Begin typing your search above and press return to search.

ఏపీలో పర్మిట్ రూమ్ లు రీ-ఓపెన్... ముహూర్తం ఎప్పుడంటే..?

అవును... మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   2 July 2025 7:57 AM
ఏపీలో పర్మిట్ రూమ్ లు రీ-ఓపెన్... ముహూర్తం ఎప్పుడంటే..?
X

ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మద్యం విధానాన్ని.. కూటమి ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వ కొత్త మద్యం విధానం అమలవుతోంది. ఎన్నికల్లో చెప్పినట్లుగానే రూ.99 రూపాయలకే క్వార్టర్ బాటిల్ లభిస్తోంది. ఈ సమయంలో.. పర్మిట్ రూమ్ లను తిరిగి తీసుకురావాలని సర్కార్ యోచిస్తోందని తెలుస్తోంది.

అవును... మద్యం అమ్మకాలకు సంబంధించి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. ఇకపై మద్యం దుకాణాలలో పర్మిట్ రూమ్‌ లను తీసుకురావాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల రెండు ప్రయోజనాలున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. అటు ప్రభుత్వానికి అదనపు ఆదాయం రావడంతో పాటు, న్యూసెన్స్ తగ్గుతుందని భావిస్తున్నారు.

వాస్తవానికి గతంలో మద్యం దుకాణాలను ప్రభుత్వం నిర్వహించగా.. ఆ సమయంలో పర్మిట్ రూమ్ లు పూర్తిగా నిషేధించారు. దీంతో.. మందుబాబులు చాలా ఇబ్బందులు పడ్డట్లు చెబుతుంటారు. ఇందులో భాగంగా.. రోడ్ల పక్కన, పొలాల్లోనూ, ఖాళీ స్థలాల్లోనూ, రోడ్లపక్కనున్న షాపుల పక్కన.. ఇలా బహిరంగా ప్రదేశాలలోనే మద్యం సేవించేవారు.

గత ప్రభుత్వ పాలనలో, పర్మిట్ రూములు పూర్తిగా నిషేధించబడ్డాయి. అప్పటి నుండి, ప్రజలు రోడ్ల పక్కన, ఖాళీ స్థలాలు మరియు దుకాణాల దగ్గర వంటి బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్నారు. ఇది పెద్ద ప్రజా ఇబ్బందిగా మారింది, స్థానిక నివాసితులను ఇబ్బంది పెట్టింది మరియు భద్రతా సమస్యలను సృష్టించింది.

దీనివల్ల రెండు ఇబ్బందులు ఉండేవి. అందులో ఒకటి మద్యపాన ప్రియులు కాసేపు ప్రశాంతంగా మద్యం సేవించే అవకాశం లేకపోవడం కాగా.. ఇంకోటి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుందని అంటున్నారు. ఈ నిర్ణయం బహిరంగ మద్యపానాన్ని తగ్గించడంతో పాటు దానివల్ల కలిగే ఇబ్బందులను తగ్గిస్తుందని చెబుతున్నారు.

మరోవైపు.. గతంలో ఉన్నట్లుగానే ప్రతి పర్మిట్ రూమ్ కి ఏడాదికి రూ.5 లక్షలు రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని అంటున్నారు! అయితే.. నగరల్లో ఈ రుసుము రూ.7.5 లక్షలకు పెంచి, ఇతర ప్రాంతాలలో మాత్రం పాత రుసుమును మార్చకుండా కొనసాగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఫలితంగా.. ఏటా ప్రభుత్వానికి సుమారు రూ.186 కోట్ల ఆదాయం రానుంది! ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెల నుంచి ఈ పర్మిట్లు జారీ చేయాలనేది ప్రభుత్వ ప్రణాలికగా తెలుస్తోంది. కాగా... రాష్ట్రంలో 3,736 మద్యం దుకాణాలున్న సంగతి తెలిసిందే.