Begin typing your search above and press return to search.

పవన్ ని ఇరుకున పెడుతున్న వర్మ !

పవన్ అంటే క్లీన్ ఇమేజ్ కోసం తపించే నాయకుడు. ఆయన రాజకీయాల్లో అవినీతి లేకుండా చూడాలని నినాదాలు ఇస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   9 Jun 2025 8:45 AM IST
పవన్ ని ఇరుకున పెడుతున్న వర్మ !
X

పవన్ అంటే క్లీన్ ఇమేజ్ కోసం తపించే నాయకుడు. ఆయన రాజకీయాల్లో అవినీతి లేకుండా చూడాలని నినాదాలు ఇస్తూ ఉంటారు. అంతే కాదు ఆయన వైసీపీ మీద అవినీతి అక్రమాలు అంటూ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒక రేంజిలో తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చేవారు. అటువంటిది ఆయన చేతుల్లోకి అధికారం వచ్చింది. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంతే కాదు ఉప ముఖ్యమంత్రి హోదా కూడా దక్కింది.

ఇక ఏపీలోనే పిఠాపురాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని జనసేన నేతలు ప్రకటించుకున్నారు. ఒక ఏడాది గడచింది. దాంతో టీడీపీ కూటమి పరిపాలన ఎలా ఉందో అన్నది చాలా మంది సర్వేలు చేస్తున్నారు. ఇంకో వైపు చూస్తే కనుక పిఠాపురంలో పవన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనితీరు మీద కూడా సహజంగానే ఆసక్తి ఉంటుంది.

సరిగ్గా ఈ సమయంలోనే పిఠాపురం టీడీపీ ఇంచార్జి అయిన ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే బాహాటంగా కొన్ని విషయాలు చెప్పారు. ఆయన విమర్శించే ధోరణిలో కాకుండా చాలా లౌక్యంగానే చెప్పాల్సింది చెప్పేశారు. పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతోందని వర్మ స్పష్టంగానే చెప్పేసారు. ఇది నిజానికి ఏ విపక్ష నాయకుడో చేయాల్సిన ఆరోపణ.

పిఠాపురంలో చూస్తే వైసీపీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి. దాంతో కూటమిలోనే లుకలుకలతో విపక్షం రోల్ కూడా పోషిస్తున్నట్లుగా ఉంది. ఇక వర్మ విషయం తీసుకుంటే ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనకు ఏమి మాట్లాడాలో ఏమి అనకూడదో బాగా అనుభవం ఉంది. అలాంటి నేత పిఠాపురంలో ఇసుక దందా సాగుతోంది అని చేసిన ఆరోపణలను తేలిగ్గా ఎవరూ తీసుకోలేరు అని అంటున్నారు.

అంతే కాదు పేదలకు ఇసుక దొరకడం లేదు. పెద్దలు టన్నులు టన్నులు తరలించుకుని పోతున్నారు అని హాట్ కామెంట్స్ చేశారు. దాంతో వర్మ కావాలని చేశారా లేక నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఒక మాజీ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రస్తావించారా అన్న చర్చ సాగుతోంది.

ఆయన ఏ ఉద్దేశ్యంలో చేసినా కూడా అది నేరుగా పవన్ కళ్యాణ్ కే తగిలింది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో సీన్ ఈ విధంగా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉంటుందో అన్నది కూడా అందరికీ చర్చగా ఉంది.

మరో వైపు చూస్తే పవన్ ఉప ముఖ్యమంత్రిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఈ దందాను అరికట్టలేకపోతున్నారా అన్న కొత్త చర్చకు కూడా వర్మ చేసిన కామెంట్స్ దారి తీస్తున్నాయని అంటున్నారు. ఇక వర్మకు టీడీపీలో బలమైన బంధం ఉంది. ఆయన పాతికేళ్ళ రాజకీయం చేస్తూ వస్తున్నారు. పిఠాపురం జనసేన అడ్డా అని ఆ పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలోనే గట్టిగా సౌండ్ చేస్తూ వచ్చారు.

ఇపుడు వర్మ వంతు అన్నట్లుగా ఆయన ఒక్కసారిగా బిగ్ సౌండ్ చేశారు అది అటూ ఇటూ తిరిగి ఇపుడు ఏకంగా పవన్ కళ్యాణ్ కే తగిలేలా ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే వర్మ వ్యాఖ్యలు పవన్ ని ఇరుకున పెట్టేలా ఉన్నాయని అంటున్నారు. దీని మీద జనసేన నుంది ఏ రకమైన కౌంటర్ వస్తుందో చూడాలని అంటున్నారు.