Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యే సీటు జనసేనకు... అభ్యర్థిని ప్రకటించిన పవన్!

ఇందులో భాగంగా... తొలివిడత అభ్యర్థుల జాబితాలో భాగంగా చంద్రబాబు ప్రకటించిన పి.గన్నవరం నియోజకవర్గంలో తాజాగా జనసేన అభ్యర్థిని కన్ ఫాం చేశారు.

By:  Tupaki Desk   |   23 March 2024 1:39 PM GMT
టీడీపీ ఎమ్మెల్యే సీటు జనసేనకు...  అభ్యర్థిని ప్రకటించిన పవన్!
X

ఇప్పటివరకూ జనసేన కోరుకున్న స్థానాలేవీ ఆ పార్టీ నేతలకు దక్కడం లేదని, చంద్రబాబు చెప్పే ప్రతీ మాటకూ పవన్ డూడూ బసవన్న మాదిరి తయారవుతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... పవన్ కల్యాణ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తొలివిడత అభ్యర్థుల జాబితాలో భాగంగా చంద్రబాబు ప్రకటించిన పి.గన్నవరం నియోజకవర్గంలో తాజాగా జనసేన అభ్యర్థిని కన్ ఫాం చేశారు.


అవును... టీడీపీ అభ్యర్థుల తొలి జాబితాలో భాగంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా సరిపల్లి రాజేష్ (మహాసేన రాజేష్) ను ప్రకటించారు చంద్రబాబు. దీంతో... రాజోలు టిక్కెట్ దక్కకపోయినా పి.గన్నవరం అయినా దక్కుతుందని ఎదురుచూసిన టీడీపీ కీలకనేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో జాయిన్ అయిపోయారు. అనంతరం రాజోలు టిక్కెట్ దక్కించుకున్నారు.


దీంతో... పి.గన్నవరంలో టీడీపీకి బలమైన అభ్యర్థి లేరనే కామెంట్లు వినిపించాయి. మరోపక్క అమలాపురం ఇన్ ఛార్జ్ ఆనందరావుని పి.గన్నవరంకు రప్పించి.. అమలాపురం టిక్కెట్ జనసేనకు కేటాయించే అవకాశాలున్నాయని అన్నారు. అయితే... అభ్యర్థుల మూడో విడత జాబితాలో భాగంగా అమలాపురానికి ఆనందరావు అభ్యర్థిత్వాన్ని కన్ ఫాం చేశారు చంద్రబాబు. దీంతో... పి.గన్నవరం అభ్యర్థి ఎవరా అనే ప్రశ్న స్థానికంగా బలంగా చర్చకు వచ్చింది.


ఇదే సమయంలో... తనకు టిక్కెట్ లేదనే విషయంపై సమాచారం వచ్చిందని, మహాసేన రాజేష్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో... జనసేన కార్యకర్తల కోరిక మేరకు పి.గన్నవరం నియోజకవర్గానికి జనసేన అభ్యర్థిని ప్రకటించారు. ఇందులో భాగంగా... గిడ్డి సత్యనారాయణ పోటీ చేస్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దీంతో... పి.గన్నవరంలోని జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారని తెలుస్తుంది.

ఎవరీ గిడ్డి సత్యనారాయణ?:

కోనసీమలోని కీలక నియోజకవర్గాల్లో ఒకటైన పి.గన్నవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని ప్రకటించారు పవన్ కల్యాణ్. దీంతో.. అనూహ్యంగా అన్నట్లుగా టిక్కెట్ దక్కించుకున్న ఈ గిడ్డి సత్యన్నారాయణ ఎవరు అనే సెర్చ్ మొదలైంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..!

పి.గన్నవరం మండలం ఉడిమూడికి చెందిన సత్యనారాయణ.. 1961 మే 15న జన్మించారు. సీఆర్ రెడ్డి కాలేజీలో బీఏ, బీఏల్ చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్ లోని సిటీ పోలీస్ కమీషనరేట్ లో గెజిటెడ్ ఆఫీసర్ హోదాలో ఎకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేశారు. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి 31న స్వచ్చంద పదవీ విరమణ పొందారు.

ఈ క్రమంలో పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు నచ్చడంతో జనసేనలో చేరి పి.గన్నవరం ఇన్ ఛార్జ్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పి.గన్నవరం కూటమి అభ్యర్థిగా పవన్ కల్యాణ్.. సత్యనారాయణ పేరు ప్రకటించారు. దీంతో... కోనసీమ జిల్లాలో పక్క పక్క నియోజకవర్గాలైన రాజోలు, పి.గన్నవరం టిక్కెట్లు జనసేనకు దక్కినట్లయ్యింది.