Begin typing your search above and press return to search.

స్టార్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ కు పవన్‌ కళ్యాణ్‌ కీలక పదవి!

కాగా జానీ మాస్టర్‌.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   19 Feb 2024 8:20 AM GMT
స్టార్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ కు పవన్‌ కళ్యాణ్‌ కీలక పదవి!
X

ప్రముఖ స్టార్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ జానీ మాస్టర్‌ గురించి అందరికీ తెలుసు. తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో స్టార్‌ హీరోల సినిమాలకు ఆయన నృత్య రీతులను సమకూర్చారు. అంతేకాకుండా పలు ప్రముఖ టీవీ చానెళ్ల డ్యాన్స్‌ షోలకు జడ్జిగా, చీఫ్‌ గెస్టుగానూ వ్యవహరించారు.

కాగా జానీ మాస్టర్‌.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కు వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన జనసేన పార్టీలో చేరారు. జానీ మాస్టర్‌ నెల్లూరు జిల్లాకు చెందినవారు. ఈ నేపథ్యంలో తరచూ నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలపైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటీవల సీపీఎస్‌ ఉద్యోగుల ధర్నా, అంగన్‌ వాడీ మహిళల ధర్నాకు ఆయన తన మద్దతును ప్రకటించారు.

ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ ను ఆంధ్రప్రదేశ్‌ ప్రచార కమిటీ వైస్‌ చైర్మన్‌ గా పవన్‌ కళ్యాణ్‌ నియమించారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ అభ్యర్థుల తరఫున జానీ మాస్టర్‌ ప్రచారం నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఆయనకు రాష్ట్ర ప్రచార కమిటీ వైస్‌ చైర్మన్‌ బాధ్యతలు ఇచ్చారని తెలుస్తోంది.

కాగా జానీ మాస్టర్‌ వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లా కోవూరు నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. ప్రస్తుతం కోవూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌ కూడా కోవూరు నుంచి జనసేన సీటు కోసం ప్రయత్నిస్తుండటం హాట్‌ టాపిక్‌ గా మారింది.

కాగా తనను జనసేన పార్టీ ప్రచార కమిటీ వైస్‌ చైర్మన్‌ గా నియమించడంపై జానీ మాస్టర్‌ ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్, పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని తెలిపారు. జనసేన పార్టీ అఖండ విజయమే తన లక్ష్యమన్నారు. ఆంధ్ర ప్రజల సంపూర్ణ అభివృద్ధే గమ్యం అని వెల్లడించారు. ఇది జనసేన–టీడీపీ కూటమి అధికారంతోనే సాధ్యమని తెలిపారు. ఈ మేరకు జానీ మాస్టర్‌ ఇనస్ట్రాగామ్‌ లో ఒక పోస్టు చేశారు.