పవన్ సవాల్....వైసీపీ శివాలు!
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన కాదు కానీ రాజకీయ విమర్శలతో ఏపీ రాజకీయాల్లో మంటలనే రేపారు.
By: Tupaki Desk | 6 July 2025 1:00 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకాశం జిల్లా పర్యటన కాదు కానీ రాజకీయ విమర్శలతో ఏపీ రాజకీయాల్లో మంటలనే రేపారు. ఆయన వైసీపీ మీద తీవ్ర విమర్శలే చేశారు. వైసీపీ మళ్ళీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామని అతి పెద్ద సవాల్ నే విసిరారు.
వైసీపీ ఎప్పటికీ అధికారంలోకి రాదని పవన్ అంటున్నారు. అంతే కాదు మరో పదిహేనేళ్ల పాటు ఏపీలో టీడీపీ కూటమి పవర్ లో ఉంటుందని ఆయన స్పష్టంగా చెప్పారు. చంద్రబాబు పాలనానుభవం ఏపీకి చాలా అవసరం అని పవన్ నొక్కి చెబుతున్నారు.
అందుకే మరిన్ని టెర్ములు టీడీపీ అధికారంలోకి రావాలని ఆయన బలంగా కోరుకుంటున్నట్లుగా స్పష్టంగా చెబుతున్నారు. వైసీపీ పాలన అంతా అరాచకం విద్వంసంగా సాగింది అని కూడా గుర్తు చేస్తున్నారు. ఇలా పవన్ వైసీపీ ఆశల మీరు పూర్తిగా నీళ్ళు పోశారు. ఏపీలో జగన్ టూర్లకు జనాల నుంచి వస్తున్న స్పందనతో ఏపీలో గాలి మార్పు మొదలైందని ఎపుడు ఎన్నికలు పెట్టినా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేతలు తెగ హుషార్ చేస్తున్నారు.
అయితే పవన్ మాత్రం వైసీపీకి అధికారం అన్నది ఒక కల అని చెప్పేస్తున్నారు అధికారంలోకి తాను ససేమిరా రానీయను అని అంటున్నారు. దీంతో వైసీపీ ఒక్కసారిగా మండిపోతోంది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని వెంటనే మీడియా ముందుకు వచ్చేశారు. వైసీపీని అధికారంలోకి రానీయకపోవడానికి అసలు నువ్వు ఎవరు పవన్ అని ఆయన గట్టిగానే నిలదీశారు.
పవన్ తలచుకుంటే ఏపీలో రాజకీయం మారిపోతుందా అని కూడా ప్రశ్నించారు. ప్రజలు అసలైన న్యాయ న్యాయ నిర్ణేతలు అన్నది గుర్తు చేసుకోవాలని అన్నారు. జగన్ ని గెలిపించేది ప్రజలని మధ్యన పవన్ ఎవరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీలో ఏడాది కూటమి పాలన ఎలా ఉందో ముందు పవన్ చెక్ చేసుకోవాలని ఆయన కోరారు.
పవన్ తన సొంత శాఖల మీదనే ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదని అన్నారు. కేంద్రం రెండు విడతలుగా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తే వాటిని ఏపీ ప్రభుత్వం పంచాయతీలకు ఇవ్వకుండా వేరే వాటికి వాడేసిందని దాని మీద పవన్ పోరాడారా అని ప్రశ్నించారు. అంతే కాదు పన్నుల ద్వారా ఇతర సీనరేజిల ద్వారా పంచాయలతీలకు వచ్చే జనరల్ ఫండ్స్ ని కూడా ఏడాది కాలంగా ఏపీ ప్రభుత్వం తన దగ్గర అట్టేబెట్టుకుంటే పవన్ ఏమి చేస్తున్నారు అని నిలదీశారు.
పవన్ ఎపుడో ఒకసారి బయటకు వస్తారని చంద్రబాబుకు అనుకూలంగా ఆయన మాట్లాడి సవాళ్ళు చేస్తారని ఆయన ఫైర్ అయ్యారు. ఎవరైనా పార్టీ పెట్టేది తాము సొంతంగా అధికారంలోకి రావడానికి ప్రజలకు మేలు చేయడానికి మాత్రమే అని కానీ పవన్ మాత్రం పార్టీ పెట్టింది చంద్రబాబుని అధికారంలోకి తీసుకుని రావడం కోసమని పేర్ని నాని సెటైర్లు వేశారు.
వైసీపీని అధికారంలోకి రానీయమని అంటున్న పవన్ తాను సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయగలరా అని వైసీపీ తరఫున ఆయన ప్రతి సవాల్ చేశారు. ఒంటరిగా పోటీ చేయలేని పవన్ తమకు సవాల్ విసరడం మీద వైసీపీ నేతలు మండిపోతున్నారు.
ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాణ్ వైసీపీని అధికారంలోకి రానీయను అని ఒకటికి పదిసార్లు చెప్పడం మాత్రం వారికి ఏ మాత్రం నచ్చడం లేదు అందుకే పవన్ ని సొంతంగా పోటీ చేయమని గత సవాల్ నే ముందుకు తెస్తున్నారు. అయితే దీనికి జనసేన నుంచి జవాబు ఎపుడో ఉంది. అంతా కలిసి ఏపీ అభివృద్ధి కోసం కూటమి కట్టామని చెబుతూనే ఉన్నారు. మరి కూటమిలో చీలిక వస్తే తప్ప వైసీపీ గెలవదా అని జనసేన నేతలు వైసీపీని ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి పవన్ చేస్తున్న ఈ సవాళ్ళు వైసీపీకి నిద్రపట్టనీయడం లేదు అని అంటున్నారు.