పవన్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ!
కానీ ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన సర్వేలలో పధకాలకు జనాదరణ గట్టిగా ఉందని తేలడంతో టీడీపీ గొంతు సవరించుకుంది.
By: Tupaki Desk | 8 Oct 2023 5:00 AM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ బోల్డ్ గా మాట్లాడుతారు. ఆ మాటలలో ఆవేశం పాలు ఎక్కువ. ఆలోచన ఎంతవరకూ ఉంది అన్నది మాత్రం వెతికి చూడాల్సిందే. పైగా నిన్న ఏమి చెప్పాం, నేడు ఏమి అంటున్నాం అన్నది ఆయన అంతగా పట్టించుకోరు అని అంటున్నారు. అందుకే పెడన సభలో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని చెప్పిన పవన్ ముదినేపల్లి కి వచ్చేసరికి మేము ఎన్డీయేకు దూరం అని ఎవరు చెప్పారని గర్జించారు.
ఇక ఏపీలో జగన్ పధకాలు ఇస్తే సరిపోతుందా ఏపీ అప్పుల కుప్ప అవుతోంది అని ఆయన వారాహి లేటెస్ట్ సభలలో మండిపోతున్నారు. నిజం చెప్పాలంటే 2022 మొదట్లో దాకా టీడీపీ అలాగే అంటూ వచ్చింది. ఏపీ శ్రీలంక అవుతోంది అని కూడా పోలిక తెచ్చి భయపెట్టింది. పప్పు బెల్లాలుగా పధకాలు ఇస్తూ ఏపీని సర్వనాశనం జగన్ చేస్తున్నారని అన్నది టీడీపీ పెద్దలే.
కానీ ఆ పార్టీ అనుకూల మీడియా చేసిన సర్వేలలో పధకాలకు జనాదరణ గట్టిగా ఉందని తేలడంతో టీడీపీ గొంతు సవరించుకుంది. మేము కూడా జగన్ కంటే ఎక్కువగానే పధకాలు ఇస్తామని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఈ ఏడాది మేలో రాజమండ్రిలో జరిగిన మహానాడులో బాబు మినీ మేనిఫేస్టోని రిలీజ్ చేసి అందులో అనేక సంక్షేమ పధకాలను ప్రకటించారు.
రానున్న రోజులలో వివిధ వర్గాలకు పధకాలు ఇవ్వాలని కూడా టీడీపీ నిర్ణయించుకుంది. ఆ మధ్యన పవన్ కూడా మేము ఎక్కువగానే పధకాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. కానీ వారాహి నాలుగవ విడతలో మాత్రం ఆయన పధకాలతో సోమరిపోతులను తయారు చేస్తున్నారు అని ఫైర్ అయ్యారు.
దీంతో ఖంగు తినడం టీడీపీ వంతు అవుతోంది. ఇన్నాళ్ళూ పవన్ ఏమి మాట్లాడినా అది ఆయన పార్టీ సొంత వ్యవాహారం కనీ ఇపుడు అలా కాదు పొత్తు అంటూ రెండు పార్టీలు ప్రకటించుకున్న తరువాత పవన్ అన్న ప్రతీ స్టేట్మెంట్ కూడా టీడీపీకి తగులుతోంది అంటున్నారు.
టీడీపీ వస్తే పధకాలు అన్నీ ఆపు చేస్తుందని ఇప్పటికే వైసీపీ చెబుతోంది. పవన్ స్టేట్మెంట్స్ అధికార పార్టీకి ఆయుధంగా మారుతాయని కూడా సందేహిస్తున్నారు. అలాగే ఆయన వైఎస్సార్ ని పట్టుకుని చేస్తున్న విమర్శలు కూడా ఒక సామాజిక వర్గం ప్రజానీకాన్ని దూరం చేస్తాయని టీడీపీ నేతలు కలవరపడుతున్నారు.
వైఎస్సార్ నే ఎదిరించాను, ఆయన అంటేనే నాకు భయం లేదు అంటూ పవన్ చేస్తున్న కామెంట్స్ ఇపుడు టీడీపీని చికాకు పెడుతున్నాయని అంటున్నారు. ఆ తరువాత సర్దుకున్నా కూడా ఎన్డీయే నుంచి బయటకు వచ్చాను అన్న ఆయన ప్రకటన వల్ల బీజేపీ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో అన్న దూరాలోచన కూడా టీడీపీ నేతలలో ఉంది అంటున్నారు. బీజేపీ టార్గెట్ మామూలుగా ఉండదు.
ఆ పార్టీ ఏపీలో జనసేనతో మొదట పొత్తు పెట్టుకుంది. ఇపుడు పవన్ సడెన్ గా టీడీపీ వైపు మొగ్గు చూపారు. దీని మీద బీజేపీ నాయకుడు రఘురాం పవన్ వైఖరి మీద ఒక చానల్ లో మాట్లాడుతూ మండిపడ్డారు. బీజేపీ పెద్దలు పవన్ కి తగిన మర్యాదను ఇచ్చి ఎన్డీయే మీట్ కి పిలిచి కీలక స్థానం ఇచ్చారని అలాంటిది తమ పార్టీకి ఏ మాత్రం చెప్పకుండా ఇలా చేయడమేంటి అని కూడా ఫైర్ అయ్యారు.
ఇలాంటి అభిప్రాయాలే కేంద్ర బీజేపీ పెద్దలకు ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు అంత ఆదరణగా లేరని, ఇపుడు పవన్ని తమ వైపు టీడీపీ తిప్పుకుంటే కమలం వ్హూహాలే మారుతాయని అది అంతిమంగా ఇబ్బందులు తెస్తుందన్న కలవరం కూడా ఉందిట.
ఇంకో వైపు చూస్తే ఉమ్మడి ప్రణాళిక అంటూనే పవన్ ఇస్తున్న హామీలు కూడా టీడీపీని ఇరకాటంలో పెడుతున్నాయని అంటున్నారు. పవన్ ఆవేశంతో చేసే ప్రకటనల వల్ల టీడీపీ కూడా జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ఇక పుసుక్కున పవన్ టీడీపీ వీక్ అయిపోయింది అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఆ పార్టీని హర్ట్ చేసింది అని అంటున్నారు.
తానే సేవియర్ ని అని మాట్లాడడం పట్ల కూడా తమ్ముళ్ళు కినుక వహిస్తున్నారుట. మరి చంద్రబాబు బయటకు వచ్చిన తరువాత రెండు పార్టీలను ఏకత్రాటిపైకి నడిపే యాక్షన్ ప్లాన్ రూపొందిస్తారు అని అంటున్నా పవన్ జనాలను చూస్తే ఆవేశంతో చేసే ప్రకటనలు ఆగుతాయా అన్నది మాత్రం డౌట్ గానే ఉందిట.
