ఆర్ఎస్ఎస్ తరహాలో జనసేన.. డిప్యూటీ సీఎం పవన్ బిగ్ టార్గెట్ ఫిక్స్
ఏపీలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేనాని పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు.
By: Tupaki Political Desk | 16 Feb 2026 1:00 AM ISTఏపీలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో జనసేనాని పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నారు. మహా శివరాత్రి సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ విస్తరణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సమాజంలో అన్నివర్గాలకు పార్టీని చేరువ చేయాలని భావిస్తున్న పవన్ కేడర్ ను ఇకపై కొత్త పేర్లతో పిలవనున్నట్లు ప్రకటించారు. మిత్రపక్షం బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ పదాధికారులను పిలిచే తరహాలో ఈ పేర్లు ఉన్నాయి. ఇప్పటివరకు జనసేన కార్యకర్తలను జన సైనికులు అని, మహిళా కార్యకర్తలను వీర మహిళలుగా పిలిచేవారు. ఇప్పుడు కొత్తగా మూడు పేర్లను పవన్ ప్రతిపాదించారు. ఇవి వినేందుకు సంస్కృత పదాలుగా ఉన్నా, పార్టీ వర్గాల్లో ఆ పేర్లపై విస్తృత చర్చ జరుగుతోంది.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా తొలి సభ్యత్వాన్ని పవన్ స్వీకరించారు. ఇందుకోసం విరాళంగా రూ.2 కోట్లను పార్టీకి చెల్లించారు. ఈ సమయంలో పవన్ పార్టీ విస్తరణపై భావోద్వేగం వ్యక్తం చేశారు. పదకొండేళ్ల క్రితం కేవలం 150 మందితో పార్టీని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత 2021లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడితే 90 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకున్నట్లు వివరించారు. ఈ సంఖ్య ఎన్నికల ముందు 6 లక్షలకు పెరిగిందని, క్రమంగా ఇప్పుడు 12.8 లక్షలకు చేరుకుందని వవన్ వెల్లడించారు. పార్టీని చిన్న చిన్న వ్యాపారాలు, కూలి పనులు చేసుకునే వారి నుంచి బాగా చదువుకున్న విద్యావేత్తలు, వృత్తి నిపుణులు భాగస్వాములయ్యారని పవన్ ఆనందం వ్యక్తం చేశారు.
ఇక ఈ సందర్భంగా పవన్ పార్టీలో కేడర్ ను మూడు వర్గాలుగా విభజిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ఒక్కోవర్గంలో ఉన్నవారిని ఆయా పేర్లతో పిలుస్తామని వెల్లడించారు. పార్టీలో ఇకపై ఉద్యమి, సాధక్, ప్రదాతగా మూడు బృందాలు ఉంటాయని పవన్ వెల్లడించారు. జనసేన భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని, అలా పనిచేసేందుకు ముందుకు వచ్చేవారిని ‘ఉద్యమి’గా పిలుస్తామని చెప్పారు. అదేవిధంగా పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, నవతరంలో ప్రేరణ కలిగించేవారిని ‘సాధక్’గా వ్యవహరిస్తారు. ప్రజా, రాజకీయ పోరాటానికి పోరోక్షంగా తమవంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేధా సహాయ సహకారాలు అందించేవారిని ‘ప్రదాత’ అనే పేరుతో పిలుస్తారు. ఉద్యమి, సాధక్, ప్రదాత అన్న ఈ పదాలు వినేందుకు సంస్కృతంలా ఉన్నప్పటికీ ఆ పేర్లు పెట్టడానికి ప్రత్యేక కారణం ఉంటున్నారు.
కేడర్ కు ఇలాంటి పేర్లు పెట్టడం ద్వారా వారిపై పవిత్రమైన బాధ్యత మోపుతున్నట్లు భావిస్తారని అంటున్నారు. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌లోని 'ప్రచారక్', 'విస్తారక్', 'స్వయంసేవక్' వంటి పదజాలాన్ని గుర్తుచేస్తోంది. అంటే, రాజకీయాన్ని కేవలం ఓట్ల కోసం కాకుండా, ఒక 'లక్ష్యం' కోసం చేసే పనిగా మార్చడం పవన్ ఉద్దేశంగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు. పార్టీలో క్రమశిక్షణను పెంచడానికి, కార్యకర్తల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కల్పించడానికి ఈ పేర్లు దోహదపడతాయని చెబుతున్నారు. అంతేకాకుండా "నేను జనసేన కార్యకర్తను" అని చెప్పుకోవడం కంటే, "నేను ఒక సాదిక్" లేదా "ఉద్యమి" అని చెప్పుకోవడం ద్వారా వారిలో పదవులపై ఒక రకమైన గౌరవం, బాధ్యత పెరుగుతాయని అంటున్నారు.
మరోవైపు జనసేన సిద్ధాంతాల్లో సనాతన ధర్మం, భారతీయత పట్ల గౌరవం ఉందని చాటిచెప్పడం కూడా పవన్ ఉద్దేశంగా చెబుతున్నారు. ఈ పదాలు వాడటం ద్వారా పార్టీ మూలాలు భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉన్నాయని చెప్పడం పవన్ కళ్యాణ్ వ్యూహం కావచ్చు అంటున్నారు. మొత్తానికి, ఈ పేర్ల ద్వారా పవన్ కళ్యాణ్ జనసేనను ఒక "పొలిటకల్్ ఆర్మీ" తరహాలో తీర్చిదిద్దాలనుకుంటున్నారని అర్థమవుతోందని విశ్లేషిస్తున్నా. ఇది సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, ఒక క్రమశిక్షణ కలిగిన సంస్థాగత నిర్మాణానికి సంకేతంగా చెబుతున్నారు.
