Begin typing your search above and press return to search.

పెన్షన్ టెన్షన్... "భీమ్లా నాయక్" రోజులు గుర్తు చేసుకున్న పవన్!

ప్రస్తుతం ఏపీలో పెన్షన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వైసీపీ వర్సెస్ టీడీపీ రచ్చ పీక్స్ కి చేరుతుంది

By:  Tupaki Desk   |   3 April 2024 4:55 PM GMT
పెన్షన్ టెన్షన్... భీమ్లా నాయక్ రోజులు గుర్తు చేసుకున్న పవన్!
X

ప్రస్తుతం ఏపీలో పెన్షన్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం వైసీపీ వర్సెస్ టీడీపీ రచ్చ పీక్స్ కి చేరుతుంది. వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసి.. నేడు వృద్ధులు, వికలాంగులు పడుతున్న ఇబ్బందులకు, కార్చుతున్న కన్నీటికీ కారణం చంద్రబాబు అని వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరోపక్క టీడీపీ నుంచి అదేస్థాయిలో కౌంటర్స్ వస్తున్నాయి.

ఇదంతా వైసీపీ కావాలని ఆడుతున్న డ్రామా అని... వాలంటీర్లు లేకపోతే పెన్షన్స్ ఇప్పించలేరా అని, 1.60 లక్షల మంది గ్రామ / వార్డు సచివాలయం ఉద్యోగులు ఉన్నారని చెబుతున్నారు. కావాలనే పెన్షన్ దారులను ఇబ్బందిపెట్టి.. ఆ బురద తమపై చల్లుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని సీఎస్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సమయంలో పవన్ కల్యాన్ ఎంట్రీ ఇచ్చారు.

అవును... ఏపీలో వైసీపీ - టీడీపీ మధ్య జరుగుతున్న పెన్షన్ వార్ లో తాజాగా పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా.. "ఒక సినిమాను ఆపడానికి మొత్తం ప్రభుత్వ యంత్రాంగమే పని చేసినప్పుడు, దివ్యాంగులకు, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయడానికి వ్యవస్థలను ఎందుకు ఉపయోగించట్లేదు?" అని పవన్ కల్యాణ్ ఆన్ లైన్ వేదికగా ప్రశ్నించారు.

ఇదే సమయంలో... "బలమైన రాజ్యాంగ వ్యవస్థలు ఉండగా వాలంటీర్లను అడ్డుపెట్టుకొని వృద్ధులకు, దివ్యాంగులకు పింఛన్లు పంపిణీ చేయకుండా ఎందుకు నరకం చూపిస్తున్నారు?" అని ప్రశ్నించింది. వృద్ధులూ, దివ్యాంగులు, వితంతువులకు ఇళ్ల వద్దే పెన్షన్ అందించడానికి ఉన్న ఇబ్బందీ ఏమిటి ఏపీ సీఎస్ గారూ... అని ప్రశ్నిస్తూ... భీమ్లా నాయక్ సినిమా విడుదల సమయంలో థియేటర్స్ వద్ద రెవిన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు అని గుర్తుచేశారు!

ఇందులో భాగంగా..." నా సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ వద్ద రెవిన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు.. తహసీల్దార్ ఫోన్ నెంబర్ ఇస్తారు. కానీ, పెన్షన్స్ ఇవ్వడానికి ఉద్యోగులు లేరా? కరోనా కాలంలో మద్యం దుకాణాల వద్ద ఉద్యోగులకు డ్యూటీలు వేసిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.. గ్రామ / వార్డు సచివాలయ ఉద్యోగులు, విలేజ్ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లను ఇళ్ల వద్దే ఇవ్వొచ్చు" అని ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా జనసైనికులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా... "జనసేన నాయకులు, జనసైనికులకు నా విజ్ఞప్తి.. పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు, దివ్యాంగులకు తోడుగా ఉండండి. పింఛన్ ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకువెళ్ళండి. పింఛన్ ఇప్పించండి. ఆ తరవాత ఇంటి దగ్గర దించి రాగలరు. సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకొనేవారికి సహాయం అందించగలరు" అని కోరారు!