Begin typing your search above and press return to search.

చిక్కుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు.. ఫైళ్ల దహనం కేసులో సుప్రీం కీలక తీర్పు

పెద్దిరెడ్డి అనుచరుల ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Political Desk   |   10 March 2026 1:30 PM IST
చిక్కుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు.. ఫైళ్ల దహనం కేసులో సుప్రీం కీలక తీర్పు
X

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మదనపల్లె సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డితోపాటు మరికొందరు జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొందని అంటున్నారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో కీలక రెవెన్యూ ఫైళ్ల దహనం కేసులో పెద్దిరెడ్డి అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డి అనుమానితుడు. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆయన స్థానిక కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేశాడు. సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో మాధవరెడ్డి పోలీసులు ఎదుట లొంగిపోవాల్సివుంటుందని న్యాయవాద వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

పెద్దిరెడ్డి అనుచరుల ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ల దహనం చేయడం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించాలని అభిప్రాయపడింది. రికార్డు రూములో మంటలు ఎలా వ్యాపించాయి. దాని వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? అనే విషయాలను లోతుగా విచారించాలని నిర్ణయించింది. ఈ కారణంగా నిందితులకు ముందస్తు బెయిలు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకునేందుకు ఎలాంటి బలమైన కారణాలు లేవని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక నిందితుల అరెస్టుకు మార్గం సుగమైందని అంటున్నారు.

2024 జూలైలో మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో కీలకమైన భూ రికార్డులు దహనమైన విషయం తెలిసిందే. భూ కబ్జాలకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వానికి లభించకుండా కుట్రతోనే ఫైళ్లను కాల్చేశారని ప్రభుత్వ వర్గాలు అనుమానించాయి. దీనిపై కేసు నమోదు చేయగా, అప్పటి ఆర్డీవో మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ తోపాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి, పీఏ ముని తుకారాంను నిందితులుగా గుర్తిస్తూ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆర్డీవో మురళి, సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. మాధవరెడ్డి, తుకారాం ముందస్తు బెయిలు కోసం కోర్టుల్లో ఇప్పటివరకు పోరాడారు. కేసు నమోదైన వెంటనే తుకారాం విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

కాగా, సుప్రీంకోర్టులో జరిగిన వాదనల్లో నిందితుల తరఫున వాదించిన దామా శేషాద్రినాయుడు కేసుతో తమ క్లెయింట్లకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి వద్ద పీఏగా పనిచేశారనే కారణంతోనే నిందితులుగా చేర్చారని వాదించారు. ఘటన జరిగిన సమయంలో నిందితుడు అక్కడ లేరని, అప్పటికే విదేశాలకు వెళ్లి ఆరు నెలలు అయిందని కోర్టుకు నివేదించారు. ఆయనకు వ్యతిరేకంగా పోలీసుల వద్ద సరైన ఆధారాలు లేవని, కేవలం అనుమానంతోనే కేసు పెట్టారని పేర్కొన్నారు. నిందితుల తరఫున వాదనలు విన్న బెంచ్ నిందితుడు విదేశాల్లో ఉన్నారని కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని, ఇటువంటి కేసుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. చట్టప్రకారం విచారణ కొనసాగాలని, ఇందుకు నిందితుడు సహకరించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.