Begin typing your search above and press return to search.

ముఖ్యమంత్రి పదవంటూ పగటి కలలు వద్దు...పవన్ క్లారిటీగా ఉన్నారా...?

ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఏంటి అన్నది మాత్రం ఎన్నికలు అయ్యాకనే చర్చించుకోవాల్సిన విషయాలు అని పవన్ అంటున్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 5:09 PM GMT
ముఖ్యమంత్రి పదవంటూ పగటి కలలు వద్దు...పవన్ క్లారిటీగా ఉన్నారా...?
X

టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నామని జనసేనాని రాజమండ్రి జైలు బయట ప్రకటించారు. దాంతో జనసైనికులలో ఒక కలవరం రేగింది. అదే టైం లో ఈ పొత్తు మీద టీడీపీ జనసేనలలో కూడా అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో మంగళగిరిలో పవన్ కళ్యాణ్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి పదవి అంటూ పగటి కలలు కనవద్దు అంటూ ఆయన జనసైనికులకు ఒక పాత కధను చెప్పి మరీ వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. ముందు ఏపీలో జగన్ ఉండకూడదు, ఏపీ నుంచి జగన్ని తరిమేయాలి. టీడీపీ జనసేన ఎన్నికల్లో గెలవాలి. అపుడు రాజు ఎవరో మంత్రి ఎవరో తేలుతుంది. అప్పటిదాకా సీఎం అంటూ మాట్లాడవద్దు అని పవన్ చెప్పేశారు.

అంతే కాదు జనసేన ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది, ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది ఇలాంటివి అన్నీ కూడా తనకే వదిలేయాలని ఆయన చెప్పారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలిచి అటు అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ లో కూడా అడుగు పెడుతుందని ఆయన ధీమాగా చెప్పారు.

ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఏంటి అన్నది మాత్రం ఎన్నికలు అయ్యాకనే చర్చించుకోవాల్సిన విషయాలు అని పవన్ అంటున్నారు. ఏపీలో జనసేన టీడీపీ విజయమే ప్రాతిపదిక కావాలని క్యాడర్ కి ఆయన చెప్పుకొచ్చారు.

జగన్ అన్న నాయకుడిని ఆయన పార్టీని ఏపీలో లేకుండా చేస్తేనే ఏపీకి భద్రత అని ఆయన చెప్పడం విశేషం. ఈ సందర్భంగా ఒక పురోహితుడు పేలపిండి కధను ఆయన క్యాడర్ కి చెప్పుకొచ్చారు. ఒక పేద పురోహితుడు పేలపిండిని తెచ్చి ఇంటిలో ఉంచుతాడని, ఆ మీదట ఆ పేలపిండి అమ్మితే వచ్చే డబ్బులు, ఆ తరువాత వ్యవసాయం చేస్తే వచ్చే డబ్బులు ఇలా లెక్కలు అన్నీ వేసుకుంటూ ఉంటాడని చెప్పుకొచ్చారు.

ఆ పగటి కలలోనే పురోహితుడు పెళ్ళి చేసుకుంటాడు, బిడ్డను కంటాడు, బిడ్డ రోడ్డు మీద ఆడుకుంటూంటే ఎందుకు వదిలేశావని భార్యను మందలించాలని చేయి లేపుతాడని ఆ చేయి కాస్తా గోడకు కట్టిన పేలపిండికి తగిలి మొత్తం పోయింది, పగటి కల కూడా కరిగింది అంటూ ఆసక్తికరమైన కధనే పవన్ వినిపించారు.

దీంతో జనసేన సమావేశంలో నవ్వులు విరిసాయి. అందువల్ల పగటి కలలు కంటే అసలుకే మోసం వస్తుందని పవన్ హెచ్చరించారు. ముందు ముఖ్యమంత్రి మంత్రులు అధికారం ఇవన్నీ కాదు జగన్ ఓడిపోవాలి. అదే మనకు కావాలని పవన్ కళ్యాణ్ చెప్పడం విశేషం. మరో వైపు చూస్తే ఎన్ని సీట్లు ఎక్కడ నుంచి పోటీ అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.

దీంతో కూటమిలో టీడీపీ పెద్ద పార్టీ కాబట్టి కచ్చితంగా ఆ పార్టీయే ఎక్కువ సీట్లు తీసుకుంటుందని అందరికీ తెలుసు. ఇక పవన్ ఇపుడు చెప్పకపోయినా ఎన్నికల ముందు అయినా సీట్లు ఎన్ని తెలుస్తాయి కాబట్టి ఎన్నికల తరువాత అన్నది ఉండదు. అయితే అప్పటికే జనసేన క్యాడర్ ట్యూనప్ అవుతారు అవాలి అన్నదే సేనాని వ్యూహంగా కనిపిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి జగన్ ఓడిపోవాలి అన్న స్లోగన్ తోనే పవన్ సమావేశంలో మాట్లాడారు అంటున్నారు.