"నన్ను బ్లేడ్లతో కోస్తున్నారు".. పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి తెరలేపిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 2 April 2024 12:46 AM ISTఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఎన్నికల ప్రచారానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో కేడర్ తో బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా... పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. ఇందులో భాగంగా... ఫోటోలు దిగడానికని వచ్చి సన్న బ్లేడులతో కోస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు!
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు పిఠాపురంలో చేరికల సందర్భంగా మాట్లాడిన పవన్... "పిఠాపురంలో రోజూ కనీసం 200 మందికి నేను పిలిచి ఫోటోలు ఇస్తాను. ఈ సమయంలో మనం కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్దంటే... కొంతమంది కిరాయి మూకలు.. ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్ లు తీసుకొచ్చి నన్ను, సెక్యూరిటీ వాళ్లను కట్ చేస్తున్నారు" అని అన్నారు.
ఇదే క్రమంలో... మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి... కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాక.. తన రోజు వారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీ గ్రామంలోనూ మనవాళ్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఫోటోలు ఇవ్వడానికి తాను సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇది తాను శ్రీపాద శ్రీవల్లభుడి సాక్షిగా మనస్పూర్తిగా చెబుతున్నట్లు తెలిపారు.
కాగా... గతంలో కూడా పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు పలుమార్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. గతంలో తనకు బెదిరింపు కాల్స్ వచ్చేవని.. కారు యాక్సిడెంట్లు చేస్తామని, ఊహించుకోనివన్నీ చేస్తామని బెదిరించారని అన్నారు. దానికి సమాధానంగా.. "మీరు ఏమైనా చేసుకోండీ, నేను ఎవరికీ భయపడను, తెగింపు ఉన్నవాడిని" అని తనను బెదిరించిన వారితో చెప్పినట్లు పవన్ తెలిపారు.
ఇదే సమయంలో తన విషయంలో అంతా ప్రోటోకాల్ పాటించాలని.. తనకు లైఫ్ థ్రెట్ ఉందని.. తనను చంపడానికి సుపారీ ఇచ్చారని.. ఒక మనిషి చనిపోయాక ఇవన్నీ బయటకు వస్తాయని.. మీకెవరికీ లైఫ్ థ్రెట్ లేదు కానీ నాకు ఉందంటూ పవన్ కార్యకర్తలను ఉద్దేశించి కాకినాడలో వ్యాఖ్యానించిన సంగతీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి తనతో ఫోటో దిగడానికి గుంపులుగా జనం వస్తున్నప్పుడు కొంతమంది సన్నపాటి బ్లేడ్ లు తీసుకొస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
