Begin typing your search above and press return to search.

ఎంపీ పిల్లి.. మంత్రి వేణు బిగ్ వార్... వైసీపీకి తలకాయ నొప్పి...?

మొత్తానికి చూస్తే బోస్ వర్సెస్ మంత్రి వేణుల మధ్య వివాదం మాత్రం హై కమాండ్ కి తలబొప్పి కట్టేలా ఉంది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2023 11:12 AM GMT
ఎంపీ పిల్లి.. మంత్రి వేణు బిగ్ వార్... వైసీపీకి తలకాయ నొప్పి...?
X

గోదావరి జిల్లాల లో బలమైన బీసీ నేత గా మాజీ మంత్రి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఉన్నారు. ఆయనది మూడున్నర దశాబ్దాల రాజకీయం, కాంగ్రెస్ వైఎస్సార్ కాంగ్రెస్ లలో ఆయన ఒక వెలుగు వెలిగారు. రాజశేఖరరెడ్డి ఆయన కు మంత్రి పదవులు ఇచ్చి గౌరవిస్తే జగన్ కూడా 2019లో అధికారం లోకి రాగానే కీలకమైన రెవిన్యూ శాఖ ను అప్పగించారు.

ఆ తరువాత శాసనమండలి రద్దు చేస్తామన్న ఆలోచనల తో ఆయన ను రాజ్యసభ కు పంపించారు ఇదిలా ఉంటే రామచంద్రాపురం ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణను మంత్రిగా చేశారు. ఆయన కు కీలకమైన సమాచార శాఖ అప్పగించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో ఎంపీ బోస్ తన రాజకీయ వారసుడి ని పోటీకి దింపబోతున్నారు. తన రెండవ కుమారుడు సూర్యప్రకాష్ ని ఆయన రామచంద్రాపురం వైసీపీ నుంచి అభ్యర్ధిగా పోటీ చేయించాలని చూస్తున్నారు.

మంత్రి వేణుతో బోస్ కి ఉన్న విభేదాలు ఆదివారం రామచంద్రాపురం లో జరిగిన అత్మీయ సదస్సు ద్వారా ఒక్కసాఇగా బహిర్గతం అయ్యాయి. మంత్రి వేణు మీదనే బోస్ అనుచరులు విరుచుకుని పడ్డారు. ఆయన తనకు వ్యతిరేకంగా ఉన్నారని అనుమానంతో సొంత పార్టీ నేతల మీదనే పోలీసుల ను ఉపయోగిస్తారు అని మండిపడుతున్నారు.

రామచంద్రాపురం టికెట్ ని బోస్ కుమారుడికే ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. వేణుగోపాల క్రిష్ణకు టికెట్ ఇస్తే పనిచేయమని స్పష్టం చేస్తున్నారు. ఆయనను నాన్ లోకల్ అని కూడా చిత్రీకరిస్తున్నారు. ఆయన కు టికెట్ ఇస్తే ఓటమి ని కొని తెచ్చుకోవడమే అని కూడా ఇండైరెక్ట్ గా హై కమాండ్ కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

బోస్ 1989 లో ఫస్ట్ టైం రామచంద్రాపురం నుంచి గెలిచారు. అదే విధంగా 2004, 2009లలో గెలిచారు. బీసీల లో కీలకమైన నేతగా ఎదిగారు. తన సీటు తన కుమారుడికే దక్కాలన్నది బోస్ తో పాటు ఆయన అనుచరుల డిమాండ్ గా ఉంది.

అయితే ఇదే సీటు లో 2014లో వైసీపీ తరఫున బోస్ కి ఇస్తే ఆయన ఓడిపోయారు. దాంతో ఆయన ను ఎమ్మెల్సీగా చేసి చెల్లుబోయిన వేణుగోపాలక్రిష్ణకు జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన టీడీపీ లో ధీటైన నేతగా ఉన్న తోట త్రిముర్తులును ఓడించారు. మంత్రిగా కూడా అయ్యారు.

వచ్చే ఎన్నికల లో మరోమారు తనకే టికెట్ అని ఆయన ధీమాగా ఉన్నారు. ఇక రామచంద్రాపురం లో బోస్ వర్సెస్ వేణు వర్గాల మధ్య ఉన్న వివాదాలను అధినాయకత్వం 2021లోనే పరిష్కరించింది. బోస్ ని రాజ్యసభకు పంపడం ద్వారా పెద్దాయనను గౌరవించింది. అయితే బోస్ ఇపుడు 2024 ఎన్నికల వేళ కొత్త పేచీకి దిగుతున్నారన్నది వేణు వర్గం ఆరోపణగా ఉంది.

ఒక విధంగా బోస్ వర్గం అయితే వేణుని సహించేది లేదని అంటోంది. అవసరం అయితే వచ్చే ఎన్నికల్లో బోస్ కుమారుడు సూర్యప్రకాష్ ని ఇండిపెండెంట్ గా నిలబెట్టాలని కూడా కఠిన నిర్ణయం వైపుగా అడుగులు వేస్తున్నారు అని అంటున్నారు. ఈ పరిణామాలతో రామచంద్రాపురంలో కధ మళ్ళీ మొదటికి వచ్చిందని అధినాయకత్వం కలవరపడుతోంది.

అయితే బోస్ వర్గీయులు తనను టార్గెట్ చేస్తున్న సమయం లో విశాఖలో బీసీ గర్జన సభకు వచ్చిన మంత్రి వేణు అక్కడ తనకు వ్యతిరేకంగా మాట్లాడున్న వారిని పట్టించుకోను అన్నారు. బోస్ తనకు గురువు అని కూడా చెప్పుకున్నారు. ఆయనను వ్యతిరేకించి ముందుకు వెళ్ళే పరిస్థితి ఎవరికీ లేదు అని కూడా ఆయన చెప్పారు. రామచంద్రాపురం లో జరిగే పరిణామాలు అధినాయకత్వానికి కూడా తెలుసు అన్నరు.

తనను మొత్తం నియోజకవర్గం ప్రజల మద్దతు ఉందని వేణు చెప్పుకుంటున్నారు. ఇక పార్టీ హై కమాండ్ ప్రతీ అంశాన్ని నిశితంగా గమనిస్తోందని, సరైన సమయం లో స్పందిస్తుందని కూడా మంత్రి పేర్కొనడం విశేషం. అంటే పిల్లి వర్గీయుల డిమాండ్లు నెగ్గబోవని, తానే మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఉంటాను అన్నది మంత్రి గారి ధీమాగా ఉంది.

మొత్తానికి చూస్తే బోస్ వర్సెస్ మంత్రి వేణుల మధ్య వివాదం మాత్రం హై కమాండ్ కి తలబొప్పి కట్టేలా ఉంది అని అంటున్నారు. గోదావరి జిల్లాల లో శెట్టి బలిజల ప్రభావం ఎక్కువ. ఇప్పటికే కాపుల ఓట్లను పోలరైజ్ చేసే పనిలో జనసేన ఉంది. ఇపుడు బీసీల లో ప్రధాన వర్గంగా ఉన్న శెట్టి బలిజలు కనుక రివర్స్ అయితే వైసీపీకి ఆ జిల్లాల లో ఇబ్బందులు తప్పవు. మరి రాజ్యసభ సభ్యునిగా ఉన్న బోస్ ని ఏ విధంగా హై కమాండ్ దారికి తెస్తుందో వేచి చూడాల్సిందే.