Begin typing your search above and press return to search.

జనసేన తాజా నంబర్ 21...!?

పొత్తులు కష్టపడి కుదిర్చాను మూడు పార్టీల మధ్య 2014 నాటి బంధాన్ని పునరుద్ధరించాను అని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈ పొత్తుల వల్ల ఒరిగింది ఏమిటి అన్న చర్చ మొదలైంది

By:  Tupaki Desk   |   11 March 2024 5:45 PM GMT
జనసేన తాజా నంబర్ 21...!?
X

పొత్తులు కష్టపడి కుదిర్చాను మూడు పార్టీల మధ్య 2014 నాటి బంధాన్ని పునరుద్ధరించాను అని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఈ పొత్తుల వల్ల ఒరిగింది ఏమిటి అన్న చర్చ మొదలైంది. ఈ పొత్తుల వల్ల పవన్ ఇచ్చే సీట్లు అంతకంతకు తగ్గిపోతున్నాయని అంటున్నారు. గత నెల 24న చంద్రబాబు పవన్ కూర్చుని విడుదల చేసిన తొలి జాబితా ప్రకారం చూస్తే జనసేనకు 24 సీటు మూడు ఎంపీ సీట్లు దక్కాయి. ఈ విషయాన్ని పవన్ చంద్రబాబు ఇద్దరూ మీడియాకు చెప్పారు.

అయితే ఈ మధ్య ఢిల్లీ వెళ్ళి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న సమయంలో జనసేన ఎంపీ సీట్లలో ఒకటి తగ్గింది అని ప్రచారం సాగింది అది నిజమే అని కూడా అంటున్నారు. అనకాపల్లి ఎంపీ సీటుని జనసేన వదులుకుంది అని చెబుతున్నారు.

ఇక తాజాగా చూస్తే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో గంటల తరబడి చర్చలు సాగించిన నేపధ్యంలో అమాంతం బీజేపీ అసెంబ్లీ సీట్లు పెరిగిపోయాయని అంటున్నారు. ఢిల్లీలో పొత్తుల వేళ జరిగిన ప్రచారం మేరకు బీజేపీ ఆరు అసెంబ్లీ సీట్లకే పోటీ చేస్తుంది అని అంతా అనుకున్నారు.

కానీ ఇపుడు చూస్తే ఆరు కాస్తా పది అయింది. పది అసెంబ్లీ ఆరు ఎంపీ సీట్లకు బీజేపీ పొత్తులలో భాగంగా పోటీ చేస్తుంది అని అంటున్నారు. పది అసెంబ్లీ సీట్లు అంటే వాటిలో మూడు జనసేన నుంచి తీసి ఇస్తున్నారు అన్నది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం.

అంటే ఈ విధంగా చూస్తే 24 అసెంబ్లీ సీట్లను తీసుకున్న జనసేన ఇపుడు 21 సీట్లకే పరిమితం అవుతుంది అని అంటున్నారు. ఈ కొత్త లెక్కలు బయటకు రావడంతో జనసైనికులు మరింత నిరాశ పడుతున్నారు. జనసేనకు 24 సీట్లు ఇచ్చినవే తక్కువ అనుకుంటే అందులో కూడా మూడు కోత పెట్టడమేంటి అన్నది ఆ పార్టీలో బాధగా ఉంది అంటున్నారు. మరో వైపు ఈ పొత్తుల వల్ల గరిష్టంగా లాభపడుతున్న టీడీపీ ఎందుకు బీజేపీకి సీట్లు తాను తగ్గించుకుని ఇవ్వదూ అన్న ప్రశన్లు కూడా వస్తున్నాయి.

రేపటి రోజున కాలం కలసొచ్చి కూటమి అధికారంలోకి వస్తే సీఎం అయ్యేది చంద్రబాబే కదా అని అంటున్నారు. కానీ 145 సీట్లకు ససేమిరా తగ్గమని టీడీపీ భీష్మించుకుని కూర్చుందని అంటున్నారు. అదే టైం లో బీజేపె తనకు పది కంటే తక్కువ సీట్లు వద్దే వద్దు అని డిమాండ్ చేసింది అని అంటున్నారు.

ఈ రెండు పార్టీల మధ్యలో సీట్లు పోగొట్టుకుంటూ కూడా పొత్తుని నిలబెడుతోంది మాత్రం జనసేన అని అంటున్నారు. మొత్తం మీద జనసేన లేటెస్ట్ నంబర్ 21 అని అంటున్నారు. ఈ సీట్ల పితలాటం ఇంకా అలాగే సాగితే జనసేన మరెన్ని సీట్లు కోల్పోవాల్సి వస్తుందని కూడా అంటున్నారు అంతా.