పవన్ ఆలస్యం.. వైసీపీకి అవకాశం
టీడీపీ ఇంఛార్జీలను నియమించిన నియోజకవర్గాల్లో జనసేన ఇంఛార్జీలను ఎందుకు పెట్టలేదని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
By: Tupaki Desk | 16 Aug 2023 8:15 AM ISTవచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నారు. వారాహి విజయ యాత్రతో జనాల్లో ఉంటూ.. ఫుల్ జోష్‌తో పవన్ ముందుకు సాగుతున్నారు. అంతా బాగానే ఉంది కానీ.. ఒక్క విషయం మాత్రం పవన్‌ను ఇరకాటంలో పెడుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే టీడీపీతో పొత్తు విషయం. ఈ విషయంపై పవన్ ఎటూ తేల్చలేకపోవడంతో ఇప్పుడిదే అధికార వైసీపీ నాయకులకు ఆయుధంగా మారింది.
టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారని, చంద్రబాబు కోసం జనసేన పార్టీని తాకట్టు పెట్టారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్‌పై పవన్ ఏ విమర్శలు, ఆరోపణలు చేసినా.. వైసీపీ నాయకులు మాత్రం టీడీపీ మాట చెప్పే పవన్‌పై ఎదురు దాడి చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు కోసం పని చేస్తున్నానని పవన్ నేరుగా చెప్పాలని, టీడీపీ- జనసేన పొత్తులోనే ఉంటాయని ప్రకటించాని వైసీపీ నేతలు సవాలు విసురుతున్నారు.
టీడీపీ ఇంఛార్జీలను నియమించిన నియోజకవర్గాల్లో జనసేన ఇంఛార్జీలను ఎందుకు పెట్టలేదని వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా గుంటూరులో ఏడు స్థానాలుంటే కేవలం తెనాలి నుంచి మాత్రమే నాదెండ్ల మనోహర్‌ను పోటీలో దింపుతామని పవన్ ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.
దీంతో వైసీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే టీడీపీతో పొత్తు విషయంపై పవన్ ప్రకటన చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఆలస్యం చేసిన కొద్దీ.. వైసీపీ విమర్శల కారణంగా జనాల్లోనూ జనసేనపై వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి పవన్ మనసులో ఏముందో?
