Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోదీకి అదిరిపోయేలా... ‘ఆందీ’ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్ర‌ధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యం అంద‌రికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   17 Sept 2025 1:01 PM IST
ప్ర‌ధాని మోదీకి అదిరిపోయేలా... ‘ఆందీ’ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు
X

దేశ, విదేశాల నుంచి.. వ్యాపార‌, రాజ‌కీయ నాయ‌కుల నుంచి.. సాధార‌ణ ప్ర‌జ‌లు, స‌మాజంలోని ప్ర‌ముఖుల నుంచి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి...! ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని కొనియాడుతూ, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌ను ప్ర‌శంసిస్తూ... మ‌రికొంత కాలం దేశానికి సేవ చేయాల‌ని ఆకాంక్షిస్తున్నారు..! వీట‌న్నిటిలోకి ప్ర‌త్యేకంగా నిలిచింది ఓ శుభాకాంక్ష‌ల సందేశం...! స‌హ‌జంగా అంద‌రూ భావించిన‌దాని కంటే కాస్త భిన్నంగా, అంద‌రికంటే మిన్న‌గా ఉందీ ‘ఆందీ’ సందేశం...!

నాయ‌కా.. సాగిపో

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్ర‌ధాని మోదీతో ఉన్న సాన్నిహిత్యం అంద‌రికీ తెలిసిందే. ప‌వ‌న్ నిజాయతీని, వ్య‌క్తిత్వాన్ని అమితంగా ఇష్ట‌ప‌డే వ్య‌క్తి మోదీ. అందుకే అది ఎన్డీఏ స‌మావేశం అయినా, ల‌క్ష‌లాది మందితో కూడిన‌ బ‌హిరంగ స‌భ అయినా ప‌వ‌న్ క‌ల్యాణ్ ను మోదీ ప్ర‌త్యేకంగా ప‌ల‌క‌రిస్తుంటారు. మ‌రోవైపు మోదీ వ్య‌క్తిత్వం, నాయ‌క‌త్వం, క్ర‌మ‌శిక్ష‌ణ అంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూ అంతే స్థాయిలో గౌర‌వం కూడా. ఈ అనుబందం 2014 నుంచి మొద‌లై మ‌ధ్య‌లో కొంత కాలం మిన‌హా ఇప్ప‌టికీ 11 ఏళ్ల‌కు పైగా కొన‌సాగుతోంది. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఎన్డీఏ కూట‌మి ఏర్పాటు, గెలుపులో ప‌వ‌న్ కీలక పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. అందుకే ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్డీఏ ఎంపీల భేటీలో ప‌వ‌న్ ను మోదీ... ఏకంగా ఈయ‌న ప‌వ‌న్ (గాలి) కాదు ఆందీ (తుఫాను) అని సంబోధించారు. ఈ ఒక్క మాట సోష‌ల్ మీడియాలో వైర‌లైంది.

ప‌వ‌న్ చెప్పిన స్పెష‌ల్ శుభాకాంక్ష‌లివే..

ప్ర‌ధాని మోదీ 75వ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా అప‌ర కుబేరుడు రిల‌య‌న్స్ అధినేత ముఖేశ్ అంబానీ నుంచి ప్ర‌ముఖ న‌టుడు మాధ‌వ‌న్ వ‌ర‌కు.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ నుంచి హైద‌రాబాద్ లోని సాధార‌ణ అభిమాని వ‌ర‌కు త‌మ ప్రేమ‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న‌దైన శైలిలో ప‌వ‌ర్ మెసేజ్ ఇచ్చారు. మోదీని అచంచ‌ల క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త క‌లిగిన వ్య‌క్తిగా కొనియాడారు. దేశానికి మార్గ‌ద‌ర్శ‌క శ‌క్తిగా ఎదిగార‌ని ప్ర‌శంసించారు. సోష‌ల్ మీడియా మాధ్య‌మం ఎక్స్ లో ఈ మేర‌కు సందేశంతో పాటు ప‌వ‌న్ వీడియో విడుద‌ల చేశారు.

పాల‌నే కాదు ఆత్మవిశ్వాసం, ఐక్య‌త‌...

త‌న‌దైన శైలి పాల‌న‌తోనే కాదు.. దేశ ప్ర‌జ‌ల్లో ఆత్మ‌విశ్వాసం, ఐక్య‌త పెంపొందించార‌ని ప్ర‌ధాని మోదీని ప‌వ‌న్ కొనియాడారు. దేశంలోని ప్ర‌తి పౌరుడు మ‌న సంస్కృతి, వార‌స‌త్వం ప‌ట్ల గ‌ర్వ‌ప‌డేలా చేశార‌ని ప్ర‌శంచించారు. మోదీ చేప‌ట్టిన ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ గురించి కూడా ప్ర‌స్తావించిన ప‌వ‌న్.. దానిద్వారా దేశం కోసం అవిశ్రాంతంగా పాటుప‌డుతున్నార‌ని పేర్కొన్నారు. త‌న‌దైన చెక్కుచెద‌రని సంక‌ల్పం, స‌మ‌గ్ర‌త‌, ఆధ్యాత్మిక బ‌లంతో దేశం రూపునే మారుస్తున్న మోదీ జీవితం స్ఫూర్తిదాయకం అని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆకాశానికి ఎత్తారు. ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మోదీ దేశాన్ని నిరంతరం ముందుకున‌డిపేలా అచంచ‌ల శ‌క్తిని ఆయ‌న‌కు భ‌గ‌వంతుడు ప్ర‌సాదించాల‌ని ప‌వ‌న్ ఆకాంక్షించారు.