Begin typing your search above and press return to search.

జనీవా కోర్టుకు వెళ్లినా ఏం చేయలేరు.. వంశీపై మాజీ మంత్రి పేర్ని కామెంట్స్

ఆ తర్వాత ఓ మీడియా చానల్ తో మాట్లాడిన పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   4 July 2025 10:26 AM IST
జనీవా కోర్టుకు వెళ్లినా ఏం చేయలేరు.. వంశీపై మాజీ మంత్రి పేర్ని కామెంట్స్
X

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. బెయిలుపై విడుదలైన వంశీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకు సమాధానంగా పేర్ని నాని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు రోజుల క్రితం జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే. సుమారు 140 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా గడిపిన వంశీకి నూజివీడు కోర్టు బెయిలు మంజూరు చేయడంతో విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు.

ఇక గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను వంశీ కలిశారు. మరోవైపు ఆయన ఇంటికి వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లి పరామర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పేర్ని కూడా వంశీని కలిసి సానుభూతి తెలిపారు. ఆ తర్వాత ఓ మీడియా చానల్ తో మాట్లాడిన పేర్ని నాని మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎర్ర బుక్, ఎర్ర బుక్ అంటూ వంశీని అరెస్టు చేయడం వల్ల పైసా ఖర్చు లేకుండా చాలా సానుభూతి వచ్చిందని పేర్ని విశ్లేషించారు.

వంశీ గన్నవరం నుంచి ఎక్కడికీ పారిపోడని, గన్నవరం ప్రజలకు సేవ చేసేందుకు త్వరలోనే యాక్టివ్ అవుతాడని చెప్పారు పేర్ని నాని. వంశీని అరెస్టు చేయడం వల్ల గన్నవరంలో సానుభూతి వ్యక్తమవుతోందని చెప్పారు. కేసుల మీద కేసులు బనాయించి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రభుత్వ కక్ష సాధింపును ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక వంశీ బెయిలు రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. జనీవాలో ఉన్న అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినా వంశీని ఏం చేయలేరని ధీమా వ్యక్తం చేశారు.

వైసీపీ నేతల వరుస అరెస్టులతో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్లు మాట్లాడేందుకే భయపడుతున్నారు. ఒకరిద్దరు మాత్రమే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఈ లిస్టులో మాజీ మంత్రి పేర్ని ముందున్నారు. వైసీపీ నేతల అరెస్టులను నిరసిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ కార్యకర్తల్లో స్థైర్యం నింపుతున్నారని అంటున్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేసులో పేర్నిపై కూడా కేసు నమోదైంది. అయినప్పటికీ ఆయన రాజీ లేని పోరాటమే చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వంశీ విషయంలో పేర్ని నాని తొలి నుంచి మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు.