Begin typing your search above and press return to search.

పవన్ పై రాయి దాడి యత్నం!

ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో నిన్న రాయితో దాడి జరిగిన ఘటన జాతీయ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 April 2024 5:31 PM GMT
పవన్ పై రాయి దాడి యత్నం!
X

ఏపీ సీఎం జగన్ పై విజయవాడలో నిన్న రాయితో దాడి జరిగిన ఘటన జాతీయ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై రాయితో దాడి జరగడం సంచలనం రేపింది. అయితే, ఈ రాళ్ల దాడి కూడా కోడి కత్తి దాడి లాంటిదని కొందరు ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తెనాలిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వ్యక్తి రాయి విసిరిన ఘటన సంచలనం రేపింది.

అయితే, ఆ రాయి పవన్ కు తగలకుండా దూరంగా పడడంతో ఆయనకు గాయం కాలేదు. రాయి విసిరిన వ్యక్తిని జనసైనికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తెనాలిలో వారాహి విజయభేరి సభకు హాజరయ్యేందుకు పవన్ కళ్యాణ్ తెనాలి వెళ్లిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. వైసీపీ సానుభూతిపరులు పవన్ పై రాయి విసిరి ఉంటారని, జగన్ పై రాయి దాడికి ప్రతీకారంగా పవన్ ను గాయపరిచే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, జగన్ పై రాయి విసిరిన వ్యక్తులు ఎవరు అన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.

ఏదేమైనా నిన్న జగన్ పై, ఈరోజు పవన్ పై రాళ్ల దాడి జరగడం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ తరహా ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తుంది. కాగా, జగన్ పై రాయి దాడి ఘటనను జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఖండించిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండడం సహజమని, కానీ, ఈ తరహా భౌతిక దాడులకు పాల్పడడం ఏమిటని నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు చేయడం నేరమని, ఇటువంటి పనులు చేసిన దుండగులను పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరారు. మరోసారి, ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కట్టుదిట్టం చేయాలని నాగబాబు కోరారు.