Begin typing your search above and press return to search.

జనసేనలో అగ్గిని చల్లార్చేదెవరు...!?

ఇదే తీరున మరికొన్ని చోట్ల వివాదాలకు కూడా బాబు ఫుల్ స్టాప్ పెట్టే యత్నం చేశారు. చాలా మందికి బాబు భవిష్యత్తు హామీలు ఇచ్చారు

By:  Tupaki Desk   |   27 Feb 2024 9:22 AM GMT
జనసేనలో అగ్గిని చల్లార్చేదెవరు...!?
X

టీడీపీ అధినేత 94 సీట్లను ఒకేసారి ప్రకటించారు. ఆ మీదట ఆయన ఉండవల్లిలో రెండు రోజుల పాటు ఉంటూ చాలా వరకూ వివాదాలను సర్దుబాటు చేశారు. ఆశావహులుగా ఉన్న వారిని పిలిచి మంతనాలు జరిపారు. చంద్రబాబు ఏ మంత్రం వేశారో తెలియదు కానీ మాజీ మంత్రులు దేవినేని ఉమా అలాగే గంటా శ్రీనివాసరావు మీడియా ముందుకు వచ్చి బాబు ఎలా చెబితే అలా అనేశారు.

ఇదే తీరున మరికొన్ని చోట్ల వివాదాలకు కూడా బాబు ఫుల్ స్టాప్ పెట్టే యత్నం చేశారు. చాలా మందికి బాబు భవిష్యత్తు హామీలు ఇచ్చారు. తమ్ముళ్లు బాబుని కలసిన తరువాత మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు. గంటా అయితే సూర్యుడు అటు నుంచి ఇటు పొడిచినా టీడీపీ జనసేన విజయం ఖాయం అని చెబుతున్నారు.

సరే టీడీపీకి ట్రబుల్ షూటర్ కూడా చంద్రబాబే కాబట్టి ఆయన చాలా వరకూ అక్కడ గొడవలు సర్దుబాటు చేసుకున్నారు. మరి కేవలం అయిదు సీట్లు మాత్రమే ప్రకటించి 19 సీట్లు ఆపేసిన జనసేనలో గొడవలు ఒక రేంజిలో సాగుతున్నాయి. చాలా మంది అయితే మండిపోతున్నారు. తాము గెలిచే సీటు టీడీపీకి ఇస్తారా అంటూ ఏలూరు, తణుకు జనసేన ఇంచార్జిలు ఫైర్ అవుతున్నారు. ఇక జగ్గంపేట ఇంచార్జి సూర్యచంద్ర విషయం అయితే చెప్పనక్కరలేదు. ఆయన పూర్తి వైరాగ్యంలో పడ్డారు. రాజమండ్రి రూరల్ లో కందుల దుర్గేష్ సీటు కోసం అనుచరుల ఆందోళన పీక్స్ లో సాగుతోంది.

వీరందరినీ పిలిచి మాట్లాడి సర్దుబాటు చేసేది ఎవరు అన్న ప్రశ్న వస్తోంది. జనసేనలో నంబర్ టూ గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. అయితే ఆయన మీదనే ఇపుడు జనసైనికులు మండిపోతున్నారని ప్రచారం సాగుతోంది. దాంతో ఆయన్ని దించలేరు. నాగబాబు ఫీల్డ్ లోకి దిగితే కొంత సర్దుబాటు కావచ్చు కానీ ఆయనకు ఈ పని అప్పగించాల్సి ఉంది.

ఇవన్నీ ఎందుకు డైరెక్ట్ గా అందరినీ తన వద్దకే పిలిపించుకుని పవన్ కళ్యాణ్ మాట్లాడితే చాలా వరకూ సమస్యలు సమసిపోతాయని అంటున్నారు. కానీ ఇంతవరకూ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారా లేదా తెలియడం లేదు. దీంతో జనసేనలో ఆగ్రహం మాత్రం అలాగే ఉంది.

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సాధ్యమైనంతవరకూ బుజ్జగింపులు చేసి దారికి తీసుకుని రాకపోతే పొత్తులు పెట్టుకున్నా ఫలితం అయితే కనిపించదు అని అంటున్నారు ఈ విషయంలో జనసేనకు గతానుభవాలు అయితే లేవు. ఎందుకంటే 2019లో ఆ పార్టీ సోలోగా పోటీ చేసింది. కోరిన వారికి టికెట్లు ఇచ్చుకుంది. ఇపుడు పొత్తులతో సర్దుబాటు చేసుకోవాలి తగ్గాలి.

ఆ మెకానిజం కూడా ఉండాలి. టీడీపీకి అయితే ఇలాంటివి కొట్టిన పిండి అని అంటున్నారు. చంద్రబాబు ఎటువంటి నేతను అయినా తన వద్దకు వస్తే కూల్ చేసి పంపించే చాణక్యుడు అని చెబుతారు. అందుకే 94 సీట్లు ప్రకటించిన టీడీపీ కంటే 5 సీట్లు ప్రకటించిన జనసేనలోనే ఎక్కువ అలకలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

రాజకీయాలు అన్నాక ఒకే పార్టీలో ఆశావహులు ఉంటారు. ఇక పొత్తులు పెట్టుకుంటే అది రెట్టింపు అవుతుంది. వారూ వీరూ కలసి అరడజను మంది ఆశావహులు ఉంటే సీటు దక్కేది ఒక్కరికే. ఆ మిగిలిన వారిని దారిలోకి తెచ్చుకోవడం బట్టే పొత్తుల విజయం ఆధారపడి ఉంటుంది. ఈ విషయాలు బాబుకు తెలుసు. పవన్ కూడా తొందరలోనే సర్దుబాటు చేస్తారని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.