Begin typing your search above and press return to search.

పిఠాపురంపై పవన్ ముద్ర.. కేంద్రం నుంచి డైరెక్టుగా నిధులు!

పిఠాపురం రైల్వేస్టేషన్ ను ఓ సారి సందర్శించిన పవన్ అక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, ఆ తర్వాత స్వయంగా ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి అశ్వణీ వైష్ణవ్ తో మాట్లాడి రైల్వేస్టేషన్ కోసం రూ.37.25 కోట్లు సాధించారని చెబుతున్నారు.

By:  Tupaki Political Desk   |   8 April 2026 7:00 PM IST
పిఠాపురంపై పవన్ ముద్ర.. కేంద్రం నుంచి డైరెక్టుగా నిధులు!
X

సొంత నియోజకవర్గం పిఠాపురం అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారీగా నిధులు కేటాయించేలా పనిచేస్తున్న పవన్.. కేంద్రం నుంచి నిధుల వరద పారించేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం రైల్వేస్టేషన్ ను అమృత్ భారత్ పథకంలో చేర్పించి, భారీగా నిధులు విడుదల చేయించారు. పిఠాపురం రైల్వేస్టేషన్ ను ఓ సారి సందర్శించిన పవన్ అక్కడి అపరిశుభ్ర వాతావరణాన్ని చూసి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, ఆ తర్వాత స్వయంగా ఢిల్లీ వెళ్లి రైల్వే మంత్రి అశ్వణీ వైష్ణవ్ తో మాట్లాడి రైల్వేస్టేషన్ కోసం రూ.37.25 కోట్లు సాధించారని చెబుతున్నారు.

రాజకీయంగా తనకు ఉన్న పలుకుబడితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గంపై తనదైన ముద్ర వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే దాదాపు రూ.300 కోట్లతో వివిధ పనులు చేయిస్తున్నారు పవన్. దీనికి అదనంగా పిఠాపురం రైల్వేస్టేషన్ అభివృద్ధి నిమిత్తం రూ.37.25 కోట్లు విడుదల చేయించడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ కృషితో పిఠాపురం రైల్వే స్టేషన్ సకల సౌకర్యాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు కానుందని జనసేన కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద అభివృద్ధి చేయాలని పవన్ ఒకసారి చేసిన వినతిని రైల్వేశాఖ వెంటనే ఆమోదించడం గమనార్హం. జనవరిలో ఢిల్లీ పర్యటనకు వెళ్లిన పవన్, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో సమావేశం సందర్భంగా పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చించారు. ఆధ్యాత్మికంగా ముఖ్య పట్టణమైన పిఠాపురంలోని రైల్వే స్టేషన్ కి దూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తారని, వారి సౌకర్యార్ధం అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయాలని కోరారు.

డీసీఎం పవన్ అభ్యర్ధన పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించింది. పిఠాపురం స్టేషన్ ను అమృత్ భారత్ స్టేషన్ గా అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చింది. స్టేషన్ భవనం, ముఖద్వారంతోపాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో కూడిన విశ్రాంతిగది నిర్మాణం, అత్యాధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కేబులింగ్, ప్లాట్ ఫారం అభివృద్ధి, షెల్టర్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేపట్టనుంది. ఇక గత జనవరిలోనే పిఠాపురంలో రూ.211 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు పవన్ భూమిపూజ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం రూ.92 కోట్లు కేటాయించారు.

అంతేకాకుండా రూ.3.05 కోట్లతో నిర్మించిన 'సుద్ధగెడ్డ' వంతెనను ఇప్పటికే ప్రారంభించారు. మొత్తంగా, పిఠాపురాన్ని ఒక "మోడల్ నియోజకవర్గం"గా మార్చడమే లక్ష్యంగా పవన్ పాలన సాగిస్తున్నారు. స్థానిక సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెలా నియోజకవర్గ పర్యటనలు చేస్తూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా పిఠాపురంపై తనదైన ముద్ర వేస్తున్న పవన్ నియోజకవర్గ వాసుల కలలను నిజం చేస్తున్నారని అభినందనలు అందుకుంటున్నారు.