పవన్ ఎక్కడ ?
పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే, అంతే కాదు టీడీపీ కూటమి ప్రభుత్వంలో బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి.
By: Tupaki Desk | 24 April 2025 6:13 PM ISTఅవును పవన్ ఎక్కడ. దీని మీదనే అంతా చర్చిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రోజున ఒక బాధ్యత కలిగిన ఎమ్మెల్యే, అంతే కాదు టీడీపీ కూటమి ప్రభుత్వంలో బాధ్యత కలిగిన ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వంలో చంద్రబాబుతో కలసి ఆయన పనిచేస్తున్నారు. ఈ ఇద్దరూ కూటమికి కీలకం అని అంతా అనుకుంటున్న వేళ పవన్ మాత్రం చడీ చప్పుడూ లేకుండా ఉన్నారన్నది అంతా అనుకునే మాట.
అదేదే సినిమాలో పాట మాదిరిగా మౌనమే నా భాషా అని పవన్ అనుకుంటున్నారా అని భావిస్తున్నారు కూడా. నిజానికి పవన్ కి మరో పేరు ప్రశ్న. ఆయన ప్రశ్నిస్తాను అనే అధికారంలోకి వచ్చారు. అలాగే ఆయన అందలం ఎక్కారు. ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళ పాటు బాగానే ప్రశ్నించారు. దాంతో ఆయన నాయకత్వ పటిమను చూసి అంతా శభాష్ పవన్ అన్నారు.
ఇలాంటి వారు అధికారంలో ఉండాలని కూడా బలంగా కోరుకున్నారు. దాని ఫలితమే ఆయన డిప్యూటీ సీఎం పదవి. అయితే గడచిన పది నెలల కాలంలో పవన్ ప్రశ్నించిన సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. అది కూటమి ప్రభుత్వం అయినా కూడా తప్పు ఉంటే తప్పు అని మొదట్లో పవన్ బాగానే నిలదీసిన సందర్భాలు ఉన్నాయి. సీజ్ ది షిప్ అని అన్నా దాని కంటే ముందు లా అండ్ ఆర్డర్ మీద ఆయనే నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినా పవన్ గ్రేట్ అనుకున్నారు.
ఇక తిరుపతిలో ముక్కోటి ఏకాదశి టికెట్ల పంపిణీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట నేపధ్యంలో పవన్ టీటీడీ బోర్డునే టార్గెట్ చేశారు. దాంతో పవన్ కి ఆస్తిక జనుల నుంచి మంచి మద్దతు లభించింది. అయితే ఇటీవల కాలంలో ఏపీలో అనేక సంఘటలు జరుగుతున్నా పవన్ వాయిస్ ఏమిటి అన్నది తెలియడంలేదు అంటున్నారు.
ఇపుడు చూస్తే ఏపీలో ఉర్సా కుంభకోణం అని అంటున్నారు. అది కూడా కూటమి ఎంపీ మీద సాక్షాత్తూ ఆయన సోదరుడే ఆరోపణలు చేస్తున్నారు. ఇది అంతకంతకు తీవ్రమైన ఇష్యూగా మారుతోంది. అయినా సరే పవన్ మాట్లాడకపోవడం పట్ల అంతా ఆలోచిస్తున్నారు. ఉత్తిత్తి కంపెనీలకు భూములు పెద్ద ఎత్తున ఇస్తున్నారని విమర్శలు వస్తున్న నేపధ్యంలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేతగా పవన్ ఈ ఇష్యూ మీద రెస్పాండ్ కావాల్సి ఉంది కదా అంటున్నారు.
విశాఖ వంటి ప్రధానమైన ఏరియాలో 99 పైసలు లెక్కన మూడు వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఇవ్వడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపధ్యంలో పవన్ నోరు విప్పాలి కదా అని అంటున్నారు. అంతే కాదు ఏపీలో పారిశ్రామిక విధానం మీద జనసేన తన స్టాండ్ ఏంటో చెప్పి పరిశ్రమలు వచ్చేలా చూడడమే కాకుండా ప్రజల సొత్తు కూడా ఇబ్బందుల పాలు కాకుండా చూడాల్సి ఉంది కదా అని అంటున్నారు.
మరో వైపు చూస్తే అమరావతి రాజధాని పేరు మీద గతంలోనే 34 వేల ఎకరాల భూములను సేకరించారు వాటి పనులే మే 2న ప్రారంభం అవుతున్నాయి. అయితే ఇపుడు మరో 40 వెల ఎకరాలను అమరావతి రాజధాని విస్తరణ కోసం ఇంకా భూములు తీసుకుంటారు అని ప్రచారం జరుగుతుంది దీని మీద కూడా భూములు ఇచ్చిన రైతులతో పాటు అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి.
అమరావతికి ఎక్కువ భూములు అవసరం లేదని గతంలో చెప్పిన వారూ ఉన్నారు. ఇక జనసేన అయితే అమరావతి రాజధానిని కట్టమని అంటోంది. మరి ఈ అదనం భూముల విషయంలో ఆ పార్టీ ఆలోచనలు ఏమిటో చెప్పాల్సి ఉంది కదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఇవన్నీ ఫవన్ కి తెలిసి జరిగాయా లేదా అన్నది కూడా చర్చకు వస్తోంది.
అలాగే ఏపీలో కూటమి పేరు మీద సాగుతున్న పాలనలొ పవన్ భాగస్వామ్యం ఎంత ఉంది అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఒకవేళ పవన్ కి ఈ కీలకమైన నిర్ణయాల గురించి ఏమీ తెలియకపోయినా ఇబ్బందే. ఒకవేళ తెలిసి జరుగుతున్నా ఆయన చెప్పాల్సింది చెప్పి నిర్మాణాత్మకంగా వ్యవహరించకపోయినా ఇబ్బందే అని అంటున్నారు.
ఇవే కాదు పది నెలలలో ఏపీలో సాగుతున్న కూటమి పాలన గురించి పవన్ కి ఎంత వరకూ తెలుసు. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలలో ఆయన పాత్ర ఏ మేరకు ఉంది అని అంటున్నారు. ఎందుకంటే ఏ డెసిషన్ అయినా కూటమి పేరు మీదనే బయటకు ప్రొజెక్ట్ అవుతుంది. రేపటి రోజున ప్రజా వ్యతిరేక నిర్ణయం అయితే ఆ విమర్శలు జనసేనకు కూడా వస్తాయని ఆ పార్టీ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని అంటున్నారు.
