Begin typing your search above and press return to search.

పన్నీరు స్నానం చేయించక్కర్లేదు.. కెమికల్ స్నానం చేయించకూడదు కదా? అధికారులపై పవన్ ఆగ్రహం!

రాజమండ్రి పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

By:  Tupaki Political Desk   |   26 May 2026 2:56 PM IST
పన్నీరు స్నానం చేయించక్కర్లేదు.. కెమికల్ స్నానం చేయించకూడదు కదా? అధికారులపై పవన్ ఆగ్రహం!
X

రాజమండ్రి పర్యటనలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గోదావరి కాలుష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నదిలోకి కలుషిత జలాలు వదిలేస్తున్నా, అధికారులు పట్టించుకోకపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. మంత్రి దుర్గేష్ పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. టూరిజం మంత్రిగా అన్నీ చూసుకోవాలి? కదా అంటూ అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలోనే పవన్ నిలదీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. గోదావరిలో కాలుష్యానికి రాజమండ్రిలోని ఆంధ్ర పేపర్ మిల్స్ కారణమని అధికారులు, ప్రజాప్రతినిధులు పవన్ కు వివరించారు. మంగళవారం ఉదయాన్నే వెంకట నగరం ప్రాంతం నుంచి గోదావరి నది మధ్యలో ఉన్న తూర్పులంక లాగూన్స్ వరకు పడవలో వెళ్లి ఆయన స్వయంగా తనిఖీలు చేపట్టడం తీవ్ర సంచలనంగా మారింది.

మొబైల్ కిట్స్‌తో అక్కడికక్కడే పరీక్షలు

పేపర్ మిల్స్ యాజమాన్యం తూర్పులంకలోని ప్రత్యేక మడుగుల్లోకి కాలుష్యకారక రసాయన నీటిని విడిచిపెడుతోందని పవన్ గుర్తించారు. ఈ నీటిని ఏ మేరకు శుద్ధి చేస్తున్నారు? అసలు ఆ ప్రాంత జలాల్లో కాలుష్యం ఎంత మేర ఉందనే విషయాలను పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. అక్కడికక్కడే నీరు, మట్టి నమూనాలను సేకరించి, మొబైల్ కిట్స్ ద్వారా తక్షణ పరీక్షలు నిర్వహించగా.. నీటిలో ప్రమాదకర స్థాయి కాలుష్యకారకాలు ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. మడుగుల్లో విపరీతంగా గుర్రపుడెక్క పేరుకుపోవడంపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆయన నిలదీశారు. పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీలపై భూములు ఇచ్చి ప్రోత్సహిస్తుంటే.. కనీసం పర్యావరణ స్పృహ కూడా లేకపోతే ఎలా? ఇంత కాలుష్యం విడుదల చేస్తున్నా ఆంధ్ర పేపర్ మిల్స్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? అంటూ పీసీబీ అధికారులపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

రూ. 13 కోట్ల బకాయిలా?

ఈ తనిఖీల్లో అధికారుల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాలుష్యం ఒకవైపు ఉంటే.. సదరు పరిశ్రమ ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ. 13 కోట్ల బకాయిలను ఎందుకు వసూలు చేయలేకపోయారని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని పవన్ ప్రశ్నించారు. ‘అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించకపోతే.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది మేమేనంటూ అధికారుల తీరును తప్పుపట్టారు.

మన పిల్లల్ని ఈ నీళ్లలో స్నానం చేయించగలమా?

ఈ తనిఖీలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్) వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కలుషిత నీటి రంగు, అక్కడి దుస్థితిని చూసి పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి విషపూరితమైన నీటిని నదిలోకి వదిలితే.. అక్కడ మన పిల్లల్ని స్నానం చేయించే సాహసం మనం చేయగలమా? అని పవన్ ప్రశ్నించిన తీరు సోషల్ మీడియాలో నెటిజన్లను ఆలోచింపజేస్తోంది. గుళ్ళు, గోపురాల చుట్టూ తిరిగితే పుణ్యం వస్తుందో రాదో కానీ, ఈ మురుగునీటిలో మునిగితే మాత్రం జబ్బులైతే ఖచ్చితంగా వస్తాయని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గలగల పారాల్సిన గోదావరి, కృష్ణమ్మలు విలవిలాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుష్కరాలలో గోదావరి నీరు స్వచ్ఛంగా ఉంటుందని లక్షల మంది భక్తులు తరలివస్తారని, కానీ, జలాలు కాలుష్యంగా మారిపోతే భక్తులు జబ్బుల బారిన పడతారని హెచ్చరించారు.

నిబంధనలు అందరికీ ఒక్కటే.. పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ

పరిశ్రమల కాలుష్యం విషయంలో కాలుష్య నియంత్రణ నిబంధనలను ఎవరైనా సరే కచ్చితంగా పాటించాల్సిందేనని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆంధ్ర పేపర్ మిల్స్‌కు తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. చివరగా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘పరిశ్రమలు నిబంధనలు పాటించేలా అధికారులు కఠినంగా పని చేయాలి. క్షేత్రస్థాయిలో మీకు చట్టపరంగా లేదా రాజకీయంగా ఏవైనా సమస్యలు ఉంటే నిస్సంకోచంగా చెప్పండి. ముఖ్యమంత్రితో మాట్లాడి వాటిని పరిష్కరిస్తాను. కానీ, పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే మాత్రం సహించేది లేదు" అని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.