Begin typing your search above and press return to search.

జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన పవన్... దానితో పోల్చుతూ...!

పేదలను దోచుకుంటున్న జగన్ క్లాస్ వార్ అని చెప్పడం కంటే వింత వేరే లేదని పవన్ విమర్శించారు. ఆయన గద్దెనెక్కగానే పేదల మీదనే పడ్డారని పవన్ ఎత్తి చూపారు.

By:  Tupaki Desk   |   17 April 2024 5:14 PM GMT
జగన్ మీద తీవ్ర విమర్శలు చేసిన పవన్... దానితో పోల్చుతూ...!
X

జగన్ మీద మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ధైర్యం లేని వాడు అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రం మెడలు వంచుతాను అని చెప్పిన జగన్ అయిదేళ్ళ పాటు ఏమీ చేయలేదని ఎత్తిపొడిచారు. అయినా ప్రధాని నరేంద్ర మోడీ ముందు నిలిచే సాహసం జగన్ చేయగలరా అని ప్రశ్నించారు. సోనియా గాంధీకి భయపడి విభజన సమయంలో పార్లమెంట్ లో సమైక్య రాష్ట్రం కార్డుని పట్టుకోలేక మూలన దాక్కున్న వారు జగన్ అని ఎద్దేవా చేశారు.

జగన్ తన మీద తానే రాళ్ళు వేయించుకున్నారేమో అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అసలు జగన్ మీద రాళ్ళు వేయించడం దాడులు చేయించడమేనా మాకు పని అని పవన్ ప్రశ్నించారు. మాకు అది సరదా అనుకుంటున్నారా అని నిలదీశారు. జగన్ లాంటి క్రిమినల్ మెంటాలిటీ తమకు లేదని అన్నారు. సొంత చిన్నాన్నను నరికేసిన వారికి మద్దతు ఇస్తూ ఎన్నో దాడులను ప్రోత్సహిస్తున్న జగన్ మీద ఎవరు ఎందుకు దాడులు చేస్తారు అని ఆయన మండిపడ్డారు

జగన్ లాంటి వారు రాజకీయాలకు అనవసరం అని అన్నారు. ఆయనను పూర్తిగా పక్కన పెట్టాలని పవన్ అన్నారు. జగన్ లాంటి వారు రాష్ట్రానికి దేశానికి పట్టిన చీడపురుగులు అని తీవ్ర వ్యాఖ్యలే చేసారు. తాము రాష్ట్ర భవిష్యత్తు కోసమే పొత్తులు పెట్టుకున్నామని పవన్ అన్నారు. ఏపీని బాగు చేయాలంటే జగన్ ఓటమి తప్పదని ఆయన స్పష్టం చేసారు.

తాను భీమవరంలో పోటీ చేయలేదని జగన్ బాధపడుతున్నారని పవన్ సెటైర్లు వేశారు. జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడ నుంచి ఎక్కడికైనా బదిలీ చేయవచ్చునా నేను వేరే చోటకు వెళ్ళి పోటీ చేస్తే ఆయనకు ఉన్న అభ్యంతరం ఏంటి అని నిలదీశారు. పేదలను దోచుకుంటున్న జగన్ క్లాస్ వార్ అని చెప్పడం కంటే వింత వేరే లేదని పవన్ విమర్శించారు. ఆయన గద్దెనెక్కగానే పేదల మీదనే పడ్డారని పవన్ ఎత్తి చూపారు.

ఏపీలో ఏ పని జరగాలన్నా రేటు కట్టి మరీ వైసీపీ ఎమ్మెల్యేలు దోచేశారు అని పవన్ మండిపడ్డారు. ఏపీలో అవినీతి అక్రమాలు గత అయిదేళ్లలో రాజ్యమేలాయని ఆయన అన్నారు. వాటికి చరమగీతం ప్రజలు పాడతారు అని ఆయన అన్నారు. అంతే కాదు ఈసారి ఏపీ గతిని మార్చే విధంగా ఎన్నికలు జరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీకి మంచి భవిష్యత్తుని కూటమి ఇస్తుందని అన్నారు. ఏపీలో నూరు శాతం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అపుడు అందరికీ న్యాయం చేస్తామని ఆయన చెప్పారు.