Begin typing your search above and press return to search.

ప్రధాని మోదీని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయ్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగం

దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

By:  Tupaki Desk   |   1 Aug 2026 1:29 PM IST
ప్రధాని మోదీని తిడుతుంటే కన్నీళ్లొచ్చాయ్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావోద్వేగం
X

ప్రధాని మోదీపై తన అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆందోళనల్లో ప్రధాని మోదీని తిడుతుంటే తనకు కళ్లంట నీళ్లొచ్చాయని చెబుతూ డిప్యూటీ సీఎం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అల్లూరి సీతారామరాజు విమానాశ్రయ ప్రారంభోత్సవ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రిని కొందరు అనకూడని మాటలు అనడం తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాల పేరుతో ప్రధాని మోదీని ఇష్టానుసారంగా తిట్టడం చూసి తాను ఎంతో బాధపడ్డానని, కన్నీళ్లు వచ్చాయని ఆయన సభ సాక్షిగా గుర్తుచేసుకున్నారు. దేశం కోసం ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడికి మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు.

దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని పవన్ కళ్యాణ్ కొనియాడారు. గతంలో దేశం ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను ప్రస్తావిస్తూ, ఒకప్పుడు బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకునే దుస్థితి దేశంలో ఉండేదని, అలాంటి పరిస్థితి నుంచి నేడు భారత్ ను అత్యంత బలమైన ఆర్థిక శక్తిగా, అభివృద్ధి పథంలో మోదీ నడిపిస్తున్నారని ప్రశంసించారు. దేశాన్ని నడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదని, అది ఒక 'రామ కార్యం' లాంటిదని ఆయన అభివర్ణించారు. అనేక అడ్డంకులను, కుట్రలను అధిగమిస్తూ ప్రధాని దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు అభినందనీయమన్నారు.

ప్రధాని మోదీ ఉదారతను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. తనను వ్యక్తిగతంగా విమర్శించిన వారిని కూడా పెద్ద మనసుతో క్షమించిన గొప్ప గుణం మోదీ సొంతమని తెలిపారు. పిల్లలకు సంస్కారం ఎలా నేర్పించాలో ఆయన చేష్టల ద్వారా నిరూపిస్తున్నారని, అలాంటి విశాల దృక్పథం కలిగిన ప్రధాని మోదీ పాదాలకు నమస్కరిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. దేశ బాహ్య, అంతర్గత శత్రువులతో పోరాడుతూ 144 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బృహత్తర బాధ్యతను మోదీ భుజాన వేసుకున్నారని చెప్పారు. ప్రధాని మోదీని రాజకీయంగా ఎదుర్కొనే నాయకుడు ప్రస్తుతం లేడని, భవిష్యత్తులోనూ రాబోరని ఆయన స్పష్టం చేశారు.

ఈ ప్రారంభోత్సవ వేడుక ప్రాంతీయ అభివృద్ధికి ఒక చారిత్రక మైలురాయి అని పవన్ అభివర్ణించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం విమానాశ్రయానికి పెట్టడం ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను భావితరాలకు అందించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఉత్తరాంధ్రకే చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జీఎంఆర్ నేతృత్వంలో ఈ అంతర్జాతీయ విమానాశ్రయం రూపుదిద్దుకోవడం ప్రాంత ప్రజలకు గర్వకారణమన్నారు. ఈ ఎయిర్ పోర్టు రాకతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం అవుతుందని, రాష్ట్రాభివృద్ధికి భారీగా వస్తున్న పెట్టుబడులు బలమైన పునాదులుగా మారుతాయని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక వసతుల ద్వారా రాబోయే రోజుల్లో యువతకు అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని పవన్ తెలిపారు. దేశం కోసం నిలబడే సమర్థ నాయకులకు ప్రజలు అండగా నిలబడితేనే రాష్ట్రాలు, దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తాయని చెప్పడానికి భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండాలని కోరుకుంటూ, దేశ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న నాయకుడి వెన్నంటి తాము ఎప్పటికీ ఉంటామని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు.