పిఠాపురంపై పవన్ మౌనం, దేనికి సంకేతం?
సొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విషయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
By: Tupaki Political Desk | 23 April 2026 10:00 PM ISTసొంత నియోజకవర్గం పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ విషయంలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనంగా ఉండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకున్నా, ఉప ముఖ్యమంత్రి పవన్ మాత్రం ఎలాంటి కామెంట్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకుని, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పవన్, తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనను లైట్ గా తీసుకుంటున్నారా, లేక విశ్రాంతి అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంపై స్పందిస్తారా? అన్నది సస్పెన్స్ గా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
రెండు రోజుల క్రితం పిఠాపురంలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో ప్రదర్శించలేదని మాజీ ఎమ్మెల్యే వర్మ గొడవ చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా జనసేనకు చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు విషయంలో వర్మ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. వైసీపీ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలో చేరిన నుంచి ఆయన విషయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఇద్దరి మధ్య తొలి నుంచి ఉన్న విభేదాలు కూటమిలో చిచ్చు రేపుతున్నాయని విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో వర్మ వర్సెస్ దొరబాబు మధ్య జరిగిన గొడవ రాష్ట్రవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. దీని ప్రభావం మిగతా నియోజకవర్గాలపైనా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా కల్పించుకుని ప్రొటోకాల్ అంటూ గొడవకు దిగిన మాజీ ఎమ్మెల్యే వర్మకు క్లాస్ పీకినట్లు చెబుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో మంచి సమన్వయం ఉందని, రాష్ట్రంలో కూటమి బలపడాలంటే ఇలాంటి చిన్నచిన్న ఘటనలను పట్టించుకోకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో పిఠాపురంలో రాద్ధాంతం పెద్దది కాకుండా ఉండాలని తక్షణం రంగంలోకి దిగారని చెబుతున్నారు. ఈ విషయంలో వర్మతో మాట్లాడి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని చెప్పాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు సూచించినట్లు చెబుతున్నారు.
దీంతో పిఠాపురం రచ్చను టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకున్నట్లు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇదే సమయంలో జనసేన నేతలను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వెలువడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో ఉన్న సంబంధాలు దెబ్బతినకూడదని టీడీపీ వెనువెంటనే అప్రమత్తమైందని, కానీ ఇలాంటి చర్యలు జనసేనలో కనిపించకపోవడమే ఆశ్చర్యకరంగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మను మాటమాటకి అవమానించేలా జనసేనలో కొందరు నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని తమ క్యాడర్ ను అదుపు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.
కానీ, ఇప్పటివరకు పిఠాపురంలో ఈ తరహా గొడవలపై పవన్ ఒకసారి కూడా పెదవి విప్పలేదని అంటున్నారు. దీనివల్ల కూటమి ఐక్యతకు నష్టం జరిగే ప్రమాదం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. గత ఎన్నికల్లో తన గెలుపునకు పనిచేసిన మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో పవన్ వైఖరి ఎవరికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు. ఎన్నికల్లో తాను గెలిచిన తర్వాత వర్మకు ప్రాధాన్యం ఇస్తామని గతంలో పవన్ చేసిన హామీని అంతా గుర్తు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ హామీని పవన్ విస్మరించిన అంశాన్ని ఎత్తిచూపుతున్నారు.
