవడం, ప్రొటోకాల్ ఉల్లంఘనగా భావిస్తూ జిల్లా కలెక్టర్ కు మాజీ ఎమ్మెల్యే వర్మ ఫిర్యాదు చేశారు. అయితే ప్రతిసారి వర్మ ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వివాదాలు రేపుతున్నారని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

జనసేనాని పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో తరచూ గొడవలు జరుగుతుండటాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ముద్రగడ క్రాంతి చేసిన ట్వీట్ లో ఇదే అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కూటమి ఏర్పాటులో కీలకంగా పనిచేయడమే కాకుండా, ప్రభుత్వంలో రెండో స్థానంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మ వైఖరి వింతగా ఉందంటూ జనసేన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

‘‘వర్మ అసలు మీ ఉద్దేశ్యం ఏమిటో అర్ధం కావడం లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం దగ్గర నుంచి మీ వైఖరి వింతగానే ఉంది. ఏదో రకంగా రచ్చ చేయడమే మీ పనిగా కన్పిస్తోంది.’’ అంటూ ముద్రగడ క్రాంతి ధ్వజమెత్తారు. పిఠాపురం అభివృద్ధి కమిటీ సమావేశంలో ఫొటోల గురించి రగడ సృష్టించడం ఏమిటి? ఈ రెండేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి రూ.600 కోట్లు వెచ్చించారు. ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు కదా. అయినా చీటికీ మాటికీ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసేలా వర్మ ప్రవర్తన ఉందంటూ క్రాంతి మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత, ఎన్డీయేలో భాగస్వామి అనే విషయం మరిచిపోయారా? అంటూ ప్రశ్నలు సంధించారు.

జనసేన అధినేత ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలోనే ఇలా వ్యవహరిస్తే ఏమని అర్థం చేసుకోవాలని క్రాంతి నిలదీశారు. ఇప్పటికే వర్మ గురించి జనాలు రకరకాలుగా అనుకుంటున్నారని, కూటమిలో చిచ్చు పెట్టేలా వర్మ వ్యవహారం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయంటూ క్రాంతి ఆరోపించారు. ఏమైనా తేడాలుంటే, మీ పార్టీలో మాట్లాడుకోవాలని సలహా ఇచ్చారు. పిఠాపురంలో టీడీపీ నేత వర్మ వైఖరిపై జనసేన ఇంత ఘాటుగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. కూటమిలో పైస్థాయిలో అంతా సమన్వయంతో ఉన్నట్లే కనిపిస్తున్నా, తాజా ఉదంతం క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎత్తిచూపుతోందని అంటున్నారు. ఈ విషయంలో ఇరుపార్టీల నాయకత్వం ఇప్పటివరకు స్పందించలేదు. కానీ, పిఠాపురం నియోజకవర్గ స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయం కాకరేపుతున్నారు. దీంతో మున్ముందు పరిస్థితులు ఎటు దారి తీస్తాయోనని వ్యాఖ్యానిస్తున్నారు.