టీడీపీపై పవన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్.. ఎందుకంటే..
ఓ రాజకీయ పార్టీ అధినేతగా మరో పార్టీ అవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పవన్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
By: Tupaki Desk | 29 March 2025 11:33 AM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ లో టీడీపీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. 43వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న టీడీపీ భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షించారు. 42 ఏళ్ల ప్రస్థానంలో టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిందని కొనియాడారు. ఓ రాజకీయ పార్టీ అధినేతగా మరో పార్టీ అవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పవన్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎక్స్ లో ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు డిప్యూటీ సీఎం పవన్ అభినందనలు తెలిపారు. ‘‘ 1982 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికగా, ప్రజల గొంతుకగా తెలుగుదేశం వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోకి అడుగు పెట్టడం ఆనందంగా ఉంది. నాటి నుండి నేటి వరకు ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ, జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగి, ప్రజల పక్షాన నిలిచింది.భవిష్యత్తులో మరింత నిబద్ధతతో ప్రజల పక్షాన నిలబడాలని ఆకాంక్షిస్తున్నాను’’. అంటూ పవన్ ట్వీట్ చేశారు.
2014లో ఆవిర్భవించిన జనసేన తొలి నుంచి టీడీపీపై సానుకూల ధోరణి అనుసరిస్తూనే ఉంది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన జనసేన అధినేత.. 2024 ఎన్నికలకు ముందు కూటమిగా ఏర్పరిచి టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. ప్రభుత్వంలో భాగస్వామిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా నిలుస్తున్న పవన్ ఎప్పటికప్పుడు టీడీపీతో మెరుగైన సంబంధాలకు ప్రాధాన్యమిస్తున్నారు. చంద్రబాబు మరో పదిహేనేళ్లు సీఎంగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెబుతున్న పవన్ టీడీపీ ఆవిర్భావం సందర్భంగా చేసిన ట్వీట్ ఆ పార్టీతో సానుకూల సంబంధాలు కోరుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది. జనసేనాని ట్వీట్ టీడీపీలోనూ ఆనందం పంచుతోందని చెబుతున్నారు.
