పవన్ సీఎం గా ఆయన డిప్యూటీ సీఎంగా... ఈ స్కెచ్ ఎవరిది ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతకంలో రాజయోగం ఉందని జ్యోతీష్య పండితులు గట్టిగానే చెబుతున్నారు.
By: Tupaki Desk | 11 Jun 2025 6:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాతకంలో రాజయోగం ఉందని జ్యోతీష్య పండితులు గట్టిగానే చెబుతున్నారు. పవన్ జాతకం బాగా ఉండబట్టే ఆయన తొలిసారి ఎమ్మెల్యే అవుతూనే ఉప ముఖ్యమంత్రి హోదాతో ఉన్నారని చెబుతున్నారు.
సరే ఇవన్నీ జ్యోతిష్యాన్ని నమ్మే వారి ఆలోచనలు. రాజకీయ పరిస్థితులు పరిణామాల వల్ల పవన్ కి కూటమిలో అత్యధిక ప్రాధాన్యత లభిస్తోంది అన్నది వాస్తవమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక పవన్ వెనక బీజేపీ ఉందని ఆ పార్టీ ఏపీలో బలపడాలంటే పవన్ అవసరం తప్పనిసరి అని అంటున్నారు.
అలా జాతీయ స్థాయిలో బీజేపీ ప్రభ వెలుగుతోందని, బలమైన ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారని, ఈ రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సిన రాజకీయ అనివార్యత 2024 ఎన్నికల్లో తెలుగుదేశానికి వచ్చిందని కూడా విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పాటు నరేంద్ర మోడీని ఎంతో ఆరాధిస్తారు అభిమానిస్తారు.
ఈ ఇద్దరూ జన నాయకులని అభివృద్ధి కాముకులు అన్నది పవన్ భావన. ఇక ఏపీలో చంద్రబాబు తర్వాత వారసుడు ఎవరు అంటే అందరూ నారా లోకేష్ పేరు చెబుతారు. తాజాగా ఒక జాతీయ చానల్ కి బాబు ఇచ్చిన ఇంటర్వూలో సైతం లోకేష్ ఎపుడు ముఖ్యమంత్రి అవుతారు అనే ప్రశ్నించారు.
దీనిని బట్టి చూస్తే కూటమిలో ఉప ముఖ్యమంత్రి హోదాతో ఉన్నా కూడా పవన్ కి సీఎం పదవి అన్నది దక్కడం కష్టమే అని అంటున్నారు. అయితే ఆయన సీఎం కావాలీ అంటే ఎలా జరగచ్చు అంటే దానికి తెలంగాణాకు చెందిన రాజకీయ విశ్లేషకుడు, ప్రొఫెసర్ అయిన కంచ ఐలయ్య తనదైన శైలిలో రాజకీయ భాష్యం చెప్పారు.
ఆయన తాజాగా ఒక న్యూస్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బీజేపీకి ఏపీలో రాజకీయ విస్తరణ మీద ఆశలు ఉన్నాయని అన్నారు. అందువల్ల పవన్ జనసేన పార్టీని బీజేపీ ఎప్పటికైనా విలీనం చేసుకుని ఆయనను తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించవచ్చు అని చెప్పారు. అంతే కాదు మహారాష్ట్ర తరహా రాజకీయాలు ఏపీలో జరిగే అవకాశాలు ఉన్నాయని కంచ ఐలయ్య చెబుతున్నారు.
మహారాష్ట్రలో ఒక ఏక్ నాధ్ షిండేను బయటకు తెచ్చి బలమైన శివసేనకు బీజేపీ దెబ్బ కొట్టింది, అదే తరహాలో ఏపీలో బీజేపీ చేయవచ్చు అని ఐలయ్యా చెబుతున్నారు అంటే ఏపీలో భవిష్యత్తు రాజకీయం అనూహ్యంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక కాపు సామాజిక వర్గానికి సుదీర్ఘకాలంగా ఉన్న ముఖ్యమంత్రి కోరికకు బీజేపీ రాజకీయ పాచిక తోడు అయితే ఏపీలో ఏమైనా జరగవచ్చు అన్నది ఆయన మార్కు విశ్లేషణగా ఉంది అంటున్నారు. ఇక పవన్ ని సీఎంగా ప్రకటించి ఉప ముఖ్యమంత్రి పదవిని వారణాసి రామ్ మాధవ్ కి ఇస్తారు అని ఆయన చెప్పడం మరో విశేషం.
అయితే ఇదంతా ఎపుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే కనుక ఆయన దాని మీద ఏమీ చెప్పలేదు కానీ రాజకీయాల్లో లెక్కలు అన్నీ సెట్ అయితే ఏది ఎపుడైనా జరగవచ్చు అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే మోడీని దేశంలో ఏ నాయకుడూ తిట్టనంతగా చంద్రబాబు తిట్టి మళ్ళీ అదే మోడీతో పొత్తు పెట్టుకున్నారు అంటే అది రాజకీయంగా అనివార్యత తప్ప అందులో మరేదీ లేదని అంటున్నారు.
అంటే ఎవరికి ఎవరి మీద అభిమానాలూ ఆప్యాయతలు నిండుగా కుమ్మరించిపోయి కూటమిని కట్టలేదని ఆయనే చెబుతున్నారు. ఆయన చెప్పారని కాదు కానీ పొత్తులు ఎత్తులు అన్నీ రాజకీయ అవసరాలే అని అందరికీ తెలిసిందే. ఇక ఏపీలో బీజేపీ ఆలోచనలు వ్యూహాలు ఎత్తుగడల మీద అపర చాణక్యుడు అయిన చంద్రబాబు అప్రమత్తంగానే ఉంటున్నారని కూడా అంటున్నారు.
అదే సమయంలో బీజేపీ గురించి అన్నీ తెలుసు కనుకనే ఆయన భయాలు సందేహాలు ఆయనకు ఉన్నాయని కంచ ఐలయ్య లాంటి వారు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో కూటమి ఫుల్ ఖుషీ ఉంది. ఏడాది పాలన పూర్తి చేసుకుంది. కానీ నల్లనివి అన్నీ నీళ్ళూ కాదు, తెల్లనివి అన్నీ పాలూ కాదన్న నిజమే కూటమికి స్థిరత్వం పట్ల ఎప్పటికపుడు సందేహాలు వ్యక్తం చేసేలా ఉందని అంటున్నారు.