Begin typing your search above and press return to search.

పీకేపై పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు!

ఈ నేపథ్యంలో అభివృద్ధి విషయంలో వైసీపీపైన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందని పీకే కుండబద్దలు కొట్టారు.

By:  Tupaki Desk   |   11 March 2024 7:01 AM GMT
పీకేపై పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు!
X

దేశంలో ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి దారుణ పరాభవం తప్పదని ఆయన తేల్చిచెప్పారు. ప్రజలు సంక్షేమ పథకాలను మాత్రమే కోరుకోవడం లేదని.. అభివృద్ధిని ముఖ్యంగా కాంక్షిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో అభివృద్ధి విషయంలో వైసీపీపైన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటుందని పీకే కుండబద్దలు కొట్టారు.

ఈ నేపథ్యంలో పీకే వ్యాఖ్యలపై మచిలీపట్నం (బందరు) ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ప్రశాంత్‌ కిశోర్‌ ఆంధ్రాకు వచ్చి పీకిందేమీ లేదన్నారు. తనతోపాటు చాలామందికి గత ఎన్నికల్లో టికెట్లు ఇవ్వవద్దని పీకే సూచించాడని బాంబుపేల్చారు.

అయినా సరే వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తమను నమ్మి సీట్లు ఇచ్చారని.. దీంతో తాము గెలుపొందామని పేర్ని నాని గుర్తు చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి తమను నమ్మి టికెట్లు ఇవ్వడంతో తామంతా గెలిచామని తెలిపారు. ఇందుకు సంబంధించి వ్యూహం, ఆలోచనంతా సీఎం జగన్‌ దేనని చెప్పారు. ప్రశాంత్‌ కిశోర్‌ కేవలం ఇన్‌ ఫుట్స్‌ మాత్రమే ఇచ్చేవారని పేర్ని నాని స్పష్టం చేశారు. ఇక్కడికొచ్చి పీకే పొడిచిందేమీ లేదని వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు అప్పుడు చేయడం లేదని.. ద్రవ్య వినియోగ పరిమితి చట్టం (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిధికి లోబడే అప్పులు చేస్తుందని పేర్ని నాని స్పష్టం చేశారు. అప్పులపై ఎల్లో మీడియా, ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడే కాకుండా గతంలోనూ ప్రశాంత్‌ కిశోర్‌ పై పేర్ని నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆ పీకే (పవన్‌ కళ్యాణ్‌), ఈ పీకే (ప్రశాంత్‌ కిశోర్‌) వల్ల వైసీపీకి వచ్చే నష్టమేం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి అఖండ విజయం సాధించి జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని పేర్ని నాని కుండబద్దలు కొట్టారు. ఈ నేపథ్యంలో పేర్ని నాని పీకేపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

కాగా వచ్చే ఎన్నికల్లో పేర్ని నాని ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన తనకు బదులుగా తన కుమారుడు పేర్ని కిట్టును బరిలోకి దింపుతున్నారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సైతం పేర్ని కిట్టును బందరు వైసీపీ ఇంచార్జిగా ప్రకటించారు.