Begin typing your search above and press return to search.

8 వేల కోట్ల బడ్జెట్ లో గోదావరి శుద్ధికి ఒక్క రూపాయి లేదా? పవన్ సూటి ప్రశ్న!

గోదావరి పుష్కరాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించిన సమీక్ష సమావేశం వాడివేడిగా సాగింది.

By:  Tupaki Political Desk   |   26 May 2026 4:22 PM IST
8 వేల కోట్ల బడ్జెట్ లో గోదావరి శుద్ధికి ఒక్క రూపాయి లేదా? పవన్ సూటి ప్రశ్న!
X

గోదావరి పుష్కరాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించిన సమీక్ష సమావేశం వాడివేడిగా సాగింది. గోదావరి కాలుష్యంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ అధికారుల పనితీరుపై పలు సూటి ప్రశ్నలు సంధించారు. పుష్కరాల నిర్వహణ కోసం 8 వేల కోట్ల బడ్జెట్ కేటాయించామని, కానీ అధికారులు గోదావరి మురుగు కలవకుండా చూసేందుకు ఒక్క రూపాయి ఖర్చు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమండ్రి వద్ద గోదావరిలో కలుస్తున్న కాలుష్యంపై గణాంకాలతో మాట్లాడిన పవన్ అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారని అంటున్నారు.

పుష్కర ఏర్పాట్లపై పవన్ నిర్వహించిన సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైతే పుణ్యస్నానాలు చేసేందుకు మునుగుతామో అక్కడ గోదావరి కాలుష్యంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పుణ్య నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని చెబుతున్నామని, కానీ గోదావరిలో శుద్ది చేయకుండా కలుషిత జలాలను వదిలేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి భరిస్తుందని కాలుష్యాన్ని కలిపేస్తే ఎలా? అంటూ సూటిగా ప్రశ్నించారు. భారీ బడ్జెట్ లో రోడ్డు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అంటున్నారని కానీ, జలాలను శుద్ధి చేసేందుకు ఒక్క రూపాయి కూడా ఎందుకు బడ్జెట్ లో పెట్టలేదని ప్రశ్నించారు.

పీసీబీకి రూ.100 కోట్లు

గోదావరిలో కాలుష్యం నివారణకు తక్షణం వంద కోట్లు మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ నిధులతో గోదావరిలో అన్నిరకాల కాలుష్యానికి ఫుల్ స్టాప్ పెట్టేలా పనిచేయాలని సూచించారు. అధికారులు చొరవ తీసుకుని పనిచేస్తేనే కాలుష్య నివారణ సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను పెద్దది చేయొద్దని తనను కోరుతున్నారని, ప్రజలను మోసం చేసే పనిని తాను ఎలా చేయగలనని పవన్ ప్రశ్నించారు. భవిష్యత్తులో ప్రజలు తమను ప్రశ్నిస్తారని వ్యాఖ్యానించారు.

రద్దీ నివారణకు పక్కా ప్రణాళిక

గోదావరి పుష్కరాలపై జరిగిన సమీక్షలో గత అనుభవాల నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని పవన్ సూచించారు. పుష్కరాలకు లక్షల మంది భక్తులు తరలివస్తారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో ఎక్కడా తొక్కిసలాట జరగకుండా గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తమిళనాడులో 5 వేల మంది గుమిగూడితేనే భారీగా తొక్కిసలాట జరిగిందని గుర్తు చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకుని పుష్కరాల పనులు చేయాలని స్పష్టం చేశారు. రోజుకు 17 లక్షల మంది భక్తులు వస్తారని అంచనాలు ఉన్నాయని, ఆ మేరకు రద్దీని తట్టుకునేలా ఏర్పాట్లు ఉండాలని దిశానిర్దేశం చేశారు.