టిపికల్ ఇండియన్ మదర్.. నిర్మలమ్మపై ఆర్థిక మంత్రి కేశవ్ వ్యాఖ్యలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టిపికల్ ఇండియన్ మదర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.
By: Tupaki Desk | 17 Sept 2025 1:07 PM ISTకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ టిపికల్ ఇండియన్ మదర్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. జీఎస్టీ సంస్కరణలను అమలు చేసిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అద్భుతాన్ని ఆవిష్కరించారని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ సంస్కరణలను అమలు చేస్తామని ప్రకటించిన నెల రోజుల్లోనూ ఆర్థిక మంత్రి వాస్తవంలోకి తెచ్చారని కొనియాడారు. ఎక్కడ ఖర్చు పెట్టాలో కాదు.. ఎక్కడ నియంత్రించాలో తెలిసిన గొప్పనేత అంటూ నిర్మలా సీతారామన్ ను కీర్తించారు కేశవ్.
ఈ నెల 22 నుంచి దేశంలో జీఎస్టీ సంస్కరణలు అమలు అవుతున్న విషయం తెలిసిందే. ఈ సంస్కరణల వల్ల దేశంలో రెండు పన్ను శ్లాబులు అమలులోకి రానున్నాయి. ఫలితంగా అనేక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. బీమా ప్రీమియం కూడా చవకగా అందనుంది. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆదాయం కోల్పోనున్నాయి. కానీ, జీఎస్టీ సంస్కరణల వల్ల ధరలు తగ్గి ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. వారికి ఆర్థిక స్వేచ్ఛ లభించనుందని అంటున్నారు. ఈ కారణంగా జీఎస్టీ సంస్కరణల వల్ల ఆదాయం తగ్గినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాలు స్వాగతించాయి.
ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పనితీరుపై పలువురు నేతలు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. జీఎస్టీ సవరణ వల్ల ఏపీకి దాదాపు 8 వేల కోట్ల రూపాయల లోటు ఏర్పడే అవకాశం ఉంది. కానీ, ప్రజలకు మేలు జరుగుతుందన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణలను స్వాగతిస్తోంది. దీనికి ఆర్థిక మంత్రి కేశవ్ చేసిన వ్యాఖ్యలే ఉదాహరణగా చెబుతున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని మంత్రి పయ్యావుల కొనియాడారు. రెండు శ్లాబుల విధానం అమలు చేయడం అంత ఈజీ కాదని, ఎంతో కృషి చేస్తేనే జీఎస్టీ సంస్కరణలు సాధ్యయమ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల కృషిని కేశవ్ ప్రస్తుతించారు.
దేశంలో అనేక పార్టీలు విభిన్న రాజకీయ వైరుధ్యాలతో పనిచేస్తున్నప్పటికీ జీఎస్టీ విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం విశేషమని కేశవ్ వ్యాఖ్యానించారు. ఫైనాన్స్ మంత్రి దగ్గర అందరూ లాబీయింగ్ చేస్తే, పేద వాళ్ల కోసం లాబీయింగ్ చేసిన ఏకైక ఆర్థిక మంత్రి నిర్మలమ్మ అంటూ ఆయన అన్నారు. ఎన్నికల ముందు ధరలు తగ్గించడం చూస్తాం, కానీ దేశం కోసం పనిచేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం నిత్యం సంస్కరణల విధానంలో పనిచేస్తోందని అన్నారు. ఎంఎస్ఎంఈ లకు క్రెడిట్ గ్యారెంటీస్ సహా కీలక విధానాలు అమలు చేస్తున్నారని ఆర్థిక మంత్రి కేశవ్ తెలిపారు.
