పర్యాటకుల కోసం 'టూరిస్ట్ పోలీస్'.. పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్!
ఏపీని పర్యాటకుల స్వర్గధామంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
By: Tupaki Desk | 23 May 2026 1:51 PM ISTఏపీని పర్యాటకుల స్వర్గధామంగా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెబుతున్నారు. పర్యాటకుల భద్రత, ఉపాధి కల్పనకు పెద్దపీట వేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో 50 వేల మంది యువతకు ఉపాధి కల్పించేలా డిప్యూటీ సీఎం పవన్ సూచనలు చేశారని అధికార వర్గాలు వెల్లడించాయి.
పర్యాటక పోలీసు.. పవన్ ప్రతిపాదన
రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వేరే దేశాలు, రాష్ట్రాల నుంచి కొత్త ప్రదేశాలను చూడటానికి వచ్చే వారికి పూర్తి భరోసా కల్పించేందుకు పర్యాటక పోలీసు అనే సరికొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీనిపై త్వరలోనే క్యాబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తన ప్రతిపాదన అమలులోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 వేల మంది యువతకు ఉపాధి లభించనుందని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు.
ఉమ్మడి కమిటీ ఏర్పాటు
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి అద్భుతమైన, చారిత్రక ప్రాధాన్యత ఉన్న 200 సందర్శనీయ ప్రాంతాలను గుర్తించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. అక్కడ ఉన్న వసతులు, సౌకర్యాల పూర్తి వివరాలతో కూడిన సమగ్ర నివేదికను 5 రోజుల్లోగా సమర్పించాలని అధికారులను గడువు విధించారు. క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం, జూన్ 10వ తేదీ లోపు అటవీ, పర్యాటక శాఖల మధ్య ఎంఓయూ కుదరాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
‘హోమ్ స్టే’ సంస్కృతికి ప్రోత్సాహం
మన రాష్ట్రంలోని గ్రామాల్లో ఎన్నో విశిష్టతలు ఉన్నప్పటికీ, వసతులు లేకపోవడం వల్ల పర్యాటకులు ఆసక్తి చూపడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల తరహాలో, స్థానికులు తమ ఇళ్లలోనే పర్యాటకులకు వసతి కల్పించి ‘అతిథి దేవోభవ’ అనేలా ఆదరించే సరికొత్త విధానాన్ని ఏపీ గ్రామాల్లో తీసుకురావాలని పంచాయతీరాజ్ అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి దీనిని అమలు చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ఒకే గొడుగు కిందకు పర్యాటకం, ఆధ్యాత్మికత
భక్తులు, పర్యాటకుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ, పర్యాటక శాఖను సమన్వయం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డితో చర్చించి, రెండు శాఖల సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని నిర్ణయించారు. భక్తులు దైవదర్శనం చేసుకునేలా, అదే ప్యాకేజీలో సమీపంలో ప్రకృతి అందాలను చూసి ఆనందించేలా ‘కాంబో టూరిజం ప్యాకేజీలు’ డిజైన్ చేయాలని, దీనికోసం ప్రత్యేకంగా ఒక యాప్ అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
