Begin typing your search above and press return to search.

చెన్నైలో గబ్బర్ సింగ్ ప్రభావం ఎంత ?

2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమెను బీజేపీ అధిష్టానం గవర్నర్ గా నియమించింది.

By:  Tupaki Desk   |   16 April 2024 5:30 PM GMT
చెన్నైలో గబ్బర్ సింగ్ ప్రభావం ఎంత ?
X

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తన గవర్నర్ పదవికి రాజీనామా చేసి తమిళనాడులోని చెన్నై సౌత్ లోక్ సభ స్థానం నుండి బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేసిన తమిళిసై మూడు సార్లు శాసనసభ, రెండు సార్లు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తరువాత ఆమెను బీజేపీ అధిష్టానం గవర్నర్ గా నియమించింది.

తమిళిసై 2006లో రాధాపురం శాసనసభ స్థానం నుండి పోటీ చేసి 4.70 శాతం ఓట్లు, 2011 వేలచేరి శాసనసభ స్థానం నుండి పోటీ చేసి 4.63 శాతం ఓట్లు, 2016 విరుగంపాక్కం శాసనసభ స్థానం నుండి పోటీ చేసి 11.19 శాతం ఓట్లు సాధించి డిపాజిట్ కోల్పోగా, 2009లో చెన్నై నార్త్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి 3.54 శాతం ఓట్లు, 2019 తూత్తుకుడి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి 21.77 శాతం ఓట్లు సాధించారు. ఈ ఎన్నికల్లో చెన్నై సౌత్ నుండి పోటీకి దిగి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే పనిలో ఉన్నారు.

చెన్నై సౌత్ లోక్ సభ స్థానంలో 2019 లెక్కల ప్రకారం 19,16,378 మంది ఓటర్లు ఉన్నారు. 9,52,126 మగ, 9,63,888 ఆడ ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికల్లో డీఎంకె అభ్యర్థి సుమతి తంగపాండియన్ 5,64,872 ఓట్లు సాధించి ఏఐడీఎంకె అభ్యర్థి జయవర్ధన్ మీద 2.62 లక్షల పై చిలుకు ఓట్లతో విజయం సాధించింది. 2014లో ఇక్కడ పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి ఎల్ఎ గణేషన్ 2,58,262 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 2019లో ఇక్కడ బీజేపీ పోటీ చేయలేదు. ప్రస్తుతం తమిళిసై బరిలోకి దిగారు.

ఈ స్థానం నుండి 2014లో గెలిచిన జయవర్ధన్ ఏఐడీఎంకె తరపున, 2019లో గెలిచిన సుమతి తంగపాండియన్ డీఎంకె తరపున మళ్లీ బరిలోకి దిగారు. అయితే ఇక్కడ తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న నేపథ్యంలో వారిని ఆకర్షించడానికి జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తమిళిసై తరపున త్వరలో ప్రచారానికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. గతంలో చెన్నై నుండి తెలుగు సినిమా పరిశ్రమ నడుస్తున్నప్పుడు అక్కడ వారి ప్రభావం కనిపించేది. నాలుగు దశాబ్దాల క్రితమే పరిశ్రమ అక్కడి నుండి తరలి హైదరాబాద్ కు వచ్చింది. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ప్రచారం ఎంత వరకు లాభిస్తుంది అన్నది వేచిచూడాలి. రాజకీయాల్లో అన్ని అవకాశాలు కీలకమే కాబట్టి అభ్యర్థులు ఏ అవకాశాన్ని జారవిడుచుకునే పరిస్థితిలో లేరు. ఇటీవల తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైకి మద్దతుగా నారా లోకేష్ ప్రచారం చేసి వచ్చాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది.