అమరావతి కోసం.. అలుపెరుగని పోరు: జనసేన స్పెషల్ వీడియో
వైసీపీ హయాంలో అమరావతిని తోసిరాజని.. మూడు రాజధానుల ప్రకటన చేసిన వెంటనే.. రాజధాని రైతులు ఉత్తుంగ తరంగం మాదిరిగా ఉద్యమానికి నాంది పలికారు.
By: Garuda Media | 4 April 2026 12:31 AM ISTఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లులకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. ఇక, రాష్ట్రపతి ద్రౌప ది ముర్ము సంతకంతో.. ఈ బిల్లు చట్టంగా మారి.. అమరావతికి రక్షణ ఛత్రం కానుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. అమరావతి కోసం అలుపెరుగని పోరు చేసిన అన్నదాతల పక్షాన తాము ఏవిధంగా పోరాటం చేసిందీ.. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఎప్పుడెప్పుడు ఎలా స్పందించిందీ ఈ వీడియోలో వివరించారు.
వైసీపీ హయాంలో అమరావతిని తోసిరాజని.. మూడు రాజధానుల ప్రకటన చేసిన వెంటనే.. రాజధాని రైతులు ఉత్తుంగ తరంగం మాదిరిగా ఉద్యమానికి నాంది పలికారు. ఈ సమయంలో పవన్ కల్యాణ్.. నేరుగా రాజధాని ప్రాంతానికి వచ్చారు. అయితే.. ఆయన వస్తున్నారని తెలిసిన వైసీపీ ప్రభుత్వం ముళ్ల కంచెలు వేసి వెళ్లకుండా అడ్డుకుంది. అప్పటికి టీడీపీతో జనసేనకు పొత్తు లేదు. ఈ క్రమంలో పవన్ ఒంటరిగానే తన పార్టీ శ్రేణులతో కలిసి.. ముళ్లకంచెలు దాటుకుని మరీ అన్నదాతల వద్దకు వెళ్లి భరోసా కల్పించారు.
ఈ సమయంలో రాజధాని రైతులు తాము పడుతున్న ఇబ్బందులను .. పోలీసుల దాష్టీకాలను ఆయనకు వివరించారు. లాఠీ లు విరిగేలా తమను బాదారంటూ.. ఓ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన తీరును ఈవీడియోలో జనసేన ప్రస్తావించింది. రైతులను ఓదార్చడంలో భాగంగా పలుమార్లు జనసేన అధినేత అక్కడ పర్యటించారు. ఒకసందర్భంలో ఆయన కాన్వాయ్‌ను కూడా అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు.. ఆయన కాన్వాయ్‌లో నుంచే రైతులను ఉద్దేశించిప్రసంగించారు. రైతులకు తాము అండగా ఉంటామని.. ఏపీకి ఏకైక రాజధాని అమరావతేనని పవన్ చేసిన ప్రంసగాలను ఈ వీడియోకు జోడించారు.
ఆ తర్వాత.. 2024 ఎన్నికల సమయంలో జరిగిన పలు బహిరంగ సభల్లోనూ అమరావతి రైతులపక్షాన జనసేన తన వాదనను బలంగా వినిపించిన తీరునుకూడా ఈ వీడియోలో కళ్లకు కట్టారు. అలానే.. అసెంబ్లీలో గత నెల తీర్మానం చేసినప్పుడు పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం.. రాజధాని రైతుల త్యాగాలను ప్రస్తావించిన తీరును వివరించారు. రైతుల త్యాగాలను వృథా కానివ్వబో మని.. ఏపీకి రాజధానిగా అమరావతే ఉంటుందని ఆయన స్పష్టం చేసిన విధానాన్ని కూడా వీడియోలో స్పష్టంగా వివరించారు. ఇక, పార్టీ కార్యాలయంలో జరిగిన పలు కార్యక్రమాల్లోనూ రాజధానికి అనుకూలంగా చేసిన ప్రకటనలను వివరించారు. ఇలా 2 నిమిషాల 8 సెకెన్ల నిడివి ఉన్న వీడియోను పోస్టు చేశారు.
