మహిళా కలెక్టర్ మాటలపై పవన్ ఆశ్చర్యం.. ప్రశంసల జల్లు
ఏపీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.
By: Tupaki Desk | 5 Dec 2025 6:50 PM ISTఏపీలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్ అండ్ టీచర్స్ మీటింగులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించగా, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. ఇక పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రి లోకేశ్ ఆలోచన అద్భుతంగా ఉందని కొనియాడారు. అదే సమయంలో పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా పనితీరు, ఆమె మాట్లాడే తీరును పవన్ ఆకాశానికెత్తేశారు.
చిలకలూరిపేటలో నిర్వహించిన మెగా పీటీఎంలో పవన్ పలు విషయాలను ప్రస్తావించారు. గురువును దైవంగా భావించే అరుదైన సంస్కృతి మనదని, తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయులే మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారని పవన్ అన్నారు. తల్లికి వందనం కార్యక్రమం 67 లక్షల మందికి అందించినట్లు తెలిపారు. పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ చాలా అద్భుతంగా ఉందని, వారు తయారు చేసిన పరికరాలు నైపుణ్యాన్ని తెలియజేస్తున్నాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పలు కీలక విషయాల గురించి మాట్లాడారు. పిఠాపురంలో విద్యార్థుల మధ్య చిన్న గొడవను కులాలకు అంటగట్టారని మండిపడ్డారు. కేరళలో తల్లిదండ్రుల సంఘాలు చాలా బలంగా ఉంటాయని, క్రియాశీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాల కారణంగా పిల్లల బలాబలాలు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు.
ఇదే సమయంలో కలెక్టర్ కృతికా శుక్లాను ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రశంసించారు. తెలుగు భాషను ప్రోత్సహించేందుకు కలెక్టర్ కృతికా శుక్లా చేస్తున్న కృషిని అభినందించారు. అనంతరం జరిగిన సభలో పవన్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలెక్టర్ కృతికా శుక్లా హర్యానా నుంచి వచ్చినా ఇక్కడ మన భాష గురించి పడుతున్న తపనను పవన్ గుర్తించారు. తెలుగు భాషపై ఆమెకు ఉన్న అభిమానం, నిబద్ధతను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు.
కృతికా శుక్లా తెలుగు మాట్లాడుతుంటే, ‘‘మీరు ఇక్కడే పుట్టారా’’ అని తాను అడిగానని పవన్ తెలిపారు. పక్క గుంటూరు - విజయవాడ ప్రాంతం వారేమో అనుకున్నాను, కానీ ఆమె లేదు, లేదు.. మాది హర్యానా అని చెప్పారు అని తెలిపారు. మన మాతృభాషను నేర్చుకోడానికి మనం ఇబ్బంది పడుతుంటే, హర్యానా నుంచి వచ్చినప్పటికీ ఆమె స్వయంగా తెలుగు నేర్చుకుని చక్కగా మాట్లాడుతున్నారని పవన్ సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు భాష పట్ల కృతికా శుక్లా చూపిన అభిమానానికి పిల్లలకు భాషను అర్థమయ్యేలా వివరించడానికి ఆమె పడుతున్న శ్రమకు పవన్ కల్యాణ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇతర ప్రాంతాల వారికి మన మాతృభాషపై ఉన్న గౌరవంపై పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇక సమావేశంలో ప్రసంగించిన పవన్ గ్రంథాలయంలో పిల్లల సంఖ్యకు సరిపడా పుస్తకాలు లేవన్న విషయం తెలుసుకుని తన సొంత డబ్బు నుంచి పూర్తి స్థాయిలో పుస్తకాలు అందిస్తానని హామీ ఇచ్చారు. పిల్లల ఆలోచనలు మెరుగు పర్చటానికి లైబ్రరీ ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.
చదువు చాలా బలమైన ఆయుధమని, లక్ష మెదల్లను కదిలించే శక్తి విద్యకు మాత్రమే సాధ్యమని అన్నారు. ఏ మాధ్యమంలో చదివామనేది ముఖ్యం కాదని.. విభిన్న అంశాలపై పట్టు సాధించడం ముఖ్యమని సూచించారు. అబ్దుల్ కలాం వంటి వారు తమిళ మాద్యమంలో చదివి మిసైల్ మ్యాన్‌గా, రాష్టపతిగా ఎదిగారని గుర్తుచేశారు. చిన్నప్పుడు సోషల్ టీచర్ చెప్పిన అంశాలు తనను ఇప్పుడు బలంగా నిలబెట్టాయన్నారు. విద్యార్థులను భవిష్యత్తు కోసం తయారు చేసే బాధ్యత ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు.
