Begin typing your search above and press return to search.

టీడీపీ అంటే వర్మ.. పవన్ కి గెలుపు కష్టాలు...!

ఎవరీ వర్మ. ఏమా కధ అంటే ఆయనకు రాజకీయంగా చాలానే కధ ఉంది అని పిఠాపురం అసెంబ్లీ హిస్టరీ చెబుతుంది

By:  Tupaki Desk   |   14 March 2024 2:28 PM GMT
టీడీపీ అంటే వర్మ..  పవన్ కి గెలుపు కష్టాలు...!
X

ఎవరీ వర్మ. ఏమా కధ అంటే ఆయనకు రాజకీయంగా చాలానే కధ ఉంది అని పిఠాపురం అసెంబ్లీ హిస్టరీ చెబుతుంది. వర్మ తన సొంత సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాల వారి మద్దతుని అందుకున్నారు. ఆయన అంటే వారూ వీరూ కాకుండా అందరి వాడు అయ్యారు.

ఆయన 2009లో పొలిటికల్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆనాడు టీడీపీ నుంచి పోటీ చేస్తే వర్మకు నలభై అయిదున్నర వేల ఓట్లు వచ్చాయి. ఇక 2014 నాటికి వర్మకు టికెట్ ఇవ్వకుండా పీవీ విశ్వం కి ఇస్తే వర్మ ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి ఏకంగా 97,511 సాధించారు. మెజారిటీ చూస్తే 47,080 వచ్చింది. టీడీపీ పెట్టిన పీవీ విశ్వం కి 15,187 ఓట్లు వచ్చాయి. దీనిని బట్టి అర్ధం చేసుకోవాల్సింది ఒక్కటే ఉంది. టీడీపీ అంటే పిఠాపురంలో వర్మ అని.

ఆయన మొత్తం పార్టీని తనతో పాటు నడిపిస్తున్నారు. పక్కా లోకల్ ఆయన జనాలకు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతారు. ఆయనకు అదే ప్లస్ పాయింట్. పార్టీలు కంటే వర్మ బ్రాండ్ అన్నదే అక్కడ కీలకం. ఆయన 2019లో పోటీ చేస్తే జగన్ వేవ్ లో సైతం 68,467 సాధించారు అంటే చిన్న విషయం కాదు. వర్మకు వచ్చిన 2014 నాటి మెజారిటీ ఈ రోజుకీ రికార్డుగా ఉంది.

ఇక పిఠాపురంలో చూసుకుంటే కులాలతో సంబంధం లేకుండా అంతా వర్మ అని అంటారు. వారికి ఎమ్మెల్యేగా ఉండాల్సింది లోకల్ అని చెబుతారు. 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనాలకు అందుబాటులో ఉండరని విమర్శలు కూడా ప్రజలు చేస్తూ వచ్చారు.

ఈ కారణంగా వర్మను ఓడించడం అంటే కష్టం అనే అంటున్నారు. ఆనాడు అంటే 2014లో కూటమి కట్టినపుడు వర్మకు టికెట్ ఇవ్వలేదని ఇపుడు కూడా అన్యాయం చేస్తునారు అని ఆయన అనుచర వర్గం మండిపడుతోంది. మరో వైపు వర్మకు టీడీపీ అధినాయకత్వం నచ్చచెప్పాలని తెర వెనక ప్రయత్నం చేసింది.

అయితే ఆయన తగ్గేదే లే అంటూ పోటీకి సై అన్నారు. తనకు టికెట్ ఇచ్చి తీరాలి అని అన్నారు. ఇక వర్మ అనుచరులు కొత్త పాయింట్ లేవనెత్తుతున్నారు. భీమవరం గాజువాకలో పవన్ పోటీ చేస్తామంటే పెద్దగా వ్యతిరేకత టీడీపీలో లేదని కానీ అలాంటి సీట్లను వదిలేసి వర్మకు గట్టి పట్టున్న పిఠాపురం రావడం ఏంటని అంటున్నారు.

పైగా టీడీపీ మాజీ ఎమ్మెల్యేను జనసేనలో చేర్చుకుని భీమవరంలో ఆయనకు టికెట్ ఇచ్చారని, అదే పిఠాపురంలో మాత్రం పొత్తులతో బలమైన నేతను బలి చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక తనకు సీటు రాదు అని వర్మకు అర్ధమైన తరువాత సోషల్ మీడియా ద్వారా ట్వీటేసారు.

ఇప్పటివరకు పిఠాపురం ప్రజల కష్టాల్లో భాగం అయ్యాను. పిఠాపురం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేశాను. ఇన్ని చేసిన నాకు ఇది తీరని అన్యాయం. ఇక పిఠాపురం ప్రజలదే తుది నిర్ణయం అని ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ చేశారు. దీంతో ఆయన జనం మధ్యనే తేల్చుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన శుక్రవారం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

ఆయన మరోసారి పోటీకి దిగబోతున్నారు అని అర్ధం అవుతోంది. ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగితే పవన్ కి గెలుపు కష్టాలు మొదలైనట్లే అంటున్నారు. వర్మ కచ్చితంగా మూడవ వంతు ఓట్లను పట్టుకెళ్తారు అని అంటున్నారు. ఆయన పట్ల సానుభూతి ఉంది. దాంతో గెలుపు ఖాయం అని అంటున్నారు.

ఆయనను మంచి చేసుకోవడానికి టీడీపీ ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వర్మకు ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీ గెలిచాక మంత్రి ఇస్తారు అని ప్రకటనలు వస్తున్నాయి. కానీ వర్మ తగ్గకూడదు అని క్యాడర్ అంటోంది. మొత్తం మీద పిఠాపురం సేఫ్ జోన్ అని పవన్ వస్తున్నారు కానీ ఇక్కడే అసలైన పితలాటకం మొదలైంది అని అంటున్నారు. అంతా వర్మ చేతులలో ఉంది అని అంటున్నారు.

ఆయన తగ్గితే కనుక జనసేనాని ఊపిరి పీల్చుకోవచ్చు అంటున్నారు. మరి వర్మ ఒకవేళ తగ్గినా ఆయన అనుచరులు జనసేనకు ఓటు వేస్తారా అంటే అది కూడా చూడాలని అంటున్నారు. ఇక జనసేనకు బలం లేదా అంటే 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మాకినీడు శేషుకుమారికి 28 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఇపుడు పవన్ కాబట్టి అవి డబుల్ కావచ్చు. కానీ గెలవాలి అంటే కచ్చితంగా ఎనభై వేల నుంచి తొంబై వేల దాకా కావాలి. అవన్నీ టీడీపీ నుంచే ట్రాన్స్ ఫర్ కావాలి. మొత్తానికి వర్మతోనే పవన్ కి ఇపుడు పోటీ వచ్చేట్లుంది అని అంటున్నారు.