ఎమ్మెల్యేగా మొత్తం జీతం తీసుకుంటా: పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచివిజయం దక్కించుకున్న పవన్ కల్యాణ్ తన జీతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 5 Jun 2024 11:04 PM ISTసాధారణంగా ప్రముఖులు రాజకీయాల్లోకివచ్చి.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. పదవులు పొందిన తర్వాత.. తాము జీతాలు తీసుకోబోమని.. వాటిని ప్రజలకోసమే వదిలేస్తామని చెబుతుంటారు. ఇప్పటికీ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రూ.10 జీతంగా తీసుకుంటారని అంటారు. ఇక, తాజాగా మాజీ అయిన.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా.. రూ.1 జీతంగా తీసుకున్న విషయం తెలిసిందే. ఇలా.. అనేక మంది ఉన్నారు. ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నుంచివిజయం దక్కించుకున్న పవన్ కల్యాణ్ తన జీతంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాను ఎమ్మెల్యేగా మొత్తం జీతం తీసుకుంటానని పవన్ చెప్పారు. ``ఎమ్మెల్యేగా మొత్తం జీతం తీసుకుంటా. ఎందుకంటే ఆ డబ్బు ప్రజల రక్తం, చమట, స్వేదం నుంచి వచ్చింది. ఆ డబ్బు ముట్టుకున్నప్పుడల్లా నాకు ఆ బాధ్యత అనుక్షణం గుర్తు రావాలి. ఒకవేళ నేను సరిగా పని చేయకుంటే ప్రతి రూపాయికి నన్ను చొక్కా పట్టుకుని నిలదీసే హక్కు ప్రజలకు ఉండాలి. అందుకే పూర్తి జీతం తీసుకుంటాను. ఆ తర్వాత ఇవ్వాల్సింది ఎలాగో ఇచ్చేస్తాను. అందరం కూడా జవాబుదారి ప్రభుత్వం ఎలా ఉంటుందో చూపిద్దాం`` అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
బుధవారం ఢిల్లీకి వెళ్లేముందు.. ఆయన పార్టీ కార్యకర్తలు, గెలిచిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతతో మెలగాలని సూచించారు. ``ఇది పండుగ చేసుకునే సమయం కాదు. బాధ్యతతో ఉండాల్సిన సమయం`` అని వ్యాఖ్యానించారు. చట్టాలు చేసేవాళ్లు ఎలా ఉండాలో చూపిద్దామని నాయకులకు పిలుపునిచ్చారు. పార్లమెంటుకు వెళ్లేది ప్రజల కోసం పని చేయడానికేనని చెప్పారు.
వారికి అభినందనలు..
జనసేనను గెలిపించేందుకు రక్తం ధారబోసిన జనసైనికులు, వీర మహిళలకు అభినందనలని పవన్ కల్యాణ్ చెప్పారు. 'కేంద్రంలో కీలకం కాబోతున్నాం. ఎంపీలు ఉదయ్, బాలశౌరికి చాలా బాధ్యత ఉంది. జనసేన ఎంపీల కదలికలను ప్రతి ఒక్కరూ పరిశీలిస్తారు. ఇది అద్భుత విజయం. పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడం చారిత్రాత్మక విజయం.' అని పవన్ పేర్కొన్నారు.
