పవన్ ‘హనుమాన్’ ఫోర్స్.. ఇది నెక్ట్స్ లెవెల్
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పరిధిలోని అటవీ శాఖలో వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టారు.
By: Tupaki Desk | 3 March 2026 4:53 PM ISTఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పరిధిలోని అటవీ శాఖలో వినూత్న సంస్కరణలు ప్రవేశపెట్టారు. గతంలో ఏ అటవీ మంత్రి చూపని విధంగా ప్రత్యేక చొరవతో అటు అడవులు, ఇటు వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పవన్. ఇందులో భాగంగా ఆయన ‘హనుమాన్’ అనే ప్రత్యేక ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ‘హనుమాన్’కి శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి హనుమాన్ అనే పేరు ఎంచుకోవడం కూడా ఆసక్తికరంగా మారుతోంది.
హనుమాన్ అంటే ఆంజనేయుడు.. అజేయుడు అని ఎవరైనా భావించవచ్చు. స్వతహాగా హిందూ మత విశ్వాసాలను ఎక్కువగా అభిమానించే ఉప ముఖ్యమంత్రి పవన్ ఎంతో ఇష్టపడి ప్రవేశపెడుతున్న పథకానికి హనుమాన్ పేరు పెట్టడం వెనుక ఆయన భక్తిభావం కారణమని ఎవరైనా భావించొచ్చు. కానీ, హనుమాన్ స్కీమ్ కి పవన్ భక్తికి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చూరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని అర్థమని చెబుతున్నారు.
మానవ-వన్యప్రాణి మధ్య ఉన్న సంఘర్షణను నివారించడం, తగ్గించడం కోసం రూపకల్పన చేసిన సమగ్ర సాంకేతిక, శాస్త్రీయ కార్యక్రమమే హనుమాన్. ‘వసుధైక కుటుంబం అనే ఉన్నతమైన సిద్ధాంతాన్ని బలంగా నమ్మే దేశం మనది. సమస్త జీవకోటి, వన్యప్రాణులు ఇందులో అంతర్భాగం. మానవ మనుగడకు ప్రకృతి సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ అత్యంత ముఖ్యం. దీనిని దృష్టిలో పెట్టుకొనే అటవీ శాఖ ఆధ్వర్యంలో హనుమాన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చామ’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
ఇటీవల కాలంలో వన్య ప్రాణుల వల్ల పంట, పశు సంపదకి నష్టంతోపాటు మావన భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు పెరుగుతున్నందున ఈ నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వీటిలో వన్య ప్రాణుల సంరక్షణతోపాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించే అంబులెన్స్, రెస్క్యూ వాహనాలు ఉన్నాయి. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు మరింత కట్టుదిట్టంగా ముందుకు తీసుకువెళ్లనున్నారు.
వన్యప్రాణులను సంరక్షిస్తూనే పంటలు, పశువులు, ప్రజల ప్రాణాలు, ఆస్తుల సంరక్షణ చేపట్టేలా హనుమాన్ ప్రధాన కర్తవ్యంగా చెబుతున్నారు. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తక్షణ ప్రతిస్పందన, ఉపశమన చర్యలు, పరిహారం చెల్లింపు వ్యవస్థల్ని హనుమాన్ ఫౌండేషన్ నిర్వర్తిస్తుంది. పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, పోలీస్ శాఖలతోపాటు ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ అటవీశాఖ హనుమాన్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా తీసుకొచ్చిన ఈ హనుమాన్ ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించారు. ఇందులో 93 ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలు కాగా, మరో 7 వాహనాలు వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించేందుకు అవసరమైన అంబులెన్స్ లు ఉన్నాయి. వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, బైర్లుటిల్లో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ ట్రీట్మెంట్ సెంటర్లు, 19 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలు సిద్ధం చేశారు.
ప్రతి వాహనంలో అటవీ రేంజ్ ఆఫీసర్, జంతు వైద్య సిబ్బంది, ట్రైబల్ హెల్పర్స్ (గిరిజన), పారా వెటరేనియన్స్ తో కూడిన పూర్తి స్థాయి వ్యవస్థ ఉంటుంది. గ్రామ స్థాయిలో వన్య జీవి రక్షక్ (వజ్ర)ను అటవీ శాఖ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారు. వీరికి రెస్క్యూ కిట్లు ఇవ్వనున్నారు. గ్రామ స్థాయిలో పాములు, ఇతర జంతువుల నుంచి ఎదురయ్యే సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా వారికి శిక్షణ ఇచ్చామని ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు.
ఏఐ సహయంతో వన్యప్రాణుల కదలికలు
వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించడానికి ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనిని పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించారు. అటవీ సరిహద్దు ప్రాంతాల్లో జంతువుల వచ్చే ముందు ముందస్తు హెచ్చరికలు ఇచ్చే విధంగా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం. వన్యప్రాణుల వల్ల మానవ భద్రతకు ముప్పు కలగకుండా వశుధైక కుటుంబంలా కలిసి బతికే లక్ష్యంతో హనుమాన్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చామని పవన్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కోసం అటవీశాఖ అధికారులు, ఫ్రంట్ లైన్ సిబ్బంది ఎంతో అంకితభావంతో కష్టపడి పని చేశారని అభినందించారు.
