ఎక్కడ నుంచో దత్తతకు రాలేదు...పిఠాపురం వర్మ గరం గరం !
ఏపీలో టీడీపీ కూటమి గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉందో చెప్పాలీ అంటే అచ్చమైన ఉదాహరణగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని చెప్పుకుంటారు.
By: Satya P | 21 April 2026 8:44 PM ISTఏపీలో టీడీపీ కూటమి గ్రౌండ్ లెవెల్ లో ఎలా ఉందో చెప్పాలీ అంటే అచ్చమైన ఉదాహరణగా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని చెప్పుకుంటారు. ఇక్కడ మొదటి నుంచి టీడీపీ జనసేన పార్టీల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే గత రెండేళ్ళుగా ఏ మాత్రం సంతృప్తిగా లేరు. ఆయన అసహనం తరచూ బయటపెట్టుకుంటూనే ఉన్నారు. దాంతో ఎన్నో వివాదాలు జనసేన వర్సెస్ టీడీపీగా సాగుతూనే ఉన్నాయి. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా ఆయన ఉప ముఖ్యమంత్రి. దాంతో ఈ సీటు ఆశించిన వర్మకు ఆయన అనుచరులకు ఇక శాశ్వతంగా తమకు చాన్స్ రాదా అన్న ఆందోళన కలవరం ఉందని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే గత రెండేళ్ళుగా వర్మకు ఎక్కడా ఎటువంటి పదవీ దక్కలేదు. నామినేటెడ్ పోస్టు కానీ ఎమ్మెల్సీ పదవి కానీ ఇవ్వలేదు. ఆ బాధ అలా ఉంటే అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన రాజకీయ ఆధిపత్యం టీడీపీని ప్రతీ కార్యక్రమంలో పక్కన పెడుతూండడంతో వర్మ అండ్ అనుచరులు అంతా ఫైర్ అవుతున్నారు. తాజాగా మరో వివాదంతో వర్మ ఆయన అనుచరులు అయితే తీవ్రంగా మండిపడ్డారు.
పాడా సాక్షిగా :
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పాడా కార్యాలయంలో మరోసారి జనసేన వర్సెస్ టీడీపీగా అతి పెద్ద రాజకీయ వివాదం చెలరేగింది. డ్వాక్రా మహిళలకు ట్యాబులను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంతో వర్మతో పాటు టీడీపీ కార్యకర్తలు అంతా కూడా భగ్గుమన్నారు. దీని మీద పాదా డైరెక్టర్ వెంటనే క్షమాపణలు చెప్పి మరీ చంద్రబాబు ఫోటోని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న జనసేన నాయకులు కార్యకర్తలు పాడా ఆఫీసు వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో వ్యవహారం కాస్తా ముదిరింది.
దాడి చేయబోయారు అంటూ :
ఇదిలా ఉంటే వర్మ మీదకు జనసేన నాయకులు దాడికి ప్రయత్నించారు అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీలో ఎమ్మెల్యేగా చేసి జనసేనలో చేరిన పెండెం దొరబాబు అయితే వర్మ మీదకు దాడికి యత్నించారు అని వారు ఆరోపిస్తున్నారు. అయితే జనసేన నేతలు ఆయనను అడ్డుకోవడంతో అక్కడితో అది ఆగిపోయింది. దీని మీద మండిపడిన వర్మ మీడియా ముందుకు వచ్చి దొరబాబు మీద తీవ్ర వ్యాఖ్యలు చేయడం విశేషం. తాము టీడీపీలో ఉంటూ వైసీపీ వారి మీద రాజకీయ పోరాటం అయిదేళ్ళ పాటు చేశామని ఇపుడు వారే జనసేనలో చేరి తమ మీద పెత్తనం చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు. మట్టి వ్యాపారం చేసే వారు జనసేనలో చేరారు అని దొరబాబు మీద విమర్శలు చేశారు. అసలు దొరబాబు ఎవరు అంటూ కూడా వర్మ ఒక దశలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాబు చెప్పబట్టేనే :
తమ అధినాయకుడు చంద్రబాబు చెప్పబట్టే తాము ఎంతో తగ్గి ఉంటున్నామని ప్రశాంతంగా ఉంటున్నామని వర్మ చెప్పుకొచ్చారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ ఎంతో బలంగా ఉందని వర్మ గుర్తు చేశారు. తమ వల్లనే 2024 ఎన్నికల్లో జనసేనకు 70 వేల దాకా భారీ మెజారిటీ వచ్చిందని వర్మ గుర్తు చేశారు. తాము ఎక్కడ నుంచో దత్తతకు ఈ నియోజకవర్గానికి రాలేదని ఇక్కడే పుట్టి పెరిగామని వర్మ హాట్ కామెంట్స్ చేశారు. మరి ఇవి ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియదు కానీ వర్మ కామెంట్స్ మాత్రం ప్రస్తురం వైరల్ అవుతున్నాయి. ఎంతో కష్టపడి తాము జనసేనను గెలిపిస్తే తమ మీదనే పడి కొడతారా అని ఆయన మండిపడ్డారు.
చిచ్చు రాజుకుంటోంది :
ఇదిలా ఉంటే పిఠాపురంలో జనసేన వర్సెస్ టీడీపీ చిచ్చు రాజుకుంటూనే ఉంది. ఏదో ఒక సందర్భంలో అది బయట పడుతూనే ఉంది. ఇటీవలనే వర్మకు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చారు. పార్టీలో ఆయనకు సముచితమైన గౌరవం దక్కుతోంది. అదే సమయంలో వర్మ కూడా చంద్రబాబు లోకేష్ ల పట్ల ఎంతో నిబద్ధతతో నడచుకుంటున్నారు. కానీ లోకల్ గా వర్మకు స్థానిక జనసేన నాయకులకు మధ్య గ్యాప్ ఉందని అంటున్నారు. పై స్థాయిలో జనసేన టీడీపీ బాగానే ఉన్నా దిగువ స్థాయిలో ఈ తరహా ఘర్షణలు కూటమి ఐక్యతకు ఇబ్బంది అన్న సంకేతాలు అందిస్తాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
